మన ఆచరణే ఆదర్శం కావాలి
గీటురాయి 26-7-1991
“ఒకరి
అస్థిని మరొకరు అన్యాయంగా కబళించవద్దు. ఇతరుల సొమ్మను అన్యాయంగా కాజేసే
దురుద్దేశంతో న్యాయనిర్ణేతల వద్దకు పోవద్దు” అని దైవ గ్రంధంలో ఉంది (2 : 188).
అధికారులకు లంచమిచ్చి పనులు జరుపుకునేవారు, లంచం తీసుకొని అక్రమ మార్గంలో ధనం
సంపాదించేవారు. సమాజాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. నీతిమంతులకు న్యాయం జరుగకుండా
అడ్డు పడుతున్నారు. లంచము, జూదము, వడ్డీ, మోసము, దొంగతనము, లాటరీ, సారాయి వ్యాపారం
మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయం మనకు నరకంలో నివాస స్థలాలను కొనుగోలు చేస్తుంది. “ఎవడైనా
మాటకారితనంతో అన్యాయంగా వాదించి న్యాయ మూర్తిని ఒప్పించి తనకు అనుకూలంగా తీర్పు
రాబట్టుకోవచ్చు. అయితే వాడు నరకంలో కొంత చోటును కొనుక్కుంటున్నాడు”.
లంచగొండులందరినీ ప్రవక్తలు శపించారు.
నీతిని అనుసరించి నడుస్తూ, యదార్ధంగా
మాట్లాడుతూ, నిర్బంధన వల్ల నచ్చే లాభాన్ని ఉపేక్షిస్తూ, లంచం పుచ్చుకోకుండా తన
చేతుల్ని మలుపుకునే వాడే దేవుని సన్నిధిలో అంగీకరించబడతాడని సృష్ట్యాది నుంచీ
ప్రవక్తలు చెబుతూనే వస్తున్నారు. లంచంవల్ల కళ్ళున్న వాడికి కూడా గుడ్డితనం
వస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్ధం పుడుతుంది. న్యాయం లేని తీర్పు వస్తుంది.
పక్షపాతం హెచ్చుతుంది. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయాలు బాధల పాలౌతాయి. సమస్త
కీడులకు చెడుకు మూలమైన ధనాపేక్ష విస్తిరిస్తుంది. దుష్టుల సంఘం తయారౌతుంది.
లంచం పుచ్చుకునే వాడి దృష్టికి లంచం
మాణిక్యంలాగా కనబడుతుంది. వాడు ఏమి చేసినా అందులో యుక్తిగా చేస్తాడు. ఒడిలో నుండి
లంచం పుచ్చుకుంటాడు. న్యాయం విధుల్ని చెరిపి తప్పుడు పనులు చేస్తాడు. అయితే అలాంటి
దుష్టుడికి తగిన దండన కాచుకునే ఉంది. ఈనాడు మనదేశంలో చాలా మంది అధికారులు, రాజకీయ
నాయకులు ద్రోహులుగాను, దొంగల సహవాసులుగాను ఉన్నారు. లంచం కోరుతున్నారు. బహుమానాల
కోసం కనిపెట్టుకుని ఉన్నారు. వాళ్ళు దోచుకున్న దరిద్రుల సొమ్ము వారి ఇళ్ళ లోనే
ఉంది. ప్రజల్ని నలగ్గొట్టి, శ్రమ పడే వాళ్ళ ముఖాల్ని నూరి అధికారులు బలిసిపోయారు.
గొప్ప వాళ్ళు అనుకునే వారుకూడా తమ మోసపు కోరిక తెలియజేస్తున్నారు. వీళ్ళంతా
ఏకపట్టుగా ఉండి తమ పనులు చేస్తున్నారు.
లంచాన్ని వ్యతిరేకించే మంచి వాళ్ళు
ముళ్ళ చెట్లులాగా, యదార్ధవంతులు ముళ్ళ కంచెల్లాగా దుష్టులకు కనిపిస్తారు.
దుష్టులంతా ఏకమై మంచి వాడికి హాని చేయటానికి పొంచి ఉంటారు. కిరాతకుల్లాగా వలలు
పన్నుతారు. కీడు చేస్తారు. దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీరుస్తూరు. నీతి మంతుల
నీతిని దుర్నీతిగా కనబడజేస్తారు. అన్యాయపు విధులు విధిస్తారు. బాధాకరమైన శాసనాలను
వ్రాయిస్తారు. ముడుపులు పుచ్చుకుంటారు. విస్తారమైన డబ్బు బ్యాంకుల్లో దాస్తారు.
దోపిడీ వ్యనస్ధను నిర్మిస్తారు.
దీనంతటి ఫలితంగా కోట్లాది ప్రజలు దుర్భర
దారిద్యంలో మ్రగ్గిపోతుంటారు. నేరాలు పెరుగుతాయి. దొంగతనాలు, హత్యలు, దోపిడీలు
పెచ్చరిల్లుతాయి. ఆకలి, నిరుద్యోగం తాండవిస్తుంటాయి. నిరాశా విద్వేషాలతో
తల్లడిల్లిన యువకులు నక్సలైట్లు అవుతారు. వారిని చంపి దోపిడీ దారుల వ్యవస్ధను
పరిరక్షించేందుకు అనుత్పాదక పోలీసు యంత్రాంగం అవసరమౌతుంది. అక్కడా అవినీతి
అలుముకుంటుంది. వెట్టిచాకిరీ, బానిస వ్యవస్ధ కొనసాగుతుంది. మొత్తం మీద
దుర్మార్గమైన, అతి క్రూరమైన అవినీతి విషవలయం దేశంలో తిష్టవేసి ఉంటుంది. వ్యవస్థను
చక్కబరచటానికి కృషి చేసే శక్తుల్ని అడ్డగించి అణగద్రొక్కి నిర్దాక్షిణ్యంగా నలిచి
పారేసే దోపిడీ శక్తుల సిండికేట్ రాజ్యమేలుతుంది.
అందుకే ఈనాడు మనకు లంచం
పుచ్చుకోని నాయకులు, అదికారులు కావాలి. నోటుకు సారాయికీ అమ్ముడుపోని ప్రజలు
కావాలి. సేవానిరతితో చౌకగా ప్రజలకు వైద్యం చేసే డాక్టర్లు కావాలి. అంకిత భావంతో
అభివృద్ధిని కాంక్షించే నాణ్యతతో పని జరిపే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కావాలి.
పనికి మాలిన చదువుల్ని రద్దుచేసి, వృత్తి విద్యలను నేర్పే పాఠశాలలు కళాశాలలు
కావాలి. అందుకోసం మనమంతా ఏకమౌదాం. మన కోర్కె తీరుతుందా లేదా అనే సందేహం వద్దు.
ముక్తకంఠంతో నిజాయితీని నినదిస్తూ, మన ఆచరణనే పొరుగు వారికి ఆదర్శంగా చూపిస్తూ ఈ
క్లుప్త జీవితాన్ని ముగిద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి