ప్రజలు పూనుకోక పోతే
పనులు కావు
గీటురాయి 16-3-1990
కుల్లు బోతువాడి కళ్ల ముందు ఇల్లు కడితే అది కూలిందాకా
ఒకటే పోరు పెట్టాడట. చెన్నారెడ్డి గారి పాలన మొదలయినప్పటి నుండి మండలాలను ఎలా ముండ మోయించాలా అనే ప్రయత్నాలే కొనసాగుతున్నాయి.
చిల్లి బాగా లేదని బెజ్జం వేసినట్లుగా చివరికి
మండలాలను అలానే ఉంచి వెనుకటి
తాలూకాలను కూడా అమలులోకి తేవటానికి
నిర్ణయించారు. ఇక ఇప్పటికీ మండలాలను రద్దు చేయకపోవటమే
కాంగ్రెస్ చేసే మహోపకారంగా భావించి జనం ఊపిరి పీల్చుకున్నారు.
కొత్త మేలు ఏదీ చేయలేకపోయినా, ఉన్న మేలును ఊడగొట్టక పోవటమే మహామేలుగా ప్రజలు భావించి
సంతృప్తిపడే దశకు తెచ్చారు. రాట్నం
వస్తున్నది. బండి తియ్యండి అని మొదట ఆర్భాటం చేశారు.
ప్రజలు గగ్గోలు చెందాక సరే పక్కగా సర్దుకుపోతాంలే అన్నారు. కుమ్మరి
పురుగు ఒంటికి మట్టి అంటనట్లుగానే ఈ నాయకులకు కూడా ఏమీ అంటదు. కుప్పతగల బెట్టి పేలాలు వేయించుకుతినే పద్దతిలో కాంగీ పాలన కొనసాగుతున్నది. అధికార వికేంద్రీకరణ
జరిపి ప్రజలకు చేరువ కావాల్సిన ప్రభుత్వం మండల రెవెన్యూ అధికారుల అధికారాలను కుదించటానికి
సమాయత్తమయ్యింది.
డిప్యూటీ
తహసిల్దారులకు గజిటెడ్ హోదా ఇస్తే 1104 మండల కేంద్రాలలో
సమర్ధులైన అధికారులు జనానికి చేరువగా ఉండి చకాచకా పనులు చేస్తారు. ఎన్జీవోలు సమ్మె చేసినా మండల కార్యాలయాలకు తాళాలు పడవు. ప్రభుత్వం ఇంతకాలం వారికి చేసిన
వాగ్ధానం అద్దంలోని ముడుపులాగా వారికందలేదు. ఇప్పుడు అసలుకే మోసం వచ్చే పరిస్థితి తయారయ్యింది. “మద్ది పాడు తాలూకా – చీమకుర్తి
కార్యాలయం” లాంటి ప్రహసనాలు మొదలు కాబోతున్నాయి. నాగులుప్పలపాడు మనిషి అద్దంకి పోయి రావాల్సిన
దుస్థితి దాపురించబోతోంది. అమర్చిన దాంట్లో అత్తగారు వేలుపెట్టి చెడగొట్టినట్లుగా మండలాల మీద ఈ అనవసర ప్రయోగాలు బెడిసి కొట్టినా ఆశ్చర్యం లేదు. ఎమ్మార్వోలు,
సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, మేజర్ పంచాయితీ
ఎగ్జిక్యూటివ్ అఫీసర్లు మొదలైన వారికి గజిటెడ్ అధికారాలు ఇవ్వాల్సిన
అవసరం ఉంది.
అయితే
అభ్యాసము లేని రెడ్డి అందల మెక్కితే అటూ ఇటూ అయ్యిందంట. కోనసీమ వాళ్ళంతా మాకు కొత్తజిల్లా కావాలని అర్జీ ఇస్తే కుదరదన్నాడు. రాయలసీమ వాళ్ళొచ్చి మాకు తిరుపతి,
నంద్యాల, గుంతకల్లు జిల్లాలు
అదనంగా ఏర్పాటు చేయాలని మొరపెడితే ససేమిరా అని మొరాయించాడు. ఆకలి ఎత్తుతుంది అత్తా అంటే రోకలి మింగవే కోడలా అన్న రీతిలో ఆయన సమాధానాలిస్తున్నారు. అన్నీ ఇప్పుడే చేస్తే
మిగతా అయిదేళ్లు ఏం చెయ్యాలీ అంటున్నాడు. దాని అర్ధం మిగతా అయిదేళ్లు కూడా ఇలాగే ఉంటుంది అనే నేమో !
అసెంబ్లీ
నియోజకవర్గాలన్నిటినీ తాలూకాలుగా చెయ్యాలనేదే చెన్నాగారి
వాంఛ. అలానే పార్లమెంటు నియోజక వర్గాలన్నిటినీ జిల్లాలుగా చేయించండి అనేది ఆయాప్రాంతాల ప్రజల ఆకాంక్ష. తన కోరిక నెరవేర్చుకుని, ప్రజల మనవిని పెడచెవిని పెడితే పోయిన అన్నకు వచ్చిన చెన్నాకు తేడా ఏమిటి ? కలిగినయ్య గాదె తీసేటప్పటికి పేదవాడికి ప్రాణం పోయిందట.
ఈ రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాట్లు ప్రజల ముంగిట్లో పాలనా సదుపాయాలు... మొదలైనవన్నీ ఓట్ల కోసం
నాయకులు చేసే నినాదాలే గాని,
అమలుకు నోచుకోవటానికి ప్రజా ఉద్యమాలు తప్పనిసరి అనిపిస్తున్నది.
నీటి పారుదల ప్రాజెక్టులు కంటే సన్మానాలు,
సాంస్కృతిక కార్యక్రమాలే మంచివని
చెప్పే నాయకులకు ప్రజలే నీతి నేర్పాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి