బీ.సీ లూ, కాపులూ
గీటురాయి 11-3-1994
“మౌనం దాల్చాడూ అంటే మనసులో ఇష్టం లేదన్నమాట. గదుముతున్నాడూ అంటే లోభి
అన్నమాట. దర్శనం ఇవ్వటం లేదూ అంటే మనల్ని చూడటమే ఇష్టం లేదన్నమాట. పెడమోము
పెట్టాడూ అంటే గిట్టు బాటు కాలేదని అర్ధం. ఇది సమయం కాదు అంటే వాయిదా వేద్దామని అర్ధం.
చూద్దాంలే అన్నాడంటే బొక్కలు వెతుకుతానని అర్ధం. అతి వినయంతో అలాగే అన్నాడంటే ఇక
నీకు ఆ పని కానట్లే. ఇటువంటి నాయకుల చేష్టలు ఎరుగలేక వెంబడించే కాపులు నిజంగా
వెర్రివాళ్ళే” అంటూ రావులపాలెంలో కాపులు “ఆకులు” “మిరియాలు” నూరుతూ ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డికి నిరసన తెలిపారు.
కాపులకు కార్పొరేషన్
ఛైర్మన్ పదవులు, మంత్రి పదవులు ఇస్తే సరిపోదు. వెనుకబడిన కులాల్లో చేర్చాలని వారి
డిమాండు. ఏడు మనువులు జరిగినా తమకు ఏకులరాట్నం తప్పలేదని వారి ఏడుపు. బీ.సీ.
కమీషన్ ఉంది గదా, అది సిఫారసు చేస్తే చేరుస్తాంలే అని ముఖ్యమంత్రి సాగదీసి సమాధానం
ఇచ్చారు. ఏకాదశి అని ఈత కొయ్యల్లో పడతానా ? అని ఎదురు తిరిగారు.
ఇటీవల స్థానిక సంస్థల్లో 33
శాతం రిడర్వేషన్ ఇవ్వటం, మండల్ కమీషన్ సిఫారసుల మేరకు కేంద్ర సర్వీసుల్లో
నియామకాలు జరపటం లాంటివి కాపుల్లో కలకలం సృష్టించాయి. ఎర్రను వేసి చేపను
పట్టినట్లుగా కాపుల ఓట్లు చూపించి బి.సి. స్టేటస్ కొట్టేద్దామని వారి ఆలోచన. అయితే
ఎద్దుకు ఎనబోతుకూ లంకె వేసినట్లుగా రెడ్లకూ, కాపులకూ పురాతన సంబంధం ఉందనీ ఇద్దరూ
ఒకటేననీ హరిరామ జోగయ్య అప్పుడెప్పుడో అన్న వాక్యాలు ఉటంకిస్తూ అంత పెద్ద
కులస్తుల్ని బీసీల్లో చేర్చటానికి వీల్లేదని కొందరు అభ్యంతరం చెబుతున్నారు.
ఇప్పుడు బీసీల్లో 93
కులాలున్నాయి. వీటిలో 4 గ్రూపులు. చాకలి, మంగలి, బెస్త, వడ్డెర, మేదరి, గౌడ,
కుమ్మరి, సాలె, కంసలి, కురుమ, యాదవ, మున్నూరు కాపులు, కొప్పుల వెలమ లాంటి
కులస్తులు రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లబ్ది పొందారు. అయితే బాలసంతు, బడబుక్కల,
దాసరి, దొమ్మరి, గంగిరెద్దుల, కాటిపాపల, పంబల, పాముల, పెరికి, ముగ్గుల, మందుల,
జోగి, జంగం, పిచ్చిగుంటల, వీరముష్టి, పూసల, సాతాని, ఆరెకటిక మొదలైన కులాలు చీకట్లో
సివాలేసినట్లు అల్లాడి పోతున్నాయి. తాగిన వాడిదే పాట, సాగిన వాడిదే ఆట అన్నట్లు ఈ
వీరముష్టి జాబితాలో ఇప్పటికే విపరీతమైన తొక్కిసలాట జరుగుతోంది. తెలివిగల పెళ్ళాం
తెల్ల వారిన తరువాత ఏడ్చిందట. బెస్త వాళ్లను చూచి బుడబుక్కల వాళ్ళు, గౌడులను,
గొల్లలను చూచి గంగిరెద్దుల వాళ్ళు, మున్నూరు కాపుల్ని చూచి మొండిబండ వాళ్ళు, మంగలి
వాళ్ళను చూసి మందుల వాళ్ళు, కొప్పుల వెలమల్ని చూసి కాటిపాపల వాళ్ళు చాకలి వాళ్ళు
చూసి జంగాలు కత్తులు నూరుకుంటున్నారు. తమ నోటి కాడ కూడు కొట్టివేసినట్లు
బాధపడుతున్నారు. రేషన్ షాపు దగ్గర క్యూలాగా ఉంది. సినిమా హాలు దగ్గర టిక్కెట్ల
కొట్లాటలాగా ఉంది. తాటి ఎత్తు ఎగిరానంటే తారాజువ్వెత్తు ఎగురు అన్నట్లు బలమైన కులాలు బలహీన కులాలను అణగదొక్కి అయినా సరే పైకి
ఎగరటానికే ప్రయత్నిస్తున్నాయి. ఎగరటంలో పోటాపోటీ పడుతున్నాయి. తినేది, కుడిచేది రెడ్డిసాని,
కనేది కట్టేది గుడ్డిపోలిలాగా ఉన్న ఇటువంటి పరిస్థితిలో కాటిపాపల వాళ్ళ ప్రక్కన
కాపుల్ని చేర్చటం అన్యాయమని ఆ వర్గానికి చెందిన ఓ నాయకుడు నాతో వాదిస్తే నేను
అవాక్కయ్యాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి