27, మార్చి 2013, బుధవారం

జోనల్ కార్యాలయాలు లేని జోనులెందుకు?

జోనల్ కార్యాలయాలు లేని జోనులెందుకు?

గీటురాయి 18-1-1991

రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ను రద్దు చెయ్యాలని తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ప్రయత్నించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పనికి సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో దాని పుట్టు పూర్వోత్తరాలను, దాని ఆవశ్యకత – అనావశ్యకతలను మననం చేసికోవటం మంచిది.


విశాలాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో మనం కలిసి ఉన్నప్పటికి రాష్ట్రంలో ఆది నుండీ రాయలసీమ తెలంగాణ, ఆంధ్ర అనే వేర్పాటు భావాలు వెల్లడవుతూనే ఉన్నాయి. ప్రత్యేక రాయలసీమ సాధన కోసం ఉద్యమం నడుపుతామని రాయలసీమ ఉద్యోగులు ఇప్పుడు ప్రకటించారు. 1968-69 లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగాయి. అంతకు ముందు  1937 లో రాయలసీమ వాళ్ళ కోసం ఉద్యమాలు శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. 1956 లో తెలంగాణా వాళ్ళ కోసం పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. 1968 అక్టోబర్ 23 న ముల్కీ నిబంధనలను మరో అయిదేళ్ళు పొడిగించాలని మంత్రివర్గం కేంద్రాన్ని కోరింది. తెలంగాణా ఉద్యమాన్ని చల్లార్చడం కోసం అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1970 ఏప్రిల్ 11 న ఎనిమిది సూత్రాల పథకం రూపొందించింది. 1972లో ముల్కీ విధానాన్నిసమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. జై ఆంధ్ర ఉద్యమం లేచింది. రాష్ట్రపతి పాలన పెట్టారు. తెలంగాణా – ఆంధ్ర అనే రెండు రాష్ట్రాలుగా విడిపోదామని రెండు ప్రాంతాల నాయకులు అంగీకరించారు. అప్పుడు 1973 సెప్టెంబర్ 1 న ఇందిరాగాంధీ గారు మరో ఆరు సూత్రాల పథకం మనకు అప్పగించారు. అది మన రాజ్యాంగానికి చేసిన 32వ సవరణ. దీని ప్రకారం రాజ్యాంగంలోని 371 వ ఆర్టికల్ డి అనే క్లాజ్ చేర్చారు.


అంతకు ముందు తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులు తమ
ఉద్యోగాలలోని సాధక బాధకాల నివారణకు కోర్టుల కెళ్ళేవారు. ఒక్కో కోర్టు ఒక్కో రకమైన తీర్పు ఇచ్చేది. న్యాయమిచ్చే పద్ధతి గందరగోళంగా ఉండేది. ఈ అవస్థను తొలగించి అందరికీ త్వరగా న్యాయ సహాయం అందించేందుకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేశారు.

          ఈ న్యాయ వ్యవహారాలతో పాటు ఉద్యోగ అవకాశాలను స్థానికులకే కల్పించాలనే ఉద్దేశంతో లోకల్ కేడర్ల విదానంకూడా తెచ్చారు. దీని ప్రకారం రాష్ట్రాన్ని ఏడు జోనుల క్రింద విడగొట్టారు. 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు ఆయా జోనుల్లోని అభ్యర్ధులకే ఇవ్వాలి. లోయర్ డివిజన్ క్లర్కులు కంటే క్రింది ఉద్యోగాలను ఒక తరగతి క్రింద నిర్ధారించి ఆ జిల్లా వాళ్ళకే ఇమ్మన్నారు. ఇక పై తరగతి ఎన్జీవో ఉద్యోగాలు ఆ జోను వాళ్ళకే ఇవ్వాలన్నారు. ఒక అభ్యర్ధిని స్థానికుడుగా గుర్తించాలంటే అతను ఆ ప్రాంతంలో నాలుగేళ్ళు నివసించి గాని, చదివి గాని ఉండాలి (ఉద్యోగ ప్రకటన వెలువడే నాటికి). స్థానికులు దొరక్కపోతే ముడేళ్ళ వరకు ఆ ఉద్యోగాలు అలాగే ఉంచాలి. తెలుగు గంగ ప్రాజెక్టులో స్థానికేతరులు ఎక్కువయ్యారని, హైదరాబాదులో రాయలసీమ వాళ్ళకు తమ జనాభా నిష్పత్తిలో ఉద్యోగాలు ఇవ్వటం లేదని రాయలసీమ నాయకులు గోల చేస్తున్నారు.

       ఈ ఆరు జోనుల జనానికి ఏడవ జోన్ అయిన హైదరాదులో ఒక నిర్ణీత నిష్పత్తిలో ఉద్యోగాలు ఇవ్వాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ఆరు ప్రదేశాలుగా చీలిపోయింది తప్ప ఈ జోనుల వల్ల ఆశించిన మేలు జరగలేదు. రాష్ట్ర సమైక్యత దెబ్బతింది. జోనుల్ని పెట్టిన వాళ్ళు జోనుల కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. జోనల్ సీనియారిటీ జాబితాలు, ప్రమోషన్లు కూడా రాజధాని లోని శాఖాదిపతులే నిర్వహిస్తున్నారు. ఆరు జోనులకు జోనల్ ఆఫీసర్లు ఉంటే ఆయా ప్రాంతాలలోని శాఖాపరమైన కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. ప్రభుత్వానికి నివేదిస్తారు. జోనల్ కార్యాలయాలు ఉంటే 22 జిల్లాల నుండి అధికారుల్ని హైదరాబాదుకు రప్పించే బదులు కేవలం ఆరుగురు అధికారుల చేత సుళువుగా పనులు చేయించుకోవచ్చు. రాజధాని నగరం మీద పని వత్తిడి ఎంతో తగ్గుతుంది. ఏవో కొన్ని శాఖలకు మాత్రం రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రలలో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. జోనల్ కార్యాలయాల ఏర్పాటును నిర్లక్ష్యం చేశారు.

       ఈ మధ్య 205 డిప్యూటీ తహసీల్దారులు నియమించబడ్డారు. వాళ్ళను అన్ని జిల్లాల్లో నియమించారు. వాళ్ళకు జిల్లా కలెక్టర్లు ప్రమోషన్ ఇవ్వలేరు. ఎందుకంటే అది జోనల్ కేడర్ కు సంబంధించిన ఉద్యోగం. అతను డిప్యూటీ తహసీల్దారుగా ఉన్నంత కాలం ఆ జిల్లాలో ఉంటాడు. తహసీల్దారుగా ఆ జోన్ లోని ఏ జిల్లాలో నయినా నియమించబడవచ్చు. ఇలాంటి పనుల్ని జోనల్ ఆఫీసర్లకు అప్పగిస్తే పనుల్నిరెవెన్యూ కమీషనర్ మీద పని ఒత్తిడి తగ్గదా?

       పైగా అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, జోనుల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించటం, పధకాలను రూపొందించటం, సమన్వయం చేయటం వల్ల జిల్లా జిల్లాకు మద్య విద్వేషాలు తొలిగి ప్రాంతీయ దృక్పథం  ఏర్పడుతుంది. రాజధానిలోని ప్రభుత్వానికి గూడా పరిపాలన సుళువౌతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకూ జిల్లాల వారీ సమాచారం రాబట్టడం లేదు. ఐక్యతను అభివృద్ధిని ఆశించే ప్రభుత్వం తన దృష్టిని జిల్లా స్థాయి నుండి జోనల్ స్థాయికి విశాల పరచుకోవాలి. అలాగైతే స్థానికంగా ఎక్కడికక్కడే పనులు చేయించగల ఉన్నతాధికారులు ( కలెక్టర్ కంటే పై స్థాయి అధికారులు ఆరు జోనుల్లో ఉంటారు. ప్రభుత్వానికి ఆయా ప్రాంతాల పరిస్థితి అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుంటుంది (పట్టిక చూడండి).








ఏ జోను పరిస్థితి ఎలా ఉంది ?

జోన్ లోని జిల్లాలు
జోన్ వైశాల్యం
(చ.కి.మీ)
1961 జనాభా (లక్షల్లో)
జోన్ లోని రెనెన్యూ డివిజన్లు
జోన్     లోని మండలాలు
డివిజన్ల
సగటు
వైశాల్యం
(చ.కి.మీ)
డివిజన్ల సగటు
జనాభా (లక్షల్లో)
మండలాల సగటు
వైశాల్యం (చ.కి.మీ)
మండలాల సగటు జనాభా (వేలల్లో)
జోన్ లో అసెంబ్లీ స్థానాలు
జోన్ లో పార్లమెంట్ స్థానాలు
జోన్ లో
మునిసి
పాలిటీలు
జోన్ లో అక్షరాస్యత శాతం


1, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం (3)
23,537
64
8
113
2,942
8
208
57
37
5
9
24

2. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా (3)
27,283
96
11
152
2,480
9
179
63
54
7
25
38

3. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు (3)
42,093
78
9
158
4,677
9
266
49
43
6
17
33

4. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు (4)
67,300
96
12
233
5,608
8
289
41
53
8
20
30

5. ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం (4)
56,826
81
12
204
4,736
7
278
40
50
7
20
23

6. రంగారెడ్డి, నిజామాబాదు, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ (5)
57,820
98
16
240
3,613
6
241
41
44
7
19
23

7. హైదరాబాదు (1)
217
23
1
4
217
23
54
6
13
2
1
58

ఆంధ్రప్రదేశ్
2,75,076
536
69
1,104
3,987
8
68
48
294
42
111
30


అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, హైకోర్టులకు ఆరు జోనుల్లో బెంచీలు ఏర్పాటు చెయ్యాలి. ఆయా జోనుల్లో మధ్య ప్రాంతాలను ఎన్నుకునేటట్లయితే విజయనగరం, ఏలూరు, ఒంగోల, కడప, వరంగల్లు, హైదరాబాదుల్లో ఈ జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చు. అధికారమంతా హైదరాబాదులోనే తిష్ఠ వేయకుండా ఆరు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతాయి. చీటికీ మాటికీ హైదరాబాదు పరుగెత్తుకు రావలసిన అవస్థ ప్రజలకీ తప్పుతుంది.

       జోనుల వారీగా చూస్తే కొన్ని విచిత్ర వాస్తవాలు బయటపడతాయి. ఒకటవ జోన్ లో రెవిన్యూ డివిజన్లు తక్కువ, మండలాలు తక్కువ. నాల్గవ జోనులో డివిజన్ల, మండలాల సగటు వైశాల్యం ఎక్కువ. రెండవ జోన్లో అసెంబ్లి స్థానాలుఎక్కువ. ఒకటో జోన్ లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలూ, మున్సిపాలిటీలు తక్కువ. రెండో జోన్లో అక్షరాస్యత ఎక్కువ. ఇలా జోన్ల మధ్య పోల్చుకుంటూ పోతే ఏ జోన్ పరిస్థితి బాగా ఉందో చూచి మిగతా జోనుల్ని ఆ స్థాయికి పెంచే కృషి చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు, నీటి పారుదల సౌకర్యాలు, పశుసంపద, పరిశ్రమలు, కళాశాలలు, బ్యాంకులు, రోడ్లు, రైలు మార్గాలు... ఇలా అన్నీ జోన్ల వారీగా విశ్లేషిస్తూ పథకాలు రూపొందించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం జోనల్ కార్యాలయాలకు ప్రారంభోత్సవం చెయ్యాలి.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి