27, మార్చి 2013, బుధవారం

మూడు రాజధానులైతే ముప్పు లేదు



మూడు రాజధానులైతే ముప్పు లేదు
గీటురాయి 8-2-1990
                 రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పడాల్సిందేనని రాయలసీమ ఎన్జీవోల సంఘం నాయకులు ప్రకటించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం   జిల్లాలలో రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వారు కోరారు.      రాయలసీమ అంటే శ్రీ కృష్ణ దేవరాయలు పరిపాలించిన ప్రాంతం. 1930 వరకు బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను సీడెడ్ జిల్లాలు అనేవారు. 1951 జనాభా లెక్కల ప్రకారం కోయంబత్తూరు, సేలం, మధుర జిల్లాలలో    వరుసగా 20, 15, 14 శాతం తెలుగు ప్రజలున్నారు. అవన్నీ ఇప్పుడు   తమిళనాడుకెళ్ళాయి. కోలారు, పాపగడ, బళ్ళారి, బస్తర్, సిరివంచ, గంజాం, కోరాపుట్, పొన్నేరి, తిరువళ్ళూరు, గుడియాత్తం, హోసూరు, కృష్ణగిరి     మొదలైన తెలుగు తాలూకాలు పోగొట్టుకున్నాము. ఎంతో ప్రాముఖ్యమైన    మద్రాసు (చెన్నపట్నం) నే పోగొట్టుకున్నాము. పెద్ద మనుషుల ఒప్పందం   లోని 14 అంశాలు దాదాపు అందరూ మరచిపోయారు. ఉప ముఖ్యమంత్రి   పదవి ఎవరికీ ఇవ్వటం లేదు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 51(2) ప్రకారం రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయవలసిన హైకోర్టు బెంచీలు  ఏర్పాటు చేయలేదు.

              విజయవాడ – గుంటూరు రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఉండాలని శ్రీ ఎన్. జి. రంగా కోరారు (ఇండియన్ ఎక్స్ ప్రెస్ 11-11-1953). దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యదర్శి శ్రీ ఎం. సత్యనారాయణ రెండు తెలుగు రాష్ట్రాలు       ఏర్పడాలని కోరారు (గోల్కొండ పత్రిక 10-8-1954). రాష్ట్రాల పునర్  వ్యవస్థీకరణ కమీషన్ 1954 లో హైదరాబాదు వచ్చినప్పుడు హైదరాబాదు     రాష్ట్రం అలాగే ఉండాలని వినాయకరావు, విద్యాలంకార్, పి. హనుమంతరావు అనే మంత్రులు, దక్కన్ క్రానికల్, సియాసత్, రెహ్ నుమాఎ – దక్కన్, హైదారాబాద్ బులెటిన్ పత్రికల సంపాదకులు విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడాలని మహదేవ్ సింగ్, యస్. బి.   గిరి, కె. సోమయాజులు, వీరారెడ్డి, జె. నరసింగరావు, కె. వి. రంగారెడ్డి    ప్రభృతులు కోరారు.

              మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డి గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన సంగతి మనకు తెలుసు. 29-7-1989 వ తేదీన గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్     కమిటీ అధ్యక్షుని హోదాలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కావాలని మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా ఆకాంక్షించారని, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించాలనే ధోరణితో కాక, చిన్న రాష్ట్రాలు    ఏర్పడాలనే భావనతోనే ప్రత్యేక తెలంగాణా వాదాన్ని ఆజాద్ సమర్ధించారనీ  ఆయన అన్నారు. జవాహర్లాల్ నెహ్రూ కూడా ఆదిలో చిన్న రాష్ట్రాల వాదాన్ని సమర్ధించారనీ చెన్నారెడ్డి గుర్తు చేశారు. మాజీ కేంద్రమంత్రి శ్రీ   వసంత సాధే అయితే చిన్న రాష్ట్రాలవాదాన్ని విపరీతంగా ప్రచారం చేస్తుంటారు. ఆయన్ని వేర్పాటు వాది అని ఎవరూ అనలేదు. మహారాష్ట్రలో విధర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఉప ప్రధాని శ్రీ దేవీలాల్  కోరిక. పెద్ద రాష్ట్రాలను పునర్ వ్యవస్థీకరించి చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుందని, ఇందుకు హర్యానా ఏర్పాటే ఒక ఉదాహరణ అని దేవీలాల్ అంటూ ఉంటారు. విదర్భ, తెలంగాణా రాష్ట్రాల ఏర్పాటుకు   రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిటీ 30-9-1955 న సిఫారసు చేసింది. ఆ   తరువాత 1956 నవంబర్ 1 వ ఇండియా ను 15 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం గల యూనియన్ గా ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్రాల సంఖ్య 25 కు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7 కు పెరిగింది. త్వరలో ఢిల్లీ నగరం కూడా ఒక  రాష్ట్రం అవుతుంది.

              ఇప్పుడు రాయలసీమ విషయానికి వద్దాం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాయలవారి ఙ్ఙ్ఞాపకార్ధంగా రాయలసీమ అనే పేరును 1928 లో  డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారు ఈ ప్రాంతానికి పెట్టారు. అంతకు  ముందు ఈ ప్రాంతాన్ని సీడెడ్ జిల్లాలు అని బ్రిటీష్ వాళ్ళ కిచ్చాడు. నిస్సారమైన భూములు, పేద ప్రజలు, అనావృష్టికి రాయలసీమ పెట్టింది  పేరు.

              1907 లో సీడెడ్ జిల్లాల యంగ్ మెన్స్  సోషల్ గేదరింగ్ జరిగింది. 1913 లో ఈ జిల్లాల యువకుల సమావేశం మహానందిలో జరిగింది. దీనికి పి. కేశవ పిళ్లే అనే లాయర్ అధ్యక్షత వహించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే  సీడెడ్ జిల్లాలకు వలస వచ్చిన తెలుగేతరుల పరిస్థితి దారుణంగా ఉంటుందని, ఆంధ్ర ఉద్యమం బ్రాహ్మణ ఉద్యమం అని ఆయన  విమర్శించారు. గుత్తి వాస్తవ్యుడైన శ్రీ జి. లక్ష్మణరెడ్డి అనే లాయర్ కూడా     పిళ్లేతో గొంతు కలిపారు. సీడెడ్, సర్కారు దక్షిణాది జిల్లాల్లోని తెలుగువాళ్లు  కలవలేరనీ, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే పన్నులు పెరుగుతాయనీ, సీడెడ్ జిల్లాల ప్రజలు మద్రాసుకు దగ్గరలో ఉన్నందు వల్ల కలిగే ప్రయోజనాలు పోతాయని ఆయన వాదించారు. 1917 లో నెల్లూరులో మద్రాస్ ప్రొవిన్షియల్ సమావేశం జరిగింది. మద్రాసుకు దూరమై పోతామనే బెంగతో నెల్లూరు వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించారు. శ్రీ ఎ. యస్. కృష్ణారావ్ అనే శాసనసభ్యుడు  మద్రాసు లేని ఆంద్ర మనకెందుకు?” అని సమావేశం లోంచి లేచి  వెళ్ళాడు.

              శ్రీ పి. రామాచారి అనే కాంగ్రెస్ నాయకుడు ఇలా ప్రసంగించారు ఆంధ్ర రాష్ట్రంలో కలవటానికి మనకిష్టం లేదు. రాయలసీమ రాష్ట్రం ఏర్పడుతుందా అని ఎవరైనా సందేహించనక్కరలేదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ   సాధ్యమే పోలాండ్, పోర్చుగల్, మొదలైన చిన్న చిన్న యూరప్ దేశాలు, మైసూర్, త్రావన్కూరు మొదలైన ఇండియన్ రాష్ట్రాలు స్వతంత్రంగా  మనుగడ సాగిస్తూ ఉంటే, ఎనభై లక్షల జనం ఉన్న మనం ఎందుకు ముందుకు పోలేము ? మన ఆరు జిల్లాల వైశాల్యం పై రాష్ట్రాల కంటే  ఎక్కువే...? (ది హిందూ........2-7-1931)
             
              శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావును కాంగ్రెస్ సుభా నుండి  అయ్యదేవర కాళేశ్వరరావు కూల దోయటం, ఆంధ్రా యూనివర్సిటీ కేంద్రాన్ని  బెజవాడలో స్థాపించటం రాయలసీమ ప్రజల కోపాన్ని ద్విగుణీకృతం చేశాయి. 1931 లో మద్రాస్ లో రెండో రౌండ్ టేబిల్  కాన్ఫరెన్స్ జరిగింది.అందులో శ్రీ కల్లూరి సుబ్బారావు ఆంధ్రకు బెజవాడను రాజధానిగా ఉంచి,మదనపల్లి వేసవి కేంద్రంగా నిర్ణయించాలని సూచించారు. శ్రీ కె. సుబ్రహ్మణ్యం        రాయలసీమ, నెల్లూరులను కలిపి ఒక రాష్ట్రంగా రెండు తెలుగు రాష్ట్రాలు  ఏర్పాటు చేయాలని సూచించారు. సీడెడ్ జిల్లాలను ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోకి తేకుండా, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో కలువకుండా నిరోధించే     ద్దేశ్యంతో 1934 లో రాయలసీమ మహాసభ ఏర్పాటు చేశారు. 1937 లో మద్రాస్ లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సి. రాజగోపాలాచారి సీడెడ్  జిల్లాల వారికెవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రచారం చేయటానికి మదనపల్లి వచ్చిన పట్టాభి సీతారామయ్యతో మా సహకారం లేకుండా నీవు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా సాధిస్తావో చూస్తాంలే అంటాడు  పాపన్నగుప్త.

              ఇలాంటి పరిస్థితుల్లో చివరికి కాశీనాధుని నాగేశ్వరరావు గారి నివాసం శ్రీ బాగ్ లో (మద్రాసు) ఒప్పందం జరిగింది. దాని ప్రకారం యూనివర్సిటీ, హైకోర్టు, ప్రధాన కార్యాలయం (రాజధాని) వేరువేరు     ప్రాంతాల్లో ఉండాలని అంగీకరించారు. పౌర ప్రాధాన్యత గల పీఠాలన్ని ఒకే చోట కేంద్రీకరించకుండా ఉండాలని శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి వాదించారు.ఇందుకు ఆయన ఒక ఉదాహరణగా దక్షిణాఫ్రికాను సూచించారు. ఆదేశానికి  ప్రిటోరియమ్ రాజధాని, అక్కడ పరిపాలనకు సంబంధించిన ఆఫీసులు ఉంటాయి. కేప్ టౌన్ లో పార్లమెంటు ఉంటుంది. బ్లోయెమ్ ఫౌంటైన్ లో ప్రధాన న్యాయస్థానం ఉంది. అదే పద్ధతిలో విశాఖ పట్టణంలో యూనివర్సిటీ, గుంటూరు లో హైకోర్టు, కర్నూలులో అసెంబ్లీ ఉండాలనే నిర్ణయం జరిగింది. రాయలసీమ రెడ్లు, కోస్తా కమ్మలు, బ్రాహ్మణులు మధ్య కుల రాజకీయాలు లేచాయి. మద్రాసులో మరోసారి రాయలసీమ నాయకులకు అన్యాయం,   అవమానం జరిగాయని శ్రీ నీలం సంజీవరెడ్డి వాపోయారు. 1948  జూన్ లో  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో శ్రీ ఎన్. జి. రంగా – ప్రకాశంపంతులు, కళా వెంకట్రావుల మద్దతుతో సంజీవరెడ్డిని ఓడించారు. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును వాయిదా వేయాలని శ్రీ సంజీవరెడ్డి కోరారు. శ్రీ ఎన్. యం. శాస్త్రి, హెచ్. లింగారెడ్డి మద్రాసు రాజధానిగా రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని కోరారు. రాయలసీమ ప్రజలకు కోస్తా జిల్లాల వారికి ఆచార వ్యవహారాల్లో తేడా ఉందనీ, తమిళుల దోపిడీ పట్ల కోస్తా వాళ్ళు ఎలా భయపడతారో, కోస్తా జనం అంటే రాయలసీమ వాళ్ళకు అంటే భయం అని  వారు పేర్కొన్నారు. (ఇండియన్ క్స్ ప్రెస్ 10-9-1948)

              వారిలో ఇలాంటి భయాందోళనలు కాలగమనంలో విస్తరించాయి.ప్రస్తుతం రాయలసీమ సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే ప్రత్యేక  రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు కావాలని రాయలసీమ ఎన్జీవోల సంఘం    నాయకులు ప్రకటించారు. కడప, కర్నూలు,అనంతపురం,చిత్తూరు,నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో ఈ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వారు కోరారు. ప్రత్యేక తెలంగాణా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాల కోసం గతంలో (1968, 1972     సంవత్సరాలలో) ఉద్యమాలు కొనసాగాయి.అప్పట్లో ఆ ఉద్యమాలను అణచివేసినప్పటికీ లోలోన పెరిగే అసంతృప్తితో ఏనాటికైనా అవి తిరిగి తలెత్తక తప్పదు.ఎందుకంటే భాషా ప్రాతిపదిక మీద విశాలాంధ్ర ఏర్పడింది కానీ, భాష ఒక్కటే మనల్ని కలిపి ఉంచలేదు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల ఆర్ధికాభివృద్ధి సమంగా జరగాలి. ఆయా ప్రాంతాల విద్యా, సాంస్కృతిక అవసరాలు తీర్చబడాలి. పెద్ద రాష్ట్రాలలో పరిపాలన ఎంత జాగ్రత్తాగా జరిగినప్పటికీ, కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురి కావటం ఖాయం. రాజకీయ అధికారం ఏ ప్రాంతపు అభివృద్ధికీ నోచు కోవటం, మిగతా ప్రాంతాలు ఆపసోపాలు పడుతూ ఉందటం భారత  రాజకీయ చరిత్ర మనకు నేర్పిన  పాఠం. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఈ అసమానతలు, అసంతృప్తి శిస్తాయి. ఆయా ప్రాతాల ప్రజలు తమను మరింత సమర్ధంగా చౌకగా నాణ్యంగా పరిపాలించుకుంటారు. స్థానిక స్వపరిపాలన సిద్ధిస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు రాష్ట్ర స్థాయి ప్లానింగ్ బోర్డు, అడ్వొకేట్ జనరల్  మొదలైన ఉన్నత కార్యాలయాలు వస్తాయి. గవర్నరు, ముఖ్యమంత్రి  మంత్రులు స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు దగ్గరలో ఉండి పని చేస్తారు. బి. జె. పి చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తానని తన మేనిఫెస్టోలో వాగ్ధానం చేసింది.

              మరో ముఖ్య విషయం ఏమిటంటే 1951 లో 3 కోట్ల జనాభా గల రాష్ట్రం,  1981 నాటికి 6 కోట్లకు చేరింది. 1981 నాటికి 6 కోట్లకు చేరింది. 1991 లెక్కల్లో ఇది ఎనిమిది కోట్లకు చేరవచ్చు. ఆ రోజుల్లో జనాభా తక్కువ గనుక ఒక్క రాజధానితో పనులు గడుపుకొని పోవటం కుదిరింది. మరి ఈనాడు ఇన్ని కోట్ల మందికి ఒకే ఒక్క నగరం దిక్కు కావటం, ఆ నగరం కూడా అనునిత్యం కర్ఫ్యూలో, మార కాండలో, మగ్గిపోతూ ఉంటం చూస్తున్నాం. ఉన్నవి  చాలనట్లు తెలుగు విశ్వవిద్యాలయం, ఓపెన్ యూనివర్సిటీలు కూడా అక్కడే పెట్టారు. ప్రతి ఉన్నత స్థాయి కార్యాలయం ఆ నగరంలోనే ఉంటం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి బహు ప్రయాసతో  కూడుకున్న ప్రయాణం తప్పటం లేదు. ఎక్కువ మందికి అవసరమయ్యే సర్వీస్ కమీషన్, ల్యాండ్ రెవిన్యూ కమీషనర్, సివిల్ సప్లయిస్....మొదలయిన వాటికి ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదు. జిల్లాలు, రెవిన్యూ డివిజన్ల సంఖ్య పెంచకపోగా, మండలాలు తీసేసి  తాలూకాలు పెట్టబోవటం, ఆఫీసు పనివేళలు మార్చటం అయిదు రోజుల  పని... ఇలా ఎవరికీ పనికి రాని ప్రయోగాలతో పాలన సాగుతున్నది.

              చిన్న రాష్ట్రాల్లో పాలకుల నిర్ణయాలు మంచివి కాకపోతే వాటి ప్రభావం   కొద్ది ప్రాంతం మీదే పడుతుంది. పెద్ద రాష్ట్రాల్లోనైతే విశాల ప్రజానీకం అలాంటి ప్రభావానికి గురి కాలవలసి వస్తుంది. అప్పట్లో ఆంధ్ర ప్రజల తలసరి ఆదాయం తొమ్మిది రూపాయల ఆరు అణాలుంటే, తెలంగాణా వాళ్ళది పది హేడు రూపాయలుండేది. (ఇండియన్ క్స్ ప్రెస్ 7-7-1954). 
              తెలంగాణాలో ఎక్సైజ్ ఆదాయమే అయిదు కోట్లుండేది.ఈ డబ్బంతా ఆంధ్రాలో ఖర్చు పెడతారేమోనని తెలంగాణా నాయకులు భయపడ్డారట. (రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమీషన్ రిపోర్టు పేజీ 105). తెలంగాణా ను     లూఠీ చేయొద్దు లాంటి నినాదాలు ఇప్పటికీ హైదరాబాదు గోడల మీద  దర్శన మిస్తాయి. 
తెలుగుగంగ ప్రాజెక్టులో పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల్ని రక రకాలుగా భయపెట్టి రాయలసీమ నుంచి వెళ్ళగొట్టారు. ఒకరిపైఒకరు అపనమ్మకం,అసహనంతో కలిసి ఉన్నట్లు నటిస్తున్నారుకానీ మూడు ప్రాంతాలలో ఎవరూ మరో ప్రాంతం వారిని నమ్మే వాతావరణం లేదు.మూడు తెలుగు    రాష్ట్రాలు ఏర్పడటం మంచిదే. కనీసం గుంటూరు, కర్నూలు పట్టణాలకు  ప్రాంతీయ రాజధాని నగరాలుగా అభివృద్ధి చేసి, అసెంబ్లీ సమావేశాలు వరుస ప్రకారంగా ఈ మూడు నగరాల్లో జరిపితే అన్ని ప్రాంతాల వారికీ   సమ్మతంగా ఉంటుంది.



             
             
             









భారతీయ ముస్లిముల్లో బహుభార్యాత్వం



భారతీయ ముస్లిముల్లో బహుభార్యాత్వం
                 (1924 లో సిల్హెట్ లోని కేల్వానిక్ మెతడిస్ట్  మిషనరీ రెవరెండ్     టి. డబ్ల్యూ. రీస్ లండన్ లోని రాబర్ట్ రాబర్ట్స్ గారికి వ్రాసిన లేఖలోని భాగం     ఇది).

              సిల్హెట్, కచార్ లోని ముహమ్మదీయుల గురించి నా అనుభవం     మీద తెలుసుకున్నదేమంటే ఇక్కడ ఎవరికైనా కరికంటే ఎక్కువ మంది   భార్యలుండటం చాలా అరుదు. అలాంటి వాళ్ళు ఒకరిద్దరిని కలిశాను. కాని      అలాంటి వారి సంఖ్య ఒక్క శాతం కూడా లేదని నేను నిశ్చయంగా       చెప్పగలను. కురాను అనుగ్రహించిన ఈ అవకాశాన్ని ఒక్క శాతం ప్రజలు      కూడా వాడుకోవటం లేదు. బహుశా వెయ్యి కొక్కడు ఉంటాడేమో,        బహుభార్యాత్వం పాటించే కొద్ది మందిలో కూడా అలా ఎందుకు        జరుగున్నదంటే మొదటి భార్యకు సంతానం కలుగకపోతేనో, ఇంటి పని చేసే     శక్తి లే రోగిష్టి అయ్యుంటేనో మాత్రమే. ప్రతి భార్యకు ప్రత్యేక ఇల్లు కేటాయించాలన్న కురాన్ లో నియమం వల్ల చాల మంది పేదలు బహు      భార్యాత్వం పాటించటం లేదు. ఏక పత్నీ వ్రతాన్నే ఈ మతస్తులు        సమర్ధిస్తున్నారు. ఎక్కువ మంది భార్యలున్న వాడిని అతని మతస్తులే      గౌరవంగా చూడటం లేదు. సంపన్నుల్లో ఉంపుడు గత్తెలు, విడాకుల      వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలు డబ్బుతో కూడుకున్నాయి గనుక పేదలు ఆగిపోతున్నారు.
              ఇక స్త్రీలను పిల్లలను చూచుకునే విషయం :
      
              మిగతా మనుషుల కంటే మిషనరీ చాలా నిరపాయకరమైన మనిషి అని భావిస్తుంటారు గనుక నేను గ్రామాలలో చాల మంది స్త్రీలను చూచాను.     హిందూ సమాజంలో లాగానే ముహమ్మదీయ స్త్రీలు, పిలల్లూ ఎంతో శ్రద్ధగా     సంరక్షించబడతారు. మగపిల్లలను, హిందువులు మరింత బాగా చూస్తారు.       మహమ్మదీయులు కూడా అంతే. అదే సందర్భంలో ముహమ్మదీయ స్త్రీలు.   హిందూ స్త్రీల కంటే చాలా ఖచ్చితంగా ఇళ్ల లోనే ఉంచబడతారు.        ముహమ్మదీయ బాలికల పాఠశాల అనేది కానరావటం మహా అరుదు.      మైదానాలలోని మా బాలికల పాఠశాలన్నీ హిందూ బాలికలతోటే నిండి   ఉన్నాయి. సిల్బార్ స్కూల్లో 150 మంది బాలికలుంటే ఒక్క ముహమ్మదీయ   బాలిక కూడా లేదు. మళ్ళీ ఆ ఊళ్ళో ముహమ్మదీయుల జన శాతం  చాల ఎక్కువే. హిందువుల ఆడపిల్లల కంటే ముహమ్మదీయుల ఆడపిల్లలు        ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. రజస్వల అయిన మీదట పెళ్లి చేయవచ్చు అనేది మహమ్మదీయుల్లో నియమం అయితే, హిందువుల్లో రజస్వల        కాకముందే పెళ్లి అయిపోతూ ఉంది.

ఆంగ్ల మూలం : - రాబర్ట్ రాబర్ట్స్ వ్రాసిన The social laws of the quaran” (1924) Reprint Cosmo Publications 1978 p 121, 122 ) N. Delhi.

ప్రభుత్వ యంత్రాంగం ప్రజాలకు చేరువ కావాలి



ప్రభుత్వ యంత్రాంగం ప్రజాలకు చేరువ కావాలి
గీటురాయి 5-1-1990
                   అధికార వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ అనేవి అందమైన      నినాదాలు. అవి అందరికీ నచ్చుతాయి. కేంద్రీకరణతో విసిగిపోయిన జనం,       దూరము భారము అనుభవించే జనం, ఈ నినాదాలు వినగానే ఏదో పీడ     పలచబడిపోతున్నట్లు, మేలు తమకు చేరువవుతున్నట్లు భావిస్తారు.        రాజకీయ నాయకులు మాత్రం ఈ నినాదాల పేరుతో ఏవో సమూల    సంస్కరణలు తలపెట్టబోతున్నట్లు ప్రకటించి ప్రజలను సదా ఆనందింప        జేస్తుంటారు. అప్పుడప్పుడూ ప్రజల ఆగ్రహానికి గురౌతామనే భయంతో కొన్ని        పనులు చేస్తుంటారు.

              1952 లో పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగంతో చెన్నపట్నంలో తిష్ట    వేసిన అధికారంలో సగం ఆంధ్రప్రదేశ్ కు తరలి వచ్చింది. కర్నూలులో        నెలకొల్పిన పీఠం హైదరాబాదుకు గెంతింది. అప్పటి ఆ నగరం జనాభా ఎంత      ఉండేదో కాని రాజధాని కావటం వల్ల ఈనాడు అది 35 లక్షలకు చేరుకున్నది. కేవలం 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 35 లక్షల మంది       అంటే కిలోమీటరుకు 16, 219 మంది ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే        మీటరుకు పదహారు మంది జనం కిక్కిరిసి నివసిస్తున్నారు. అంటే నగర    జనాభాలో  మూడవ వంతు మంది మురికి వాడల్లోనే   ఉంటున్నారన్నమాట. 1971 లో కేవలం 18 లక్షల జనాభాతో ఉన్న   హైరాబాదు 1981 నాటికి 25 లక్షలకు నేటి కి 35 లక్షలకు చేరుకుంది. 1971        నాటికి అయిదు లక్షల జనాభా దాటిన నగరం ఆంధ్రప్రదేశ్ లో ఇదొక్కటే. 1981      నాటికి విశాఖపట్టణం, విజయవాడ నగరాలు అయిదు లక్షల జనాభాను     దాటాయి. 1991 నాటికి వరంగల్లు, గుంటూరు నగరాలు ఈ పరిమితిని దాటి      కార్పొరేషన్లు అవుతాయి.

            అలాగే లక్ష జనాభాను దాటిన పట్టణాలు 1971 లో 13 ఉంటే 1981 లో 20       కి పెరిగాయి. 1991 లో ఈ పట్టణాల సంఖ్య 33 కాబోతున్నది. ఇంకా యాభై     వేల జనాభా దాటిన పట్టణాలు 1981 లో 50 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య        వంద కావటానికి చేరువలో ఉంది. అంటే క్రమేణా పట్టణాల సంఖ్య హెచ్చుతోంది. జనం పెరిగే కొద్దీ పల్లె పట్టణంగా మారుతుంది. ప్రాథమిక        సదుపాయాల లభ్యతను బట్టి జనం ఆయా ఊళ్లలో గుమిగూడుతుంటారు. తమకు       జీవనోపాధి దొరికి, సుఖంగా బ్రతుక గలిగే ఊళ్ళకు జనం వలస        పోతుంటారు.

              ఉన్న జనానికి తోడు వలస వచ్చిన జనం పోగై ఊరు సంతలాగా     తయారై, పెద్ద పట్టణం లాగా ఉబ్బిపోతుంటుంది. శివారు ప్రాంతాల్లో      స్థిరనివాసాలు వెలిసి క్రమేణా పట్టణం నగరమైపోతుంది. ఆకాశహర్మ్యాలు,   ఒకరి నెత్తిన మరొకరు నివసించటం, కిక్కిరిసిన బస్సులు, మురికి వాలు,   ఫుట్ పాత్ ల మీదనే నిద్రించే వాళ్ళు..... ఇలా ఎన్నెన్నో తంటాలు వచ్చి        పడతాయి. ఇదంతా సౌకర్యాల కేంద్రీకరణ ఫలితమే. ఇంకో రకంగా     చెప్పాలంటే ఇదంతా సౌకర్యాలను సరైన సమయంలో అవసరమైన చోట్లకు    సమంగా పంపిణీ చేయకపోవటం వల్లనే జరుగుతోంది. అంటే వికేంద్రీకరణ      జరుగకపోవటం అన్నమాట.

              మొదట్లో మనకు చాలా  పెద్ద పెద్ద తాలూకాలు ఉండేవి. చెన్నారెడ్డి    గారి హయాంలో 1980 లో కొత్త తాలూకాల ఏర్పాటు జరిగింది. అప్పటికి అవి     పెద్దగానే ఉన్నాయి. 1985 లో ఎన్టీ ఆర్ గారి హయాంలో అప్పటికి ఉన్న 305   తాలూకాలను 1104 మండలాలుగా మార్చారు. అడపాదడపా ప్రజల వత్తిడి     మీదట కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మండలాల స్థాపన       ద్వారా తాలూకా స్థాయి అధికార యంత్రాంగం పల్లెటూళ్ళ చేరువకు   పోయినందువల్ల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తొలిగి పోయాయి. అయితే చాలా కొత్తమండల కేంద్రాలలో, అధికార యంత్రాంగానికి అవసరమైన కనీస    హంగులు సమకూర్చక పోవటం వల్ల , ప్రజలు యాతన పడ్డారు. ప్రస్తుత   స్థితిని బట్టి ఈ మండలాల సంఖ్యను 1200 కు పెంచవలసిన అవసరం ఉంది.
                    
                    రాయలసీమలో నంద్యాల, గుంతకల్లు, తిరుపతి కేంద్రాలుగా మరో            మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని, సీమాభివృద్ధి కోసం ఒక          బోర్డును ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతం నాయకులు కొందరు ముఖ్యమంత్రి     చెన్నారెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పాలనలో కొత్తగా మండలాలైతే ఏర్పడ్డాయి గాని, కొత్తగా జిల్లాలు ఏవీ ఏర్పాటుకాలేదు.   నంద్యాల, తిరుపతి జిల్లాలు ఏర్పాటు అవుతాయనే ఊహాగానాలు        కొనసాగటం తప్ప. రామారావు గారు ఎందువల్లనో కొత్త జిల్లాలు ఏర్పాటు    చేయలేక పోయారు. ఉత్తరప్రదేశ్ లో గతంలో 37 జిల్లాలుండేవి. ఇప్పుడు వాటి   సంఖ్య 57. ఇంకో మూడు జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ     రాష్ట్రంలోని జిల్లాల సగటు వైశాల్యం 11,959 చ. కి. మీ. ఉంది. గ్రామాలకు    జిల్లా కేంద్రాలకు రాకపోకలు ఎంతో భారంగానే ఉన్నాయి. అందువలన ప్రతి   పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తే 42 జిల్లాలు వస్తాయి. లేదంటే భౌగోళికంగా రాష్ట్రాన్ని 40 సమాన వైశాల్యం గలా జిల్లాలుగా    విభజించి, ప్రతి జిల్లాకు 30 మండలాలను కేటాయించాలి.
             
              పట్టణాలు మరింత దుర్భరంగా మారిపోకుండా ఉండాలంటే వలస     నిరోధక చర్యలు చేపట్టాలి. సౌకర్యాల వికేంద్రేకరణ సమంగా జరగాలి.       మండల కేంద్రాలలో ఉపాధి సౌకర్యాలను పెంచాలి. లక్ష జనాభా దాటిన   పట్టణాలలో ఇక కొత్తగా ఎలాంటి పరిశ్రమ పెట్టనివ్వకూడదు. వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలను మూసి వేయించాలి. పల్లెటూళ్ళకు        రోడ్డు, రవాణా సదుపాయాలు విస్తరించాలి. పల్లెలకు చేరువలో పరిశ్రమలు స్థాపించేవారికి రాయితీలు కల్పించాలి. వ్యవసాయాధార పరిశ్రమలను భారీగా ప్రోత్సహించాలి. నగరాలలోను, పెద్ద పెద్ద పట్టణాలలోనూ ఉండే      డైరీఫారాలను, కోళ్ళఫారాలను వాటి బయటికి తరలించాలి. రోడ్ల వెడల్పు     కార్యక్రమాలు అన్ని పట్టణాలలోను చేపట్టాలి. మురికి వాడల్లోని జనాన్ని        పల్లెటూళ్ళకు తరలించి వారికి తగిన పనిని అక్కడే కల్పించాలి. యాచకుల్నీ,       ఫుట్ పాత్ ల మీద నివసించే దిక్కులేని అనాధాలను పట్టుకొని      అనాధాశ్రమాలకు,వృత్తి శిక్షణా కేంద్రాలకూ పంపాలి.  రాష్ట్రవ్యాప్తంగా భిక్షుక నివృత్తి చట్టాన్ని కఠినంగా అమలు జరపాలి. అయిదు లక్షల జనాభా దాటిన    పట్టణాలకు చుట్టూ అయిదు మైళ్ళ పర్యంతం జనావాసాలను నిషేధించి ఆ     ప్రాంతంలో చెట్ల పెంపకం, పండ్ల తోటలు నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల కోసం నగరాలలో స్వంత ఇల్లు కట్టించి ఇచ్చేకంటే భారీ ఎత్తున ప్రభుత్వ క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలి. రిటైర్ అయిన ఉద్యోగులకు వారి వారి       మండల     కేంద్రాలలో స్వంత ఇల్లు ఇచ్చి, వారిని నగరం నుండి       పంపివేయాలి. రాష్ట్రానికి రెండవ రాజధానిగా మరో పట్టణాన్ని ఎన్నుకుని   అసెంబ్లీ సమావేశాలు ఒక సారి హైదరాబాదులోను మరో సారి అక్కడా జరుపుతూ ఉండాలి. హైకోర్టు బెంచీని మరో చోట ఏర్పాటు చెయ్యాలి.       రాజధాని నగరంలోని ప్రతి శాఖాధిపతి కార్యాలయాన్ని విభజించి రాష్ట్రంలోని        నాలుగు ప్రాంతాలలో నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చెయ్యాలి.   పల్లెల్లో పక్కా, ఇళ్ల నిర్మాణం వల్ల ఎంతో మేలు జరిగింది. మండల     కేంద్రాలలో గృహనిర్మాణానికి అవసరమైన ఉపకరణాల తయారీ కేంద్రాలను        నెలకొల్పి, పల్లెల్లో శాశ్వతగ్రహాల నిర్మాణం భారీగా జరపాలి. కొత్తగా పోస్ట్     గ్రాడ్జుయేట్ కాలేజీల స్థాపన ఆపివేసి, ప్రతి మండలం లోనూ వృత్తి విద్యా   కేంద్రాలు విధిగా స్థాపించాలి. జిల్లా కొక వ్యవసాయ, వృత్తి విద్యా కళాశాల       స్థాపించాలి. వ్యవసాయాధార పరిశ్రమలను విరివిగా పల్లెల్లో స్థాపించి    ఎక్కడివారికక్కడే ఉపాథి లభించే ఏర్పాట్లు చెయ్యాలి. ఇలాంటి        ప్రయోజనకరమైన పనులు చేపట్టక పోతే, పట్టణాలకు పల్లె ప్రజల వలస    అదే పనిగా కొనసాగుతూ పట్టణ ప్రజల జీవితం దుర్భరంగా మారి పోతుంది.      పల్లెటూళ్లలో పేదరికం, నిరక్షరాస్యత తాండవిస్తుంటుంది. కొత్త ప్రభుత్వం ఈ      విషయాల మీద దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

              1991 నాటికి మన రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల పరిస్థితి ఈ క్రింది       విధంగా ఉంటుంది. 1981 నాటికే వీటి జనాభా 50 వేలు దాటింది.









పట్టణం పేరు
1981 నాటికి జనాభా ( వేలల్లో)
పెరుగుదల రేటు
1991 నాటికి జనాభా
 ( అంచనా వేలల్లో)
1
హైదరాబాదు
2528
41
3564
2
విశాఖపట్టణం
594
64
974
3
విజయవాడ
545
58
861
4
గుంటూరు
367
36
500
5
వరంగల్
336
62
544
6
రాజమండ్రి
268
42
381
7
నెల్లూరు
236
77
418
8
కాకినాడ
227
38
313
9
కర్నూలు
207
51
313
10
నిజామాబాద్
183
58
289
11
లూరు
168
32
222
12
మచిలీపట్టణం
139
23
171
13
అనంతపురం
120
49
179
14
తెనాలి
119
16
138
15
తిరుపతి
115
75
201
16
విజయనగరం
115
33
153
17
ఆధోని
109
28
140
18
ప్రొద్దుటూరు
107
51
162
19
కడప
103
56
161
20
భీమవరం
102
60
163
21
ఖమ్మం
99
73
171
22
కొత్తగూడెం
95
26
120
23
నంద్యాల
88
30
114
24
మహబూబ్ నగర్
87
69
147
25
చిత్తూరు
86
37
118
26
కరీంనగర్
86
76
151
27
ఒంగోలు
85
60
136
28
గుంతకల్లు
84
27
107
29
గుడివాడ
80
31
105
30
అనకాపల్లి
73
28
94
31
చీరాల
73
33
97
32
జనగామ
70
204
213
౩౩
శ్రీకాకుళం
68
50
102
౩4
నరసరావుపేట
67
54
103
35
నల్గొండ
63
89
119
36
చిలకలూరిపేట
62
48
92
37
తాడేపల్లిగూడెం
61
40
85
38
హిందూపూర్
56
30
73
39
బాపట్ల
55
32
73
40
మదనపల్లి
55
51

83
41
తాడిపత్రి
54
71
92