2, జనవరి 2013, బుధవారం

బ్యూరోక్రాట్ భారతం



బ్యూరోక్రాట్ భారతం
గీటురాయి 13-9-1991
         
          పెట్టి పోసిన నాడె చుట్టాల రాకడ
              కలిమి వేళనె వారకాంత వలపు
              సేవ చేసిన నాడె క్షితినాథు మన్నన
              వయసు కల్గిననాడె వనిత రక్తి
              విభవంబు గలనాడె వెనువెంట దిరుగుట
              పనియున్ననాడె మా వారలనుట

అని పోలిపెద్ది వెంకట రాయుడుగారు నెత్తీ నోరు మొత్తుకున్నాడు. అనుభవం మీద గానీ ఏదైనా అర్ధం కాదు. కునికిపాట్లు పడే వాడికి కూలబడి తన్నే వాడే తండ్రి అన్నట్లు ఇలాంటి  వెంకటరాయుళ్ళు ప్రతి తరంలోనూ ఓపికతో నీతులు చెబుతూ జనాన్ని కొన్ని సంకటాల నుండి రక్షిస్తుంటారు. కుడి చేతికున్న మన్నన ఎడమ చేతికి లేనట్లు జనం చూపే మర్యాదలు కూడా తమకు పనికొస్తానుకున్న వాళ్ళకే పరిమితమౌతూ ఉంటాయి.

ఒక ఎం.ఆర్.ఓ స్పెషల్ డిప్యూటి తహసీల్దారు గాను, ఒక స్పెషల్ డిప్యూటీ తహసీల్దారు ఎం.ఆర్.ఓ గాను మారితే వాళ్ళిద్దరికీ జనం చూపే మర్యాదల్లో చాలా తేడా ఉంటుంది. అధికార పార్టీలో కూడా మంత్రి పదవి దక్కిన ఎమ్మెల్యేకీ, మామూలు ఎమ్మెల్యేకీ తేడా ఉన్నట్లే ఇక్కడ కూడా. గాడిద పుండుకు బూడిద మందు లాగా ఏదైనా శాంక్షన్ చేసే అధికారంలేని వాడికి జనం ఓ నమస్కారం కొట్టి తప్పుకుపోతారు. ఎదురుపడితే ఎక్కడ ఏం చెయ్యాల్సివస్తుందోనని మరో దారి గుండా ముఖం తప్పిస్తారు. అదే తమకు అవసరమైన అధికారి మరో దారి గుండా వెళుతున్నదని తెలిస్తే ఉరుకులు పరుగులతో పడుతూ లేస్తూ అతనికి ఎదురు వెళతారు. అతన్ని పరిచయం చేసుకొని, ప్రసన్నుణ్ణి చేసుకోవాలని నానా తంటాలు పడతారు. దం లేస్తారు. వంగి వంగి దండాలు పెడతారు.

అధికారం బంగారు గొలుసుల బంధిఖానా అంటారు. నానా రకాల దోపిడీ గాళ్ళు అధికారికి ఆశలు చూసి, అందలం ఎక్కించి, అతనికి అవసరమైన పనులన్నీ చేసి తమ తమ పనులు నెరవేర్చుకుంటారు. మాట వినని అధికారికి ఆపై అధికారి చేత చెప్పిస్తారు. బెదిరిస్తారు. బదిలీ చేయిస్తారు. ఈ విధంగా ఒక విషవలయం తయారయ్యింది.అందులో ఉన్న పెద్దలంతా అనిత్యాని శరీరాణి అందరి సోమ్మూ మనకే రానీ అంటుంటారు.

చెవిటి వాడికి వినిపించాలంటే శంఖు చక్రాల వాడు దిగిరావాలన్నట్లు అవినీతి రొంపిలో కూరుకు పోయిన నాయకులకు, అధికారులకు దీనుల బాధ ఎంత వివరించినా అర్ధం కాదు. చెవిటి పెద్దమ్మా చేంతాడు తేవే అంటే, చెవుల పోగులు నా జన్మలో ఎరుగను అన్నద. అలాగే మనం ఒకటి అడుగుతుంటే ఆఫీసర్లు మరొకటి చేస్తుంటారు. ఏళ్లకేళ్లు గడిచి పోతాయేగాని మనకు పని జరుగదు.

కొబ్బరి చెట్టు ఎందుకెక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్నాడట. గడ్డి చెట్టు మీద ఉంటుందా అంటే, లేదు కాబట్టే దిగివస్తున్నాను అన్నాడట కాయల దొంగ. అట్లాగే అడ్డదిడ్డమైన పన్నుల్తో, వంకర టింకర సమాధానాల్తో తమ పబ్బం గడుపుకు పోవటానికే ఈనాడు చాలామంది బ్యూరోక్రాట్లు అలవాటుపడ్డారు. దేశం ఎందుకు బాగుపడటం లేదంటే, సుఖ భోగాలు అలవాయిన అధికారులు, నాయకులు, ఏ మాత్రం చైతన్యం లేని ప్రజల వల్లనే. పాదపూజలు చేసి పదవులు పొందేవాళ్లు స్వయం నిర్ణయాలు చేయగలుగుతారా ? పది రూపాయలు తీసుకుని జయజయ ధ్వానాలు చేసే జనం ఏ సత్కార్యానికి సంసిద్ధులౌతారు ? రౌడీలను పూల దండల్తో ముంచెత్తి మురిసిపోయే ప్రజలు ఏ పవిత్ర కార్యానికి పనికొస్తారు. అందుకే వంగిన వాడి క్రింద మరీ వంగిన వాడి పరిస్థితి మనకు అడుగడుగునా దర్శనమిస్తోంది.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి