కాపులు, కారణాలు
ఎలా ఉండాలి ?
గీటురాయి 11-1-1991
ఒక ఊరికి ఒక కరణము
ఒక
తీర్పరియైన గాక నొగిధరచైనన్
కకవికలు
గాక యుండునె
సకలంబును
గొట్టు నడకసహజము సుమతీ !
అనే సుమతీ శతకకారుని మాట అక్షరాల నిజమయ్యింది. రెండూళ్ళకు ఒక గ్రామపాలనాధికారి అనేటప్పటికీ
మాజీ కరణాలు, మునసబులందరికీ
ఉద్యోగాలు రావటం లేదు. అధికార పార్టీలోని ఎమ్మేల్యేలు
కూడా పాత వ్యవస్థ పునరుద్ధరణ పట్ల పెదవి విరిచారు. చివరికి ఊరికొక గ్రామాధికారిని నియమించి రెవిన్యూ వ్యవస్థలో కొన్ని మార్పులు తెచ్చే ఉద్దేశంతో ఈ నియామకాలు వాయిదా వేశారు. ఈ
గ్రామాధికారుల వ్యవస్థ సత్ఫలితాల
నివ్వాలంటే, జన సామాన్యంలో ప్రాచుర్యం పొందిన కొన్ని సామెతలను, పద్యాలను,
మననం చేసుకొని, వాటిలో చెప్పబడిన చెడు నివారించబడి, ప్రజలకు మేలు జరిగేలా నియమావళిని రూపొందించటం ఈనాటి అవసరం. ఉద్యోగాల్లోకి రాబోతున్న కరణాలు మునసబులు, పటేళ్ళు, పట్వారీలు కూడా ఈ సామెతలు,
పద్యాలను గమనించి తమ భవిష్యత్
కార్యక్రమాలను, ప్రవర్తనా నియమాలను రూపొందించుకోవాలి
: -
1. కరణము కరణము నమ్మిన
మరణాంతక
మౌనుగాని మనలేడు సుమీ
కరణము
తన సరి కరణము
మరి
నమ్మక మర్మమీక మనవలె సుమతీ
2. కరణము సాదై యున్నను
కరిమదముడిగినను,
పాము కరువక యున్నన్
ధరతేలు మీట కున్నను
కరమరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ
3. కరణములననుసరింపక,
విరసంబున తిన్న తిండి వికటించు సుమీ
ఇరుసున కందెన బెట్టక
పరమేశ్వరు బండియైన పారదు సుమతీ
4. కాదన్నవాడె కరణము
వాదడచిన వాడె పేడి, వసుదేశుకడన్
లేదన్న వాడె చనవరి
గాధలు పేక్కాడువాడె కావ్యుడు సుమతీ
5. నరపతులు మేర దప్పిన
తిరమొప్పుగా విధవ ఇంట తీర్పరియైనన్
కరణము వైదికుడైనను
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ
6. పొరుగున పగవాడుండిన
నిరవొందగ వ్రాతకాడె ఏలికయైనను
ధరకాపు కొండె మాడిన
కరణాలకు బ్రతుకు లేదు గదరా సుమతీ
‘కరణము’ అనే సంస్కృత పదానికి ‘గ్రామగుమాస్తా’
అని
అర్ధం. వ్రాసే వాడిని గూడా కరణం అంటారు. బాగా
రాయలేకపోయిన వారిని చూచ్చి జనం ‘కూతకరణమేగాని
వ్రాతకరణంకాదు’ అనేవాళ్ళు. జిల్లా రిజిస్ట్రార్ ను ‘స్థలకరణం’ అంటారు. మునసబును ‘తీర్పరి’
అనేవాళ్ళు. మనస్సు, బుద్ధి,
చిత్తము, అహంకారాలను కరణ చతుష్టయమంటారు. ఆలోచన, మాట,
ఆచరణలను త్రికరణాలంటారు. కరణీకమంటే గుమాస్తాగిరీ. కరణాల మీద
కొన్ని సామెతలు చూద్దాం : -
1. కరణం, కంసాలీ కపటం విడువరు.
2. కరణం కాపూ నా పక్కనుంటే కొట్టరా మొగుడా ఎట్లా కొడతావో అన్నదట.
3. కరణం గంట మెత్తితే కంఠానికి రావాలిగాని,
లేకుంటే శంఠానికి రాదు.
4. కరణంతో కంటు,
కాటికి పోయినా తప్పదు.
5. కరణంతో కంటు పడితే కాడి కదలదు.
6. కరణం, కంసాలి లేకుండా కథ చెప్పమన్నారు.
7. కరణం సాధుకాదు, కాకి తెలుపు కాదు.
8. కరణం గ్రామదండుగగోరు,
జంబుకంబేవేళ శవము గోరు.
9. కరణానికీ కాపుకే జత,
ఉలికీ గూటానికే జత.
10.
కరణానికి తిట్టు దోషం లేదు చాకలికి ముట్టు దోషం లేదు.
11.
కరణాన్ని కంసాలిని కాటికిపోయినా నమ్మరాదు.
12.
కరణాలు కాపులూ ఏకమయితే కాకులు కూడ ఎగురవు.
13.
ఆకలిగొన్న కరణం పాతకవిలె బయటికి తీశాడట.
14.
ఆదూరు కరణం బ్రతికీ ఏడ్పించాడు,
చచ్చీ ఏడ్పించాడు.
15.
ఇచ్చింది ఇస్తే కరణాన్ని కాదు అన్నాడట.
16.
ఏమండీ కరణం గారూ, గోతిలో పడ్డారే అంటే కాదు, మషాకత్తు
చేస్తున్నాను అన్నాడట.
17.
కలిగిన మాత్రం తిని, కరణం గారి కమతం చేయమన్నట్లు.
18.
కల్లం దగ్గర కరణీకం, కంచం దగ్గర రెడ్డి రికం.
19.
కాపు కక్కసం, కంసాలికువాడం.
20.
వ్రాతరానివాడు కోత కరణం, వ్రాతా కోతా రానివాడు మేతకరణం.
ఇవన్నీ
తెలుగు విశ్వ విద్యాలయం వారు ముద్రించిన సామెతల గ్రంధంలో కూడా చోటు చేసికున్నాయి.
సామెతలు ప్రజల అనుభవంలోంచి పుట్టి భావి తరాల వారికి పాఠంగా మిగిలి ఉంటాయి.
సామెతలు ప్రజల భావాలకు, అనుభవాలకు అద్దం పడతాయి. కాబట్టి పదవులు చేపట్టబోతున్న మాజీ
కరణాలు, కాపులు కొత్త తరహాలో ప్రజలకు సేవలందించి,
వారి మీదున్న చెడ్డ పేరును తొలగించుకోవాలి. పై సామెతల్లో వారిపై మోపబడిన ఆరోపణలు
అబద్ధమని నిరూపించుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి