చంద్రుడి మీద దిగిన ముగ్గురిలో ఒకాయనకు అరబీ లో అజాన్ వినబడి
తరువాత ముస్లిం గా మారాడని అప్పట్లో ఒక వార్త మన మధ్య తిరుగులాడింది. ఏలియన్లు హలో
అని ఇంగ్లీషులో అదేపనిగా మన అంతరిక్ష యాత్రీకులను పలకరిస్తున్నారట.భూమిమీద టెలిస్కోపుల్లో 2007 నుండి గ్రహాంతరవాసుల
పలకరింపులు పేలుళ్ళలాగా వినిపిస్తూ ఉన్నాయట.ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలోని
ఏలియన్ల పేలుళ్ళ పలకరింపులను ఖగోళ శాస్త్రవేత్తలు అత్యంత ఆసక్తిగా
గమనిస్తున్నారట.సిగ్గులేని వాడిని చిటికేస్తే ఆరు ఆమడల దూరంనుండి ఆలకించాడట.పేదవాడి
మొరను వినటానికే దిక్కులేని సమాజంలో గ్రహాల పేలుళ్ళ శబ్దాన్నే హలోగా భావిస్తున్నారు మన శాస్త్రవేత్తలు.
గ్రహాంతరవాసులు భూమిమీద మనుషుల్ని పలకరించటానికి పలవరించిపోతున్నారని మనకు
నూరిపోస్తున్నారు. భూమిమీద శరణార్ధులను పలకరించే మనుషులు లేరు.యుద్ధబాధితులను
వలసపోయే పేద కూలీలను పట్టించుకోరు గానీ ఎక్కడో ఉన్న గ్రహాంతర వాసుల కోసం కలలు కంటున్నారు. మృదు
శబ్దానికి మధు శబ్దానికీ తేడా ఏమిటిరా అంటే వట్రసుడి అన్నట్లు ఉంది శాస్త్రవేత్తల
పనితీరు. అసలు ఏలియన్ల అరుపులు సరిగా వినపడకపోయినా వాళ్ళు ఇంగ్లీషులోనే హలో అని పిలుస్తున్నారని
ఊహిస్తున్నారు.అంతరిక్ష దైవిక శబ్ధాలన్నీ సంస్కృతం,అరబ్బీ,ఇంగ్లీషుల్లోనే విబడుతున్నాయిగానీ తెలుగులో ఒక్కపిలుపూ లేదు. మొండి చేతి
వాడికి నువ్వులు తినటం నేర్పినట్లు ఏలియన్లకే పాఠాలు నేర్పటానికి మానవులు ప్రయత్నిస్తున్నారు.ఇదంతా
చూచిన తోటి శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసుల
కోసం మన గ్రహానికి ఇంత అర్ధంపర్ధం లేని ఖర్చు
అనవసరం అంటున్నారు.ఏలియన్లు నిజంగావుంటే అయిదు కాంతి సంవత్సరాల దూరాన్ని దాటి మనదాకా వస్టేగానీ
రుజువు దొరకదు.వాళ్ళ రూపాలు ఎలా ఉంటాయో ,వాళ్ళ భాష ఏమిటో ,వాళ్ళు ఏమి తింటారో,వాళ్ళ వాహనాలు ఏమిటో అవన్నీ
తెలిశాక మనం కూడా వారితో మాట కలపవచ్చు గానీ ఏ ఆధారాలు సరిగ్గా తెలియకముందే ఊహల
ప్రయోగాలు దండగ అంటున్నారు. అయినా వీళ్ళ ఉత్సాహం ఆగటం లేదు.మన తెలుగు ప్రాంతం అదిలాబాద్
అడవుల్లో ఏలియన్లు దిగారనీ ,ఎగిరే పళ్ళాలలో వచ్చి అక్కడ
తిరుగుతున్నారనీ,చంద్రగ్రహణం రోజున భూమిపై దిగి విహరించి
వెళ్ళిపోతున్నారనీ, వాళ్ళు మన కంటే చాలా తెలివైనవాళ్ళనీ ఏదో నాటికి మనకు
ఎదురుపడతారని మన పనిపడతారనీ వాళ్ళు చేసే సహాయంతో మనదరిద్రం తీరుతుందనీ పుకార్లు వ్యాపింపజేశారు.కొంతమంది
అయితే ఏలియన్లు తమను పలకరించారనీ కరచాలనం కూడా చేశారనీ గొప్పలు పోయారు.
నాసా వాళ్ళయితే భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో
సూర్యుడి చుట్టూ తిరుగుతూ గ్రహాంతర జీవుల్ని వెతికి పట్టుకునేలా ఒక ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపారు. గ్రహాంతర వాసులు ఉన్నా వాళ్ళతో
మనకెందుకు? మనం వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. విశ్వాంతరాళాల్లో
ఎక్కడో ఇతర గ్రహాలపై మాత్రమే కాదు. నక్షత్రాల సరసన....లేదంటే గ్రహాల మధ్యన ఉండే
ప్రదేశంలో తేలుతూ కూడా ఉండవచ్చు. గగనాంతర రోదసిలో కనీసం వంద బిలియన్ల పాలపుంతలున్నాయి.
వాటిల్లో కోట్లాది నక్షత్ర సమూహాలున్నాయి. ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక్క
భూమిమీద మాత్రమే ప్రాణికోటి ఉంటుందా?ఇన్ని పాలపుంతలు,
గ్రహాలు, నక్షత్ర సమూహాలున్నప్పుడు...
వాటిల్లో గ్రహాంతర వాసులు కూడా ఉండొచ్చుకదా? అని కొందరు
అంటారు. ఇంకొందరు క్యాన్సర్ కారకులు ఏలియన్లేనని పుస్తకాలు రాశారు. క్యాన్సర్
వ్యాధి కణాలను గ్రహాంతర వాసులువచ్చి
కొంతమంది అసూయాపరులకు తగాదాల మారులకు అంటించి వెళతారని చెప్పారు. చీమలు రెండు
పార్శ్వాలనే చూడగలవు.ఏలియన్లు మన దగ్గరకు వచ్చినా మనం వారిని చూడలేమేమో? ..
ఇలా రకరకాల వాదనలు ఊహలు భ్రమలూ ఉన్నాయి.వాళ్ళు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు.వెతుకులాట
ఖర్చు కోట్లలో ఉంది. నరంలాంటి వాడికి జ్వరంవస్తే చెయ్యిచూసినవాడు బతకడన్నట్లుగా
ఉంది పరిస్తితి.అదేపనిగా ఎలియన్లను వెతికే వాళ్ళకు పిచ్చిపడుతోంది.
గ్రహాంతర
వాసులది ఏ భాష? వాళ్ళ బుద్ది ఎలాంటిది? ఎవరికీ
తెలియదు.ఏలియన్ల రాకతో కులమత ద్వేషాలు భాషా బేధాలు పదవీ వ్యామోహాలు సమసిపోతాయా?
ఒకరినొకరు దోచుకోరా?ఎవరి
సౌఖ్యం స్వార్ధం వారు చూసుకోరా? ఇప్పుడు మనకున్న
సమస్యలు అవేకదా? ఒకవేళ ఎలియన్లు వస్తే మొసళ్ళ లాగా తయారై నరుడికి
శుద్ధం బద్ధం లేదు నడేటిలోకి లాగండి అంటారేమో?
సరే.ఇంతకీ
చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ,ఇప్పటివరకు పరిశోధకుల ప్రయోగ ఫలితాలన్నీ పిల్లినెత్తిన
పేరుడు నెయ్యి పెట్టినట్లు , పిల్లి మెడలో రొయల దండ
కట్టినట్లు వివరాలు ఆందీ అందకుండా ఉన్నాయి.పైగా వీళ్ళ జోలికి మనం వెళ్ళడం ఎందుకో
అర్ధం కాకుండా ఉన్నాయి.ఎక్కడో ఉన్న ఏలియన్ల జాడ కోసం ఇంత ఆరాటపడే మనిషి తనతోపాటే ఇక్కడే నివశిస్తున్న
తోటి మనిషిని పట్టించుకోకపోవడం ఆశ్యర్యంగా ఉంది.మనిషి ఉద్దేశం ఏలియన్లను కనుక్కొని
వాళ్ళకు ఏదైనా సహాయం చేద్దామనా?నీగ్రోలను పట్టికెళ్ళి
అమెరికావాడు పొలంపనులు చేయించుకున్నట్లు వాళ్ళతో పనులు చేయించుకుందామనా?వాళ్ళకు మన భూమిలో వాటా ఇద్దామనా? వాళ్ళ ఆవాసాలు
బాగుంటే కాజేద్దామనా? అసలు ఏది ఎందుకో అర్ధం కాకుండా ఉంది. అమెరికా
లాంటి దేశాలు లాభంలేనిచోట్ల పెట్టుబడి కూడాపెట్టవు.ఏలియన్ల గ్రహాలలో దూరి అక్కడ
పనికొచ్చే నిధినిక్షేపాలు ఏమన్నా ఉంటే దోచుకుందామనే యావతప్ప కరుణా కటాక్షాలు సహజంగా
ఎవరికీ లేవు.
మనకూ బోలెడు సమస్యలున్నాయి.ఇంతవరకు దోమల్ని కూడా
జయించలేకపోయాము.గ్రహాంతర వాసులు కూడా ఈ దోమలలాగా మనమధ్య చేరితే పిలిచి పెద్దపులికి
పేరంటం పెట్టినట్లవుతుందేమోనని కొందరు
జాగ్రత్తపరుల సందేహం.దోమలు కూడా దోమోత్తముల సభ జరుపుకొని అందులో తమ జాతి చరిత్ర,మానవులమీద తమకున్న పగ
ఇంకా బాగా ఎలా తీర్చుకోవచ్చో చెప్పుకున్నాయట. ఏలియన్ల ఊహా చిత్రాలు కూడా ఇంతింత
కళ్ళేసుకొని మనుషుల్ని పీక్కుతినే కరిచే దెయ్యాల్లాగా ఉన్నాయి.ఇలాంటి జీవులతో స్నేహం
మానవులకు కుదురుతుందా? రేపు గ్రహాంతరవాసులు కూడా దోమల్లాగా
మారి మనల్ని కుట్టే పనైతే కొత్త సమస్య
భూలోక వాసులకు జమ అవుతుంది.జాగ్రత్త!
ఊరు విడచి వాడ విడిచి ఎంతదూరమేగినా
సొంత ఊరివారు తన అంతరాన ఉందురోయ్ అన్నారు
ఆత్రేయ. సొంత గ్రహావసరాలనూ భూలోక బంధు
మిత్రులనూ పక్కనపెట్టి గ్రహాంతర వాసుల పొందుకు పోరాడటం పొరుగింటి అట్లకు నెయ్యి కాచినట్లుంది .అసలు పక్కనున్న
మనిషిని కులమతాలు ఎంచిన మీదట,మనవాడేననిరుజువు చేసుకొన్న తరువాతనే
కలుపుకునే తత్వం నశిస్తే ఆతరువాత మానవులకు గ్రహాంతరవాసితో స్నేహం కుదరవచ్చు. పోదాం
పద అంటూ మనిషిలాగానే ఉత్సాహపరిచే హ్యూమనాయిడ్
రోబోలను వ్యోమగాములకు తోడుగా రోదసీ లోకి
పంపే స్థాయికి ఎదిగాం.జాతి,కులం,మతం,రంగు,భాషా బేధాలను వదిలి మనిషిని మనిషిగా గౌరవించి
కలుపుకు పోయే సర్వధర్మ సమభావన తత్వం మనిషికే
అలవడాలి.మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అనుకునే మానవ గుణాలు మరి ఈ ఏలియన్లకు ఉన్నాయో లేవో ?
ఆవినీతి హింస లేని ధర్మమూర్తులైతే మనిషిదెబ్బకు ఏలియన్లు బలైపోతారు.ఒకవేళ వాళ్ళు
మనుషులకంటే తెలివైన దుర్మార్గులైతే వాళ్ళే మనిషిని దెబ్బతీయొచ్చు. ఏలియన్లైనా
మనుషులైనా మానవత్వం నైతిక విలువలు వదిలేసి దురాశతోవ్యవహరిస్తే ఒకరినొకరు దోచుకునే యుద్దమే మిగిలేది.
---నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ
కలక్టర్ 6301493266
https://www.facebook.com/photo.php?fbid=2635337929831514&set=a.233025936729404&type=3&theater