2, జనవరి 2013, బుధవారం

బహుదూరపు బాటసారీ ఇటు రాకోయ్ ఒక్కసారీ



బహుదూరపు బాటసారీ
ఇటు రాకోయ్ ఒక్కసారీ
గీటురాయి 5-7-1991

ప్రయాణం యాతనలో ఓ భాగం. అది మిమ్మల్ని అన్నపానీయాలకు విశ్రాంతికీ దూరం చేస్తుంది. మీలో ఎవరైనా సరే అవసరం పూర్తయిన వెంటనే తన భార్యా బిడ్డల వద్దకు తిరుగు ప్రయాణానికి త్వరపడాలి అనే ప్రవక్త ప్రవచనాన్ని ఈనాటి ప్రభుత్వాలు, యాజమాన్యాలు గమనించాలి. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ప్రయాణంలో ఎన్ని సౌకర్యాలు ఏర్పడినా ఇంటి పట్టున దొరికే వాటితో సమానమవుతాయా ? మనిషికి తన వాళ్ళ దగ్గర దొరికే తృప్తీ, ఆనందం ఎక్కడో దూరాన అతిధుల దగ్గర దొరకదు. అసలు ప్రయాణం చెయ్యాల్సి రావటమే ఒక శిక్ష లాంటిది. అష్టకష్టాల్లో ప్రయాణం కూడా ఒకటి. మానసిక ప్రశాంతత లభించని మనిషి తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేడు. ఇల్లే తీర్ధం. వాకిలే వారణాసి, కడుపే కైలాసంగా భావించే స్థిర జీవులకు దూర ప్రయాణాల డ్యూటీ వేస్తే ఎంత బాధపడతారో చెప్పలేము. అలా కాకుండా ఇల్లు తిరిగి రమ్మంటే ఇలారం తిరిగొచ్చే వాళ్ళు కొంత మంది ఉంటారు.

              ఎంత ధీరుడైనా వానాకాలంలో ప్రయాణం అంటే హడలి చస్తాడు.       తిరునాళ్ళకు పోయి వచ్చిన వాడి ముఖం ఎలా ఉంటుందో కాస్త        ఊహించండి. సప్తాకాశాలను ఒక్క రాత్రిలో చూపుకు రాగల బుర్రాక్ లాంటి        వాహనాలు మనకు లేవు. అలాంటి రాకెట్లు భవిష్యత్తులో తయారు చేసినా   ప్రయాణ కాలం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఒక్క రాత్రి ప్రయాణమైతే        పెద్ద లగేజీ ఏమీ అక్కరలేదుగాని, నాలుగైదు రోజులు మరో చోట ఉండి      రావాలంటే బట్టలు, సబ్బు, పేస్టు, నూనె, అన్నీ వెంట పట్టుకెళ్లాలి. వెళ్ళిన వూళ్ళో మకాం చేయటానికి గది కావాలి. నీళ్లూ నిప్పులూ కావాలి. ఎవరన్నా అసితోడు ఉండాలి. ఇవన్నీ సమకూరినా వదిలొచ్చిన పెళ్ళాం బిడ్డలూ సదా    గుర్తు కొచ్చి మనసులో వ్యధ కలిగిస్తూ ఉంటే, ఆ మనిషి ఇక్కడ మనసు        ఎక్కడో లాగా ఉంటాడు. ఇంటి దగ్గర సమస్యలు. ఉద్యోగం చేసే ఊళ్ళో        బాద్యతలు వెరసి ఇటు చెర అటు సొర అవుతుంది. బదిలీ బాధితుల       సమస్యలు ఈ కోవకే చెందుతాయి.
      
              కొత్తగా పెళ్ళయిన వ్యక్తిని సైన్యంలోకి పంపకూడదని, అతను   రెండేళ్లపాటు ఇంటి పట్టునే ఉండి భార్యతో కాపురం చేయాలని బైబిల్లో ఉంది.       దాసరివా జంగమవా అంటే ముందర ఊరి కొద్దీ అన్నాడట. అలాగే దేశాంతర   మెల్లిన వాడు ఆ ఊళ్ళో జనాన్ని బట్టి తన అవసరాలను అవతారాన్ని     మలచుకోవాలి. స్వంత ఇంటి దగ్గర జరిగినట్టు పరాయి ఊళ్ళో కూడా       జరగాలంటే కుదరదు. రక్షణ రంగంలోని ఉద్యోగులు తమ కుటుంబాలను    విడిచి వేరే చోట ఉండాల్సి వస్తే సెపరేషన్ అలవెన్స్ ఇస్తున్నారు. సివిల్   ఉద్యోగులకు ఈ సదుపాయం లేదు. కాపురం ఒక చోట, పోస్టింగ్ ఒక చోట,       పని చేయించేది మరో చోట అయితే ఆ ఉద్యోగి పరిస్థితి కంటే, చిన్న     గుడిసెలో స్థిర జీవితం గడిపే నిరుపేద పరిస్థితే మెరుగు అనవచ్చు.        ఎందుకంటే నా కుటీరమిదేనోయ్ విశ్రమించిపోవోయి అనే సత్తా వాడికే     ఉంది.

              పూర్వం ఇలాంటి పరదేశులు, బాటసారులు, అభ్యాగతులు కోసం     ధర్మ సత్రాలు కట్టించే వారు. ఇప్పుడు ధర్మం కూడా వ్యాపారం కోసమే కొనసాగుతోంది. పరదేశిని వీధిలో ఉంనీయక, నా ఇంటి వీధి తలుపులు     తెరిచితిని గదా ?” అంటాడు యోబు(అయూబ్). ఇంటిలోకి పిలువక       పోయినా వీధి అరుగులు, వసారాలు, అనాధాల కోసం లభ్యమయితే చాలు.       వాణిజ్య దృక్పధం పెరిగిపోయి ఈనాడు వీధి అరుగుల ఎవరూ కట్టించటం   లేదు.

              పరదేశుల ఆతిధ్యం సంగతి పుణ్యాత్ములే చూచుకుంటారు లెమ్మని ప్రభుత్వం పట్టీ పట్టనట్లు కూర్చోవటం భావ్యం కాదు. ప్రభుత్వం అతిధి   గృహాలను, ధర్మ సత్రాలను విస్తృతంగా కట్టించాలి. ప్రస్తుతం హోళ్ళ వాళ్ళు ఈ రంగంలో విపరీతమైన లాభాలు గుంజుతున్నారు. మధ్య తరగతి,     పేద ప్రజల కోసం ప్రభుత్వం కూడా ఈ రంగంలో ప్రవేశించాలి.



                            

1 కామెంట్‌: