27, మార్చి 2013, బుధవారం

అవినీతికి అంతం లేదా?



అవినీతికి అంతం ఎక్కడ
గీటురాయి 30-7-1993

ఏనుగ మీద వేసే అంబారీ గాడిద మీద వేస్తే మోస్తుందా, పడేసి కూస్తుంది గాని ? చిలక పంజరంలో గుడ్లగూబ నుంచితే పలుకుతుందా, భయపెట్టి కులుకుతుందిగాని ? కుక్కని పల్లకీలో కూర్చోబెడితే కుదురుగా ఉంటుందా, కుచ్చులన్నీ తెగ కొరుకుతుందిగాని ? ధర్మ కార్యాల్లో దరిబేసీ వాడినుంచితే ఇస్తాడా, తన్నుకు చస్తాడుగాని ? చెడి బతికిన శుంఠని చేర్చుకుంటే వాడూ చెడతాడు, ఉంచుకున్న వాడూ చెడతాడు అని పెద్దలు మనకు ఎన్నో సుద్దులు నేర్పారు.

హర్షద్ మెహతా ముడుపుల వ్యనహారంలో పలువురి నిర్వాకం ఇలానే ఉంది. అడుగబోయిన అల్లీసాయిబూ అక్కడే, పిలువబోయిన పీరుసాయిబూ అక్కడే అన్నట్లు సి.బి.ఐ., జె.పి.సి., ఆర్.బి.ఐ., నీళ్ళు నములుతూ నిలబడిపోయాయి. హర్షద్ మెహతా తరుపున న్యాయవాదిగా నిలబడిన రామ్ జఠ్మలానీ హర్షద్ నేరగాడు కాడు. డబ్బు సంపాదించడం తప్పా ? హర్షద్ ది అధునాతన ఫక్కీ ఇద్దరు కూడ బలుక్కుని తప్పుడు డాక్యుమెంట్ తయారుచేయటం ఫోర్జరీ కాదు అని వాదిస్తున్నాడు. పి.వి.ని  క్రాస్ ఎగ్జామిన్ చేయటానికి జె.పి.సి. తప్పుకొంది. హర్షద్ డబ్బు డ్రా చేసిన వివరాలు చెప్పటానికి వీలు కాదు అని సి.బి.ఐ., జె.పి.సి. ముందు మొరాయించింది. హర్షద్ కు జె.పి.సి. సమన్లు పంపకుండా కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. అసలు ప్రధాని ఫోన్ చేసి అడిగితే వందలకోట్లు కుమ్మరిస్తారనీ అటువంటి వ్యక్తి కేవలం కోటి రూపాయలకు కక్కుర్తి పడతాడా అని కోట్ల వారు చమత్కరించారు. ప్రధాని ఉప ఎన్నికల ఖర్చు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భరించిందని కోట్ల వారు చెబితే, ప్రజలే భరించారని హనుమంతరావు గారు సెలవిచ్చారు. సదరు జమా ఖర్చులు చెప్పటం సాధ్యం కాదని మజ్జి తులసీదాస్ స్పష్టం చేశారు. ప్రతి పక్షాల పోరు లేక పోతే కథ కంచికీ మనం ఇంటికీ అయ్యేదే. అయితే ఈ రాజకాయ పోరాటంలో నిజాలు తేలటం, శిక్షలు పడటం అనేవి ఎప్పటికి జరిగేను ? ఈ అవినీతికి అతీతమైన పార్టీలు ఏమున్నాయి గనుక ? పార్టీ అవసరాల కోసం ముడిపులు స్వీకరించడం తప్పుకాదని కంచి కామకోటి పీఠాదిపతి లాంటి వాళ్ళే కంచు కంఠంతో చెబుతున్నారు.

అంబటిపూడి అయ్యప్పదీ బట్టతలే, నీదీ బట్టతలే. అయ్యప్పది ఐశ్వర్యపు బట్టతల, నీదేమో పేను కొరుకుడు బట్టతల అన్నాడట ఎవడో. అవసరం ఉన్నతవరకూ ఆదినారాయణ, అవసరం తీరాక ఆసోది నారాయణ అన్నట్లుగా నానా పార్టీల వాళ్ళంతా ఒకరికొకరు మద్దతులు ఇచ్చుకోవటం ఆయా సమయాల్లో ఆయా అవసరాలను బట్టి చేసుకుంటున్నారు. మతం – రాజకీయ కలగలిపి అంట కాగుతున్నారు. అందువలన దేశంలో అస్థిరత్వం, అరాచకత్వం, అవినీతి పెరిగి పోయాయి. మాఫియా గ్యాంగుల మద్దతుతో, బిగ్ బుల్స్ సహకారంతో, త్రిశూలాలు ధరించిన కాషాయ మూకల అండదండలతో, ఆయా పార్టీలు అధికారవేటకొనసాగిస్తున్నాయి. అన్నవాళ్ళు బాగున్నారు, పడిన వాళ్ళూ బాగున్నారు నడుమ ఉన్న వాళ్ళే నలిగి చచ్చారు అన్నట్లు సాధారణ పౌరులు ఈ వేటలో బలి అవుతున్నారు. అన్న వస్త్రాల కోసం ప్రాకులాడే వారికి ఉన్న వస్త్రం కూడా పోతున్నది. అన్ని రోగాలకూ వాతలే మందు అన్నట్లుగా ప్రతి ఏటా రెండు మూడు సార్లు పన్నులు వేయటం, మత కలహాలను రెచ్చగొట్టడం లాంటి పనుల్తో అసలైన 'ఆకలి సమస్య' నుంచి ప్రజల దృష్టి మరలుస్తున్నారు. ఇక ఈ అవినీతి సమస్య కు అంతం ఎక్కడ ? అది సంభవామి యుగే యుగే అని సర్దుకు పోవాల్సిందే ! గోల్ మాల్ అయిన అసలు సొమ్ము ఎంతో కనుక్కోవటానికి మరో 'ప్యానెల్' ను నియమించాలట. అది అరు నెలల్లో పార్లమెంటుకు నివేదిక ఇస్తుందట. ఆ తరువాత దాన్ని ఆనవాయితీగా అటకెక్కిస్తారట !




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి