మత స్వేచ్ఛ పై సోవియట్ కొత్త వత్తిడి
గీటురాయి -5-1987
(అనువాదం)
తజికిస్తాన్ లోని కుర్గాన్ ట్యూబ్ ప్రాంతంలో “చాయ్ ఖానా” లనే తేనీటి శాలలు ఉన్నాయి. ఈ
చాయ్ ఖానాలలోకి ఎక్కువగా ముస్లిం విశ్వాసులు వస్తుంటారు. మత గ్రంధాలు చదవాలన్నా,
ప్రార్ధనలు చేసుకోవాలన్నా వారికి ఈ తేనీటి శాలలు అనువుగా ఉన్నాయి. సోవియట్
ప్రభుత్వం ఇప్పుడా తేనీటి శాలల్ని మూసి వేసింది. అక్కడ ఇస్లామ్ వ్యతిరేక ప్రసంగాలను చేసి రమ్మని నూరుల్ హకోవ్
అనే కరుడు గట్టిన నాస్తికుడయిన ఓ కమ్యూనిస్టు కార్యకర్తను పంపింది.
కాని ఈ టీ హౌసులను మూసి వేసి ముస్లిములను తమ విశ్వాసాన్ని
ఆచరించకుండా అడ్డగించడం ద్వారా ఏమీ లాభంలేదనీ, పైగా ఇస్లామ్ ను ఎదిరించటానికి ఉన్న
మంచి ప్రసంగ వేదికలు మూత పడ్డాయని ఆయన వాపోయాడు. బ్రెజివ్ గారి హయాం నుంచీ
కొనసాగుతున్న “ఇస్లాంపై శాస్త్రీయ పోరాటం” కుంటు పడిందని నూరుల్ హకోవ్ తెగ బాధపడ్డాడు.
నవీన సోవియట్ సమాజం యొక్క అవసరాలను మత విశ్వాసాలను సమన్వయం
చేయటం అసాధ్యమని సోవియట్ సిద్ధాంతం. రష్యా నాయకుల పిడివాదం ప్రకారం అల్లాహ్ లేడు.
ఎందుకంటే సోవియట్ అంతరిక్ష యాత్రికులు ఆయన్ని అంతరిక్షంలో నయినా ఎదుర్కోవడం
జరగలేదు. ఇలాంటి “శాస్త్రీయ” వాదాలతో ముస్లిముల్ని ఎదుర్కోమని సోవియట్ కార్యకర్తలకు
ఆదేశాలు జారీ అయ్యాయి. ముస్లిములు కూడా ఇలాంటి శాస్రీయ దృక్పథాన్ని అలవరచుకొని
మిగతా కమ్యూనిస్టులాగా మారిపోవాలని ఈ కార్యకర్తలు ఊరూరు తిరిగి ప్రచారం
చేస్తున్నారు. అల్లాహ్ నిజంగా ఉంటే సోవియట్ అంతరిక్ష యాత్రికులు ఆయన్ని తప్పకుండా
చూచేవాళ్ళే కాబట్టి, ఇస్లామ్ అశాస్త్రీయమైన ఒక వితండవాదం అని, ఈ విషయాన్ని
ముస్లిముల చేత ఒప్పించ గలిగితే, వారు ఇస్లామ్ ను తమంతట తామే తిరస్కరించి,
శాస్త్రీయ సోవియట్ సోషలిస్టులౌతారని వారి భావన.
ప్రస్తుతం అధ్యక్షుడు మిఖాయిల్ గొర్బొచేవ్ నేతృత్వంలో
మార్క్సిస్టు – లెనినిస్టు సిద్ధాంత పంథాలో, సత్వర ఫలితాలను రాబట్టడం కోసం,
మరింత ఆచరణాత్మక మనస్తత్వంతో ముస్లిములపై ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈయన
అధికారంలోకి వచ్చింది మొదలు ముస్లిముల విశ్వాసాలపై ఈ బహిరంగ దాడి, దౌర్జన్యాలు
ఎక్కువయ్యాయి.
నూరుల్ హకోవ్ తేనీటిశాలల్లో నాస్తికత్వాన్ని బోధించటమేగాక,
ఇస్టామీయ సమాజంలోని నాలుగు సాంప్రదాయక మార్గాలను కొల్లగొట్టి ఇస్లామ్ ను కూకటి
వేళ్ళతో పెళ్ళగించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. “జమాత్-ఇ-ముయినఫెదన్” అనే పెద్దల సంఘాలలోకి నాస్తికులు చొచ్చుకుని పోయి సామాన్య
ముస్లింలకు ముస్లిమ్ గురువులకు మధ్య శతృత్వం పెంచాలని, సోవియట్ చట్టాలను
అతిక్రమించి మత విశ్వాసాలను అనుసరించే వారిపై దాడి జరపాలని ఆయన పథకం వేశాడు. 1983
లో తజికిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఈ చిట్కాలను ప్రత్యేకంగా
సూచించింది. ఇంకా “కొత్త మతరహిత ఆచారాలను
అవలంబించమని” కూడా ఇది ముస్లిం పెద్దల సంఘాలను
కోరింది.
మతఛాందసుల కార్యక్రమాలకు, సంఘ వ్యతిరేక శక్తులకు
వ్యతిరేకంగా గ్రామీణ సమావేశాలను వాడుకోవాలని నూరుల్ హకోవ్ మరో సూచన చేశాడు. ఆ
విధంగా ప్రజాభిప్రాయాన్ని మలచి ముస్లింల నుండి ఇస్లాంను దూరం చేయవచ్చని ఆయన
భావిస్తున్నారు.
ప్రత్యేక కుటుంబాన్ని గురిగా పెట్టుకోవాలని ఆయన మూడవ ఆలోచన
ఎందుకంటే కుటుంబాల ద్వారానే యువతీ యునకుల్లో మతం వ్యాపిస్తోందట. 1986 జనవరిలో
జరిగిన పార్టీ సమావేశంలో ఇలా తీర్మానించాడు. “మధ్య ఆసియా
యువతరాన్ని ఇస్లామ్ బాగా ఆకట్టుకుంటోంది. కనుక వృత్తి పరమయిన ఇస్లామీయ వ్యతిరేక
ఉద్యమకారులు ముస్లిమ్ కుటుంబాలలోకి చొచ్చుకు వెళ్ళాలి. ఆ కుటుంబాలు ఎలాగైనా సరే
కమ్యూనిస్టు విద్యను అభ్యసించేలా వారు తమ శక్తియుక్తుల్ని వినియోగించాలి.
ముస్లిం విశ్వాసుల్లో స్త్రీలు చాలా ముఖ్యమైన భాగం. వీరిలో
ఎగిసి పడుతున్న ఇస్లామీయ విశ్వాస తరంగాన్ని అణచి వేయడానికి ప్రత్యేక కృషి చేయవలసిన
అవసరముందని నూరుల్ హకోవ్ పార్టీకి విన్నవించుకున్నాడు. ఈ క్లిష్ట సమస్యను
ఎదుర్కోవడానికి వారి చేత “పదుల పద్ధతి”ని అవలంబింపజేయాలని ఆయన సూచించాడు. 1981-82 లో ఈ “పదుల పద్ధతి”ని తజకిస్తాన్ లో ప్రవేశ పెట్టారు. ఈ పద్ధతి ప్రకారం
కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రతి జిల్లాను పదేసి కుటుంబాల చొప్పున పంచుకుంటారు.
ప్రతి కార్యకర్తల బృందంలో కరుడు గట్టిన ఇస్లామ్ వ్యతిరేక ఉద్యమకారులయిన డాక్టర్లు,
టీచర్లు మొదలయిన వారుంటారు. వీరంతా సాధారణంగా ఆ పది కుటుంబాల వారి పొరుగు వాళ్ళే
అయి ఉంటారు. వీళ్ళు రోజూ పది ఇళ్ళు సందర్శించి అక్కడ ఇస్లామీయ వ్యతిరేక బోధచేసి
వస్తారు. ఆ ఇళ్ళల్లో ఎవరెవరు నమాజ్ చేస్తూ ఉంటారో లేదా ఇతర మతపరమయిన కార్యకలాపాలు
సాగిస్తూ ఉంటారో జాగ్రత్తగా కనిపెడతారు. అలా ఈ “పదుల వాళ్ళు” తమ పొరుగు వారిని బెదిరించి, వారి
గురించి అధికారులకు ఫిర్యాదు చేస్తుంటారు.
'ముస్లిమ్ జీవన మార్గం' పైన నూరుల్ హకోవ్ ద్వార్ సోవియట్
ప్రభుత్వం ఇలా దాడి ప్రారంభించింది. కాని అధికార సోవియట్ ముఫ్తీలు మాత్రం “అబ్బే ఏమీ కాలేదు” అంటుంటారు.
సోవియట్ రష్యాలో ముస్లిములపై అనేక విధాల దాడి జరుగుతున్నప్పటికీ, అక్కడ ముస్లిములు
నిక్షేపంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు బాకీలో పోయిన ఏడాది అక్టోబర్ లో
ఇస్లామిక్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు వక్తలు ఇలాగే చెప్పారు. కాని అదే సమయంలో
నూరుల్ హకోవా ఈ దాడి ప్రారంభించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇస్లామ్ వ్యతిరేకులైన
సోవియట్ మేధావులు అనుకొన్నట్లు “ఈ తేనేటి శాలలు నిస్సందేహంగా
తేనీరు కంటే విలువైనవే”. (అరేబియా నుండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి