ఇదే
లోకమంటే...
గీటురాయి 23-7-1993
దైవ భక్తిని
చంపాలని ధనాపేక్షా, ధనాపేక్షను చంపాలని దైవభక్తీ సదా ప్రయత్నిస్తూ ఉంటాయి. మానవ
అంతరంగంలో ఈ రెండు లక్షణాల మధ్యా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎవడు ఏ లక్షణానికి పట్టం
కడతాడో, ఆ లక్షణమే వాడి బ్రతుకు తీరును నిర్దేశిస్తుంది. “ద్రవ్యం ఆశ్రయాస్పదం” అన్నాడు సాలోమోను. “ధనాపేక్ష సమస్త
కీడులకూ మూలం” అన్నాడు ఫౌలు. “మీరు దేవునికీ, సిరికీ దాసులుగా ఉండలేరు” అన్నాడు
ఏసుక్రీస్తు. ధవాపేక్ష మనిషిని ఎలా దూరం చేస్తుందో తెలియజేసే కథ ఒకటి వినండి.
ఏసుక్రీస్తు (ఈసా)
దగ్గరకు ఒక మనిషి వచ్చి “అయ్యా నిన్ను వెండిస్తాను” అంటాడు. సరేనని
ఇద్దరూ ప్రయాణం సాగిస్తారు. ఓ నదీ తీరంలో భోజనానికి కూర్చుంటారు. వారి దగ్గర మూడు
రొట్టెలు ఉంటాయి. వారిద్దరూ రెండు రొట్టెలు తింటారు. ఇంకో రొట్టె మిగిలింది. ఈసా
లేచి నదిలో నీళ్ళు త్రాగి తిరిగి వస్తారు. అక్కడ రొట్టె కనబడదు. “ఆ రొట్టె ఎవరు తీశారు ?” అని అడుగుతాడు ఈసా. “నాకు తెలియదు అంటాడతను. సరేనని ప్రయాణం
కొనసాగిస్తారు ఇద్దరూ. ఒక చోట ఒక జింక తన రెండు పిల్లలతో కనిపిస్తుంది. వాటిలో ఒక
దానిని ఈసా తన దగ్గరకు పిలిచి, దాన్ని చంపి, కొంత భాగాన్ని కాల్చగా ఇద్దరూ
తింటారు. అప్పుడు ఈసా “అల్లాహ్ యొక్క అనుమతితో నీవులే” అనగానే ఆ జింక లేచి వెళ్లిపోతుంది. “ఈ సూచన చూసిన వాని పేరిట నిన్ను
అడుగుతున్నాను. ఆ రొట్టె తీసిందెవరు ?” అంటాడు ఈసా. “నాకు తెలియదు” అంటాడు అతను.
ఆ తరువాత వాళ్ళొక
నది దగ్గరకొస్తారు. ఈసా అతని చేతిని పట్టుకొని నీళ్ళ మీద నడిపించి ఆ దరికి
తెస్తాడు. “ఈ సూచన చూసిన వాని
పేరిట నిన్ను అడుగుతున్నాను. ఆ రొట్టె తీసిందెవరు” అంటాడు ఈసా. “నాకు తెలియదు” అంటాడతను.
తరువాత వాళ్ళొక
ఎడారిలోకి వస్తారు. ఈసా అక్కడ కూర్చొని ఇసుక పోగు చేసి పెద్ద కుప్పగా పోస్తాడు. “అల్లాహ్ అనుమతితో బంగారంగా మారిపో” అని ఆదేశిస్తాడు. ఆ కుప్ప బంగారం
అవుతుంది. దాన్ని ఆయన మూడు భాగాలుగా చేసి “ఒక భాగం నాకు, ఒక భాగం నీకు, ఇంకో భాగం రొట్టెను తీసికున్న
వాడికి” అన్నాడు. అప్పుడు
వాడు “ఆ రొట్టె తీసిన
వాణ్ణి నేనే” అన్నాడు. అందుకు
ఈసా “ఇదంతా నీదే,
తీసుకో” అని వాడిని
విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
అప్పుడు ఈ బంగారం
కుప్ప గలవాడి దగ్గరకు మరో ఇద్దరొస్తారు. వీడిని చంపి బంగారం కాజేద్దామని
ఆలోచిస్తాడు. “ఈ బంగారం మన
ముగ్గురిదీ. మీలో ఒకడిని ప్రక్క ఊరికి పంపి తినేందుకు ఆహారం కొనుక్కురమ్మనండి” అంటాడు వాడు. ఆ ఇద్దరిలో ఒకడు వెళతాడు.
వెళ్ళినవాడు “ఈ బంగారం నేను
వాళ్ళకెందుకు పంచాలి ? ఈ ఆహారంలో విషం
కలిపి వాళ్ళిద్దర్నీ చంపి మొత్తం సంపద నేనే తీసుకుంటాను” అని అనుకుంటాడు. అలాగే చేస్తాడు.
బంగారం కుప్ప
దగ్గర కాపలా ఉన్న ఇద్దరూ ఇలా అనుకుంటారు. “ఆహారం తేవటానికి వెళ్ళిన వాడికి మూడో భాగం మనమెందుకివ్వాలి? వాడు తిరిగి రాగానే వాడిని చంపి ఇదంతా
మనిద్దరము పంచుకుందాం”. వాడు తిరిగి రాగానే వాడిని చంపి, వాడు తెచ్చిన ఆహారం తిని
వీళ్ళు కూడా చచ్చిపోతారు.
ఆ బంగారమంతా
ఎడారిలో ఈ ముగ్గురి శవాల మధ్యాపడి ఉంటుంది. ఈసా తిరిగి ఆ దారిన వస్తూ వాళ్ళను
చూచి, తన సహచరులతో అంటాడు “ఇదే లోకమంటే, దీన్ని గురించి జాగ్రత్తగా ఉండండి”.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి