మూకుమ్మడి శాడిజంపై
కొరడా ఝళిపించాలి
గీటురాయి 8-7-1994
ముద్రగడ ర్యాలీలతో ప్రభుత్వ
ఆస్తులు అభద్రలో పడ్డాయి. కాపుల యాత్రల మీద కాపలా లేదు. మూకుమ్మడి అరాచకత్వాన్ని
ఆపలేక పోలీసులు పిరికి వాళ్ళలాగా దాక్కుంటున్నారు. నక్సలైట్లను ఉక్కు పాదంతో
అణిచివేసిన ప్రభుత్వం, నోటివెంట మాటరాక అనాధలాగా చూస్తున్నది. బస్సులు, ప్రభుత్వ
కార్యాలయాలు దగ్ధం చేస్తున్నది. ఒక వేళ మీ ర్యాలీలో చేరిన రౌడీలేమో కాస్త
పరిశీలించండి అని ఒక డి.ఎస్.పి. ముద్రగడను అడిగితే, అదేంకాదు మా కార్యకర్తలే
తగులబెడుతున్నారు. మీరు ఏం చేస్తారో చేసుకోండన్నట్లు ఆయన సమాధానమిచ్చారు. ఏం
చేస్తే ఏం వస్తుందోననే భయంతో పోలీసులు గుడ్లు మిటకరించి చూస్తుంటే మిగతా కులాల జనం
ఇప్పుడు ఒక పాత సామెతను చెప్పుకుంటున్నారు. అదే – “బలిజ పుట్టుక పుట్టాలి, బతాయి బుడ్డి కొట్టాలి” అని. అయితే ప్రాణం మీద కొచ్చినప్పుడు పంచాంగం చూసి మందు పోసిన రీతిలో
ప్రభుత్వం ఈ కులాల సమస్యను నాన్చటం మంచి పద్ధతి కాదు. నమలక మింగక నానవేయటం ఇక మీదట
కుదరదు. ఆర్ధిక ప్రాతిపదిక మీద అన్ని కులాల వారికి సమానంగా అవకాశాలు కల్పించాలి.
అంటే కులాల వారీగా జనాభా లెక్కలు తీయించి, జనాభా దామాషాలో రిజర్వేషన్లు అన్ని
కులాల వారికి ఇచ్చి వారిలో పేదలకే లాభాలను కట్టబెట్టాలి. అలా కాక కుల నిర్మూలనే
ప్రభుత్వ ధ్యేయం అయితే కుల ప్రసక్తి లేకుండా ప్రజల్ని రెండు వర్గాలుగా (అంటే
ఆస్తిపరులు, పేదవారు) మాత్రమే విడదీసే చూడాలి.
ఇక మూకుమ్మడి ఆచారకాలకు
సమర్ధమైన అణిచివేత విధానం కావాలి. చట్టాన్ని ధిక్కరించి వేలాది మంది రౌడీ పనులకు
పాల్పడితే ప్రభుత్వం వారిని ఏమీ చేయలేక పోతున్నది. అదే పాడుపని ఎవడో ఒక్కడే చేస్తే
పట్టుకొచ్చి బొక్కలో తోస్తున్నారు. మంది మీద చేస్తే పట్టించుకునే దిక్కులేదు.
బాబరీ మసీదును పడ గొట్టిన వాళ్ళను ఎవరూ ఏమీ చేయ లేనట్లే, ఈ ర్యాలీలలో జరిగే హింసను
ఎవరూ ఆపలేకపోతున్నారు. గ్రామస్థులంతా కలిసి ఒక స్త్రీని సజీవ దహనం చేసి మేమే ఆ పని
చేశాం ఏం చేస్తారో చెయ్యండి అని పోలీసుల్ని సవాలు చేశారు. ఒంటరి మనిషిని శిక్షించే
చట్టం, మందిని శిక్షించలేక పోతున్నది. గుంపుల్లో చేరి తమ శాడిజాన్ని ప్రదర్శించే
దుర్వార్గుల్ని కఠినంగా అణిచివేసేందుకు ప్రభుత్వం సమాయత్తం కావాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి