2, జనవరి 2013, బుధవారం

సారా పైసల కోసం కక్కుర్తి పడవద్దు



సారా పైసల కోసం కక్కుర్తి పడవద్దు
గీటురాయి 25-09-1992, 2-10-1992

            తాగుతా నీయబ్బ తాగుతా
              తాగుబోతు నాయాళ్ళ తల్లో దూరెల్లుతా
              తాగని నా కొడుకెందుకు లోకంలో
         
అంటూ మన రాష్ట్ర పాలకులు సారాయి వేలం పాటలు జోరుగా మొదలుపెట్టారు. తాగినవాడిదే పాట, సాగిన వాడిదే ఆట అన్నట్లు మన (త్రాగుబోతు) నాయకులకు ఎవరి మొరా చెవికెక్కలేదు. తాగుబోతు తోడు కోరినట్లు రాష్ట్ర ప్రజలందరినీ తనతో పాటు తాగి తందనాలాడమని కోరారు. తాగేది దమ్మిడీ సారాయి ఇల్లంతా చడ ఉమ్ములన్నట్లు ఈ సారాయి వల్ల ఆరుకోట్ల ఆంధ్రుల ఇళ్ళలో మూడోవంతు పైగా ముక్క చెక్కలై  పోతున్నాయని చెప్పినా వినిపించుకోలేదు. తినే కూటిలో మట్టి పోసుకున్నట్లు ఈ సారాయి కంపు ఉండవలసిందేనన్నారు. గాంధీ గారు చచ్చిపోయి ఇన్నేళ్ళయినా సంపూర్ణ మద్యపాన నిషేదం దేశంలో అమలులోకి రాలేదు. ఆయన వారసులమని చెప్పుకునే ఈ కుహనా నాయకులు తామే సారా కాంట్రాక్టర్లై, సిండికేట్లై ఈ దేశాన్ని మత్తులో ముంచెత్తుతున్నారు. రాష్ట్రాల ఖజానా నింపేది సారాయి మాత్రమేనని జనాన్ని  మోసపుచ్చుతున్నారు. కోట్ల సంసారాలను కూల్చి కొల్లగొట్టిన గబ్బుడబ్బే వారిని బలిపిస్తున్నది. ఈ సారా రాజకీయ వేత్తల ఆగడాలకు అంతులేదు. తాగుబోతుల నేరాలు దిన దిన ప్రవర్ధమానమై పౌరజీవనం నరకప్రాయంగా మారింది. త్రాగుడుకు ప్రభుత్వం లైసెన్సు ఇచ్చి సందుసందునా సారాయి అంగడి తెరచింది. నక్సలైట్ల ఎదిరింపుకు బెదిరి పోలీసు స్టేషన్ల ద్వారా సారాయి అమ్మించిన దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఏమనాలి.

నెల్లూరు జిల్లాలోని ఆడపడచులు దాదాపు యాభై వేలమంది సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టి సారాయి అమ్మకాలను నిలుపు చేయించటం హర్షదాయకం. ఈ ఉద్యమం అన్ని జిల్లాలకు ప్రాకుతోంది. పొర్లించి, పొర్లించి కొట్టినా మీసాలకు మట్టి కాలేదుగా అన్నాడట ఒక సిగ్గుమాలిన వెధవ. ఎన్నిసార్లు ఈ సారాయి వ్యాపారం ఆపివేయండి, కోట్లాది సంసారాలు కూలిపోతున్నాయి అని గడ్డిపెట్టినా ఈ పాలకులకు బుద్దిరావటం లేదు. బంతికే రావద్దంటే విస్తరాకు తెమ్మన్నట్లు, పొరుగింట అట్లకు నెయ్యి కాచినట్లు ఈ ప్రభుత్వం తన అత్యాశను, తాగుబోతు తనాన్ని వెల్లడించుకుంటున్నది. పైసల కోసం కక్కుర్తి పడి సారాయి వ్యాపారం  చేసే ప్రభుత్వం కూలిపోయిన కాపురాల ఆడపడుచుల పగకు గురయ్యింది. ఇక ప్రతీకారమే మిగిలింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి