అమలుకాని సిఫారసులు – ఆంధ్రప్రజల అవస్ధలు
గీటురాయి
11-1-1991
“అసమర్ధత, అసూయలు ప్రాథమిక లక్షణాలుగా ఉండే 'ఇంజలిటిటిస్' వ్యాధితో బాధపడే పరిపాలనా
యంత్రాంగానికి శస్త్ర చికిత్స చేయక తప్పదు” అని ప్రఖ్యాత
మేనేజ్ మెంట్ మేధావి పార్కిన్ సన్ అన్నారు. పన్నులు వసూలు చేయడం, దొరికినంత మేర
దోచుకొని తన దేశానికి తరలించడమే బ్రిటిష్ వాడి పాలనలో ప్రధాన ధ్యేయంగా ఉండేది.
స్వాతంత్ర్యానంతరం మనది ప్రజల ప్రభుత్వం అయ్యింది. సామాన్యుడికి చేరువలో అతని
సంక్షేమాన్ని కాంక్షిస్తూ సేవలందించే “పనిచేసే ప్రభుత్వం” అనిగూడా అనిపించుకోవాలని కాంక్షించింది. ఆ దిశగా చాలా
మార్పులు జరిగాయి. కాని పెరుగుతున్న జనాభాకు, విస్తరించిన వైశాల్యానికి అనుగుణంగా
పాలనా సదుపాయాలు విస్తరించలేదు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఒక ప్రజాసేవ కేంద్రంగా
మారకపోతే బ్రిటిష్ వారి ఆఫీసులకు మన ఆఫీసులకు తేడా ఏమిటి ?
మన రాష్ట్రం ఏర్పడిన తరువాత 1957 లో మొట్టమొదటిగా ప్రభుత్వ
యంత్రాంగంలో పొదుపు చేయించటానికి ఆర్ధిక కమిటీ నియమించబడింది. 1960 లో ఉన్నితన్
కమిటీ, 1964 లో రామచంద్రా రెడ్డి కమిటీ, 1967 లో యమ్.టి. రాడి కమిటీ, 1980లో లాల్
కమిటీ, చంద్రశేఖర్ కమిటీ, 1981 లో శ్రీ రాములు కమిటీ, 1985 లో రుస్తుంజీ కమిటీలు
పరిపాలనా సంస్కరణలు సూచించటానికి నియమించబడ్డాయి. 1976 లో వివిధ శాఖలకు చెందిన
రెండు వందల మంది ఎన్జీవోలు సమావేశమై చర్చలు జరిపి అమూల్యమైన సిఫారసులు చేశారు.
అయితే ఈ సిఫారసుల్లో ఇంకా ఎన్నో అమలుకు నోచుకోలేదు. అమలు జరగని వాటిని సూత్రం
ఈనాడు మళ్ళీ మనం మననం చేసుకుందా. ప్రతి ఏటా జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాలు సార్ధకం
కావాలంటే, ప్రజలకు పాలనా సదుపాయాలు చేరువై వారు సంతృప్తి చెందాలి. కాలం చెల్లిన
బూడి పట్టిన పాత పద్ధతులను విడనాడి, నవీన వైజ్ఞానిక పద్ధతుల్ని మన పాలనా యంత్రాంగం
సంతరించుకోవాలి.
ఇప్పుడు నేటికీ అమలుకు నోచుకోని పాత సిఫారసులు కొన్ని
చూద్దాం : -
1960 ఉన్నితన్ కమిటీ సిఫారసులు
1. వివిధ శాఖాధిపతుల కార్యాలయాలను రాష్ట్ర సచివాలయంలో విలీనం
చెయ్యాలి.
2. జిల్లాలను ఒక పద్ధతి ప్రకారం పునర్ వ్యవస్థీకరించాలి.
3. వివిధ శాఖల పనిని సమన్వయించడానికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో
మూడు నెలలకోసారి సమన్యయ సంఘం సమావేశం జరగాలి. ఎప్పటికప్పుడు పరిపాలనా సంస్కరణలను
సూచించేందుకు ఒక స్థాయీ సంఘం ఏర్పడాలి.
1964 రామచంద్రా రెడ్డి కమిటీ సిఫారసులు
1. జైళ్ళను న్యాయశాఖకు బదిలీ చేయాలి.
2. మునిసిపల్, పంచాయితీరాజ్ శాఖలను ఒకే శాఖగా చేయాలి.
3. గ్రామాధికారులుగా యల్. డి. పి. లను నియమించి వారికి
పంచాయితీ కార్యనిర్వహణాధికారులు, కో ఆపరేటివ్ ఇన్స్ పెక్టర్లుగా ప్రమోషన్ పొందే
అవకాశం కల్పించాలి.
1967 యం.టి. రాజా కమిటీ సిఫారసులు
1. సివిల్ సప్లయస్ పనిని జిల్లాకలెక్టర్ ల పరిధి నుండి
తప్పించాలి.
ఉద్యోగుల నాయకుడు శ్రీ ఎ. రాములు కమిటీ 1981 లో
నియమించబడింది. ఆయన తన రిపోర్టును సమర్పించక ముందే తెలుగుదేశం ప్రభుత్వం ఆ కమిటీని
1983 లో రద్దు చేసింది.
1976 ఎన్జీవో ల సదస్సు సిఫారసులు
1. అన్ని శాఖాధిపతుల
కార్యాలయాలను సెక్రటేరియట్ లో కలిపివేయాలి.
2. రెవెన్యూ బోర్డును రద్దుచేసి ప్రాంతీయ కమీషనర్ల
కార్యాలయాలను ఏర్పాటు చేయాలి.
3. గ్రామాధికారులుగా యల్.డి.పి.లను నియమించి వారికి
ట్రాన్సఫర్, ప్రమోషన్ అవకాశాలు కల్పించాలి. (ప్రస్తుత ప్రభుత్వం దీన్ని
తిరగదోడుతున్నది).
1985 రుస్తుంజీ నివేదిక సిఫారసులు
1. ఉద్యోగులకు శాశ్వత ప్రాతిపదిక మీద శిక్షణా ఏర్పాట్లు
జరగాలి.
2. మంచి గాలి వెలుతురు వచ్చేలా ఆఫీసులో, సీట్లు ఏర్పాటు
చేయాలి.
ఉద్యోగులకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేయాలి. వారికి రావలసిన ఇంక్రిమెంట్లు,
భత్యాలు, శలవులు ఆలస్యం లేకుండా మంజూరు చేయాలి.
3. 20 సంవత్సరాల సర్వీసుదాటిన ఎన్జీవోల్లో బాగా పని చేసిన 25
మందిని ప్రతి ఏటా నగదు బహుమతితో సత్కరించాలి.
ఈ అమలుకాని సిఫారసులతో పాటు, ఈనాటి అవసరాలకు అనుగుణంగా
మరిన్ని సలహాలనిచ్చి, రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని సమర్ధవంతం చేసేందుకుగాను,
ప్రభుత్వం ఎన్జీవోలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పాలనా సంస్కరణల గురించి
సరైన సలహాలు వాళ్ళే ఇవ్వగలరు. ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో ప్రజలకు అతి దగ్గరలో
ఉండేది ఎన్జీవోలే కాని ఐ. ఎ. ఎస్. ఆఫీసర్లు కాదు. ప్రభుత్వం ఎన్జీవోలతో చర్చలు
జరిపి వారి సలహాలు తీసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి