2, జనవరి 2013, బుధవారం

సహజ సూత్రం



సహజ సూత్రం
గీటురాయి 28-2-1992
         
    అర్ధరాత్రి ఆడమనిషి నడి బజారులో నిక్షేపంగా  డువగలిగిననాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని ఎవరో మహానుభావుడు అన్నాడట. ఆ సందేశాన్ని ఈనాటికీ మన నాయకులు దేపదే వల్లిస్తుంటారు. సమానత్వం కోసం పోటీ పెరిగిపోతోంది గాని కోర్కెల్లో సమంజసత్వాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆడమనిషి అర్ధరాత్రి పూట నడివీధుల్లో ఎందుకు సంచరించాలి? అని ఎవరైనా ధర్మసందేహం వెలిబుచ్చితే వాడిని అభివృద్ధి నిరోధకుడిగా, ఛాందస సంప్రదాయ వాదిగా ముద్రవేసి వెలివేస్తున్నారు.

       ఆడది ఒంటరిగా అగుపించితే చాలు అచ్చోసిన ఆంబోతుల్లా రౌడీలు వెంటపడి తరిమి అఘాయిత్యం చెయ్యటం, కొన్ని సార్లు ఆడవాళ్ళు పోలీసుల చేతికి చిక్కి మానభంగాలకు గురికావటం జరుగుతూనే ఉన్నాయి. ఆడదాన్ని చూచినా అర్ధాన్ని చూచినా బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అనీ, ఆడదాని బ్రతుకు అరిటాకు వంటిది అనీ పెద్దలు ఎన్నో సుద్దులు నేర్పారు. అయినా ఈ నీతుల్ని పట్టించుకోకుండా, తమ అందచందాలను దాచుకోకుండా, అర్ధనగ్న శరీరాలతో, విపరీతమైన పోకడలతో, రాత్రిళ్ళు కూడా వీధుల్లో ఆడవాళ్ళు తిరిగితే ఈ సమాజం నీతిగా నిలుస్తుందా ? ఆడదే అమృతం ఆడదే హాలాహలం అన్నారు. కుదురుగా ఇంటిపట్టున ఉండి బిడ్డల్ని చూసుకునే ఇల్లాలికి ప్రమాదం తక్కువ. బజారుల వెంట తిరుగుతూ మగవాళ్ళను ఆకర్షించే మగువకు ప్రమాదం ఎక్కువ. ఇది సహజ సూత్రం. ఈమె అతన్ని ఆకర్షించనక్కరలేదు. అతడే ఆకర్షించబడతాడు. ఎందుకంటే స్త్రీ సోయగం సహజంగానే పురుషుణ్ణి ఆకర్షితుంది. ఆమె సహజ శారీరక లక్షణాలే స్వేచ్చా సంచారాన్ని వద్దంటున్నాయి. ఈ సహజ లక్షణాలను త్రోసిరాజని సమానత్వం కోసం ఎలాబడితే అలా వ్యవహరిస్తే పర్యవసానాలు మనం ఊహించినట్లే ఉంటాయి.

       ఎవరిది ఈ నేరమనీ ఈ లోకం ఆలోచించదు, ఏదో పొరపాటనీ మన్నించదు. ముల్లు వచ్చివాలినా, తాను కాలుజారినా ముప్పు తనకు తప్పదు, ముందు బ్రతుకె ఉండదు అని ఓ కవి బాధపడ్డాడు. ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి ? తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా ? అని మరో కవి మధనపడ్డాడు. అందుకని సోదర భారతీయ మహిళలకు  మనవి చేసేదేమంటే సెకండ్ షో సినిమాలకు వెళ్ళొద్దు. వీలైనంత వరకు బజారు పనులకు భర్తల్నే పంపండి. ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. అపరిచితులతో మాట్లాడకండి. పరిచితులకైనా చనువిచ్చి సరదాగా మాట్లాడకండి. పురుషులతో మాట్లాడేటప్పుడు సాన్నిహిత్యం పెరగకుండేలా గంభీరంగాను, చిత్తశుద్ధి మిళితమైన తీవ్రతగల ముఖంతో వ్యవహరించండి. ముఖం కూడా బురఖాలో బంధించనక్కరలేదుగానీ,శరీర భాగాలను బయటికి ఆకర్షణ కోసం ప్రదర్శించకుండా కట్టు బొట్టూ వ్యవహారంలో జాగ్రత్త తీసుకోండి.

బ్యూరోక్రాట్ భారతం



బ్యూరోక్రాట్ భారతం
గీటురాయి 13-9-1991
         
          పెట్టి పోసిన నాడె చుట్టాల రాకడ
              కలిమి వేళనె వారకాంత వలపు
              సేవ చేసిన నాడె క్షితినాథు మన్నన
              వయసు కల్గిననాడె వనిత రక్తి
              విభవంబు గలనాడె వెనువెంట దిరుగుట
              పనియున్ననాడె మా వారలనుట

అని పోలిపెద్ది వెంకట రాయుడుగారు నెత్తీ నోరు మొత్తుకున్నాడు. అనుభవం మీద గానీ ఏదైనా అర్ధం కాదు. కునికిపాట్లు పడే వాడికి కూలబడి తన్నే వాడే తండ్రి అన్నట్లు ఇలాంటి  వెంకటరాయుళ్ళు ప్రతి తరంలోనూ ఓపికతో నీతులు చెబుతూ జనాన్ని కొన్ని సంకటాల నుండి రక్షిస్తుంటారు. కుడి చేతికున్న మన్నన ఎడమ చేతికి లేనట్లు జనం చూపే మర్యాదలు కూడా తమకు పనికొస్తానుకున్న వాళ్ళకే పరిమితమౌతూ ఉంటాయి.

ఒక ఎం.ఆర్.ఓ స్పెషల్ డిప్యూటి తహసీల్దారు గాను, ఒక స్పెషల్ డిప్యూటీ తహసీల్దారు ఎం.ఆర్.ఓ గాను మారితే వాళ్ళిద్దరికీ జనం చూపే మర్యాదల్లో చాలా తేడా ఉంటుంది. అధికార పార్టీలో కూడా మంత్రి పదవి దక్కిన ఎమ్మెల్యేకీ, మామూలు ఎమ్మెల్యేకీ తేడా ఉన్నట్లే ఇక్కడ కూడా. గాడిద పుండుకు బూడిద మందు లాగా ఏదైనా శాంక్షన్ చేసే అధికారంలేని వాడికి జనం ఓ నమస్కారం కొట్టి తప్పుకుపోతారు. ఎదురుపడితే ఎక్కడ ఏం చెయ్యాల్సివస్తుందోనని మరో దారి గుండా ముఖం తప్పిస్తారు. అదే తమకు అవసరమైన అధికారి మరో దారి గుండా వెళుతున్నదని తెలిస్తే ఉరుకులు పరుగులతో పడుతూ లేస్తూ అతనికి ఎదురు వెళతారు. అతన్ని పరిచయం చేసుకొని, ప్రసన్నుణ్ణి చేసుకోవాలని నానా తంటాలు పడతారు. దం లేస్తారు. వంగి వంగి దండాలు పెడతారు.

అధికారం బంగారు గొలుసుల బంధిఖానా అంటారు. నానా రకాల దోపిడీ గాళ్ళు అధికారికి ఆశలు చూసి, అందలం ఎక్కించి, అతనికి అవసరమైన పనులన్నీ చేసి తమ తమ పనులు నెరవేర్చుకుంటారు. మాట వినని అధికారికి ఆపై అధికారి చేత చెప్పిస్తారు. బెదిరిస్తారు. బదిలీ చేయిస్తారు. ఈ విధంగా ఒక విషవలయం తయారయ్యింది.అందులో ఉన్న పెద్దలంతా అనిత్యాని శరీరాణి అందరి సోమ్మూ మనకే రానీ అంటుంటారు.

చెవిటి వాడికి వినిపించాలంటే శంఖు చక్రాల వాడు దిగిరావాలన్నట్లు అవినీతి రొంపిలో కూరుకు పోయిన నాయకులకు, అధికారులకు దీనుల బాధ ఎంత వివరించినా అర్ధం కాదు. చెవిటి పెద్దమ్మా చేంతాడు తేవే అంటే, చెవుల పోగులు నా జన్మలో ఎరుగను అన్నద. అలాగే మనం ఒకటి అడుగుతుంటే ఆఫీసర్లు మరొకటి చేస్తుంటారు. ఏళ్లకేళ్లు గడిచి పోతాయేగాని మనకు పని జరుగదు.

కొబ్బరి చెట్టు ఎందుకెక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్నాడట. గడ్డి చెట్టు మీద ఉంటుందా అంటే, లేదు కాబట్టే దిగివస్తున్నాను అన్నాడట కాయల దొంగ. అట్లాగే అడ్డదిడ్డమైన పన్నుల్తో, వంకర టింకర సమాధానాల్తో తమ పబ్బం గడుపుకు పోవటానికే ఈనాడు చాలామంది బ్యూరోక్రాట్లు అలవాటుపడ్డారు. దేశం ఎందుకు బాగుపడటం లేదంటే, సుఖ భోగాలు అలవాయిన అధికారులు, నాయకులు, ఏ మాత్రం చైతన్యం లేని ప్రజల వల్లనే. పాదపూజలు చేసి పదవులు పొందేవాళ్లు స్వయం నిర్ణయాలు చేయగలుగుతారా ? పది రూపాయలు తీసుకుని జయజయ ధ్వానాలు చేసే జనం ఏ సత్కార్యానికి సంసిద్ధులౌతారు ? రౌడీలను పూల దండల్తో ముంచెత్తి మురిసిపోయే ప్రజలు ఏ పవిత్ర కార్యానికి పనికొస్తారు. అందుకే వంగిన వాడి క్రింద మరీ వంగిన వాడి పరిస్థితి మనకు అడుగడుగునా దర్శనమిస్తోంది.







బిచ్చం బిడ బిడ కుండలు లొడలొడ



బిచ్చం బిడ బిడ కుండలు లొడలొడ

గీటురాయి 20-11-1992

రాష్ట్రంలోని బీద వాళ్ళకేసే బిచ్చపు బియ్యం కోటాను 16 కిలోల నుండి 20 కిలోలకు పెంచారు. బిచ్చం బిడబిడ కుండలు లొడలొడ అన్నట్లుగా పెరిగిన ఈ నాలుగు కిలోలతో పేదవాళ్ళ బ్రతుకులేమీ బాగుపడవుగాని, రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 50 కోట్ల రూపాయల భారం నెత్తిన పడుతుంది. బొక్కలో నిద్రపోయే నక్క కలలో తనవాత పడే కోళ్ళను లెక్క పెట్టుకున్నట్లుగా ఏవేవో చేసి రాష్ట్ర ఆర్ధక పరిస్థితిని పరిపుష్ఠం చేస్తామని నాయకులు లెక్కలు గట్టి చెప్పారు. బోడిముండకు తలసుళ్ళు వెదికినట్లు, బోడెద్దుకు పోట్లు మరపినట్లు, ఆర్థిక సలహాదారులంతా నానా రకాల ప్రయోగాలు చేయించారు. బియ్యం దంచిన వాడికి బొక్కిందే దక్కుదల అన్నట్లుగా రాష్ట్రంలోని బీద మొహం వాళ్ళంతా నేతలు ప్రసాదించిందే ప్రాప్తంగా ఎంచుకుని అదో రకమైన నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.

కిలో అయిదు రూపాయల చొప్పున కార్డుకు 20 కిలోలు పట్టణ ప్రాంతాల్లో మిల్లర్లు అమ్ముతారని మరో ప్రయోగం. పల్లె ప్రాంతాల వారికి ఈ సౌకర్యం లేదు. పల్లెలకు పామాయిలూ లేదు. బిచ్చపు వాడు బీదవాడికి లోకువ అన్నట్లుగా పట్టణ ప్రాంతాల్లో తెల్లకార్డు ఉన్నవారికి పల్లెల్లో తెల్లకార్డులున్న వాళ్ళు లోకువయ్యారు. ఒక పద్ధతి పాడూ లేకుండా ఏదో దయ తలచి చేసే సంతర్పణలాగా ఉంది గానీ ఈ బియ్యం పంపకంలో న్యాయం లేదు. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నారు. అసలు ఈ బియ్యం వ్యాపారం నెత్తికెత్తుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు కోరారు ? బహిరంగంగా మార్కెట్ లో బియ్యం అందరికీ అందుబాటు ధరల్లోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. లేవీలు విధించి, ద్వంద్వ ధరల విధానం ప్రకటించి, డీలర్లను, అధికారులను, బ్లాక్ మార్కెటీర్లను, మిల్లర్లను మేపటం మినహా ఈ బియ్యం పథకం ల్ల ఒరిగింది ఏమి లేదు.

సబ్సడీ పేరుతో పై నుంచి క్రింది వరకు స్వాహా కార్యక్రమం అమలు జరుగుతోంది. నాసిరకం బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. పాడి అవును దానం చేసి, పాలు తాను పితుక్కున్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. పేలాలు చల్లి దయ్యాల్ని లేపినట్లుగా నెలనెలా ఈ బియ్యం పంపకం పెద్ద సంతలాగా తయారుచేశారు. సారాయి మీద వచ్చే అదాయంతో బియ్యం మీద సబ్సిడీ ఇస్తున్నామని జనాన్ని మోసం చేస్తున్నారు. మా కొంపలు గుల్ల చేసే మీ సారాయి వద్దు. మా ఆరోగ్యాన్ని హరించే మీ ముక్కి పోయిన సబ్సిడీ బియ్యమూ వద్దు. ఈ డబ్బు అభివృద్ధి కార్యక్రమాలకు వాడండి అని జనం అడుగుతున్నారు. బిచ్చపు కూటికి  శనేశ్వరం అడ్డం పడ్డట్లుగా కొంతమంది పేదలు బాధపడవచ్చు గానీ ఈ పథకం వల్ల తమ పేదతనం అంతరించదని గ్రహించాలి.

బిడ్డ బావిలో పడ్డాడంటే చద్దికూడు తిని వస్తానుండు అన్నాడట ఓ స్వార్ధపరుడు. రాష్ట్ర ప్రభుత్వం సారాయినీ, బియ్యాన్నీ వెంటనే వదిలిపెట్టి పనికి ఆహార పథకం ప్రారంభించాలి. ఈ పథకం వల్ల అభివృద్ధితోపాటు లక్షలాది శ్రామికులకు పని దొరుకుతుంది. సారాయి సబ్సిడీ రెండూ లేనందువల్ల సోమరితనం, బాధ్యతారాహిత్యం నశిస్తాయి.

బిచ్చానికి పోయినా బిగువు తప్పలేదు, దుప్పటి పోయినా పల్లెవాటు తప్పలేదు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ బలవంతపు బ్రాహ్మణార్ధం మానుకొని ఈ బిగువును రాష్ట్ర సరిహద్దుల దగ్గర చూపాలి. మన రాష్ట్రం నుండి గింజ బియ్యం బయటికి పోకుండా చూస్తే చాలు ఓపెన్ మార్కెట్లో బియ్యం రేట్లు వాటంతట అవే తగ్గుతాయి. సారాయి మానుకోవటం వల్ల ఆదా అయ్యే డబ్బుతో పేద ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది.