31, జులై 2012, మంగళవారం

సిగ్గులేని సింగారమే రాజకీయ వయ్యారం

సిగ్గులేని సింగారమే రాజకీయ వయ్యారం                          గీటురాయి 5-12-1986
సిగ్గెందుకు లేదురా జగ్గా అంటే, నల్లటివాడిని నాకెందుకు సిగ్గు అన్నాడ. ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే తేడా లేకుండా ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి కుప్పిగంతులు వేసే రాజకీయ నాయకులు ఎప్పుడూ ఉంటారు. ఒక పార్టీ తరఫున గెలిచిన తరువాత మందీ మార్బలంతో సహా అవతలి పార్టీలోకి వలస పొయ్యే వాళ్ళూ ఉన్నారు. అయితే వీళ్ళందరిలో ఒకానొక విశిష్ట పదార్థం ఉండదు. ఆ పదార్థం పేరు సిగ్గు. ఇది వారిలో కొరవడటం వల్ల పదిమందీ ఏమనుకొంటున్నా వారికి ఏమీ అనిపించదు. అసలు వినిపించదు. దీనిని మనం గుర్తు  కోసం విటమిన్ సి అందాం.

సిగ్గు చిన్ననాడేపోయే, పరువు పందిట్లో పోయే. కొరావా సరవా ఉంటే గదిలో పోయే అన్నట్లు పార్టీలు మారి మారి వీరికి సిగ్గు పడాలి అనే సంగతి జ్నాపకం కూడా లేదు. గోగినేని రంగనాయకులు అనే ఆయన ఇందులో ఆచార్యుడు అంటారు. అంతటి ఆచార్యుడు కూడా కొద్దో గొప్పో సిగ్గుపడి నాయకుల గోగినేని రంగా (ఎన్. జీ. రంగా) అని పేరు మార్చుకున్నారు ఎందుకంటే ప్రజలు తేలికగా గుర్తించకుండా ! ఏ పార్టీలో చూచినా ఈయనే కనపడేవారు. అందుకని ఆయన్ని రంగులు మార్చే రంగా అనే బిరుదుతో ప్రజలు సత్కరించారు. మొదట స్వరాజ్యమనీ, తరువాత స్వతంత్రమనీ అరచిన నాయకులంతా చివరికి కాంగ్రెసనే సముద్రంలో నీటి బొట్టుల్లా, కాకి రెట్టల్లా కలిసి పోయారు. ధ్రువతారలని పేరుగాంచిన పెద్దలు ఉల్కల్లాగా రాలి పోయారు. తారలు రాలిపోతాయా అనేది నాకు ఇంకా సందేహంగానే ఉంది.

సెబాష్ మద్దెలగాడా అంటే, అయిదువేళ్ళు పగలకొట్టుకున్నట్లు, కొందరు సుబ్బారాయుళ్ళు డబ్బారాయుళ్ళ ఊదరకు దెబ్బతినిపోయారు. సవరదీసినకొద్దీ నిక్కినట్లు ఆరోజు ఎంత బ్రతిమిలాడి భంగపడినా బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇందిరా గాంధీకి ఇవ్వలేదు. చివరికి సిగ్గుమాలిన ముఖానికి నవ్వే అలంకారమన్నట్లు బ్రహ్మానందపడుతూ ఇందిరా కాంగ్రెసులోనే చేరిపోయారు. అసలు కాంగ్రెస్ లో రాణించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలని అమ్మ నిత్యమూ అంటుండేది. అందులో ప్రధానమైనది సిగ్గులేనితనమేనట. సొంత ఆలోచన లేక పోవటం కూడా మరొక అర్హత అని మురార్జీభాయ్ శలవిచ్చాడు. అయితే ఈ అర్హతలు కాంగ్రెస్ కే కాదు ఈ పార్టీకైనా వర్తిస్తాయి అని నాకు నిదానంగా తెలిసింది. ఇవాళ్ళ పాద పూజలు జరిపే జనం కాస్త ముందడుగులోనే ఉన్నారు.
హర్షుణ్ణి నమ్ముకుని పురుషుణ్ణి పోగొట్టుకున్నట్లు వెంగళరావుగారు ర్సును ఆవు దూడను నమ్ముకుని ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. ఇదే చాన్సనుకొన్న చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రై చక చకా తన తపనంతా తీర్చుకొన్నారు. శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ శానాళ్ళు బతకమ్మా అన్నట్లు ఆయన గారి హయామంతా తులాభారాలతో చందాలతో గడిచిపోయింది. అయితే రాష్ట్రానికి గండం గడవలేదు. ఉద్దండపిండాలనే పేరుతో ఉద్ధరించే మరో ముగ్గురినీ మార్చారు. వాళ్ళంతా కలిసి ఇదుగో ఈ యమధర్మరాజుకి అప్పజెప్పారు తెలుగు జనాన్ని.ఈయన సుప్రసిద్ధ నటులు గనుక మొదటినుండీ విటమిన్ సి కొరత  ఉండేది.

సంసారంలేనివారికి సరసాలెక్కువ అన్నట్లు మన యములవారు పదవినధిష్ఠించింది మొదలు పెదవులాడించటంతోనే పనులు జరుపుకొస్తున్నారు. పదిమందితో ఆయన ఆడుతున్న సరసాలు విరసాలు కావటం చివరికి కోర్టులపాలుగావటం నిత్యకృత్యంగా మారింది.

పదవిపోయిందని అలిగి నాదెండ్ల, చెన్నారెడ్డి వేరే పార్టీలు పెట్టి ఖాళీగా ఉంటున్నారు. వి. బి. రాజుకి పదవి ఇవ్వొద్దు, చెన్నారెడ్డిని ఖాళీగా ఉంచొద్దు అని వెనుక ఒక సామెత ఉండేది. అరిచే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండవ. అందుకే పాపం వీళ్ళు గూడా పనిదొరక్క లో లక్ష్మణా అంటున్నారు. శక్తిచాలనివాడు సాధుత్వము వహించినట్లు వీరు పాపం ఇంతకాలం గమ్మున ఉన్నారు కానీ మనసంతా అటే ఉంది.

అయితే సిగ్గుమాలినదాన్ని చిటికేస్తే, ఆరామడనుంచి ఆలకిచ్చిందట. ఈ మధ్య మూపనార్ అనే అరవాయన పార్టీ బయట నిలబడి కాల్ లెటర్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్న నిరుద్యోగులందరికీ ఆహ్వానం న్నాడు. చవానంతటోడే ఛలో అనగా లేనిది చెన్నారెడ్డికేమిటి అనుకున్నాడో ఎమోగాని తట్టాబుట్టా సర్దుకొని సంసిద్ధమయ్యాడు. మరి ఆయన్ని నమ్ముకొని ఏటిలో దిగినవారిని విడిచి వెళ్ళేవాడేనేమోగాని ఆయనలో కొంత విటమిన్ సి మిగిలి ఉండటంవల్ల ఆ పని చేయలేకపోయాడు. అందుకే అందరం కట్టగట్టుకుని కాంగ్రెస్లో దూకుదాం రండని తన సహచరులందరిని ఆహ్వానించాడు.ఇక ఇప్పుడు ఏనుగునెక్కి రంకుకు పోయినట్లుగా పోబోతున్నాడు. విటమిన్ సి కొరత దేశంలో విపరీతంగా ఉంది – అయితే విదేశాలనుండి దిగుమతి చేసుకొని యుద్ధ ప్రాతిపదికమీద మన  నాయకులందరికీ,ప్రముఖ ప్రజలందరికీ ఇవ్వాలని ఈ మధ్య ఒక సభలో రాజాకీయ సిగ్గరులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారని తెలిసి మహా సిగ్గు పడిపోయాను.



28, జులై 2012, శనివారం

మధ్య దళారుల మిధ్యావాదం మనకొద్దు


మధ్య దళారుల మిధ్యావాదం మనకొద్దు
                       
నేనేదో ఉబుసుపోక, గీటురాయి వాళ్ళదగ్గరికెళితే ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా పాఠకుల్ని ప్రత్యేకంగా ఉబుసుపుచ్చమన్నారు. మేయబోయి మెడకు తగిలించుకున్నట్లయింది నాపని. నా బుర్రకు తట్టింది, నాకు నచ్చింది ఏదైనా వ్రాయగలను గాని ఇలా కుర్చీలో కూర్చోబెట్టి, కాగితం కలం నాచేతికిచ్చి, ప్రవక్త గారి గురించి వ్రాస్తేగాని నిన్ను లేవనియ్యము అంటే ఎలా అని మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది.

పాఠక బాబుల్లారా ! మహాప్రవక్త ముహమ్మదు గారి జన్మదినాలు కొన్ని వందలసార్లు జరుపుకొన్నట్లు, కొంటున్నట్లు మనకు తెలుసు, రబ్బరు స్టాంపును ఎవరు కొట్టినా, ఎక్కడ కొట్టినా ఎన్ని సార్లు కొట్టినా ఒకటే ముద్రపడుతుంది అనేది జగమెరిగిన సత్యం. నొసనామాలు, నోట బండ బూతులు అన్నట్లుగా మనుషులు కేవలం వేషధారులై జీవించడాన్ని ప్రవక్తలు కోరుకోలేదు. ప్రతి ప్రవక్త నిజాయితీపరుడై కపటత్వాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు.

 ఇలాంటి జన్మ దినాలు రాగానే గంధము పూయారుగా, పన్నీటి గంధము పూయారుగా అని ఆ ప్రవక్తల మొఖాల మీద నాలుగు సుగంధ అభినందన సందేశాలు పారేసి, ఆ ప్రవక్తల అసలు సందేశాలను పాటించని జనాన్ని గురించే నాకు భయంగా ఉంది.
జన్మ దినం వచ్చిందని జెండాలెత్తితేసరా? గంధం తీస్తే గొప్పా? పీరులెత్తుకొని వీరావేశంతో నిప్పులు తొక్కటం ప్రవక్తల సందేశమా ? జనం ఇం పిచ్చివాళ్ళయ్యారేమిటి? అనిపిస్తుంది నాకు. నున్నని గుండు, మూరెడు పొడుగు గడ్డంతో అలరారే వ్యక్తి ఆకారం సదాచార సంపన్నుని తపింపజేయవచ్చు. కానీ ఆ వ్యక్తి నోరు నవ్వుతూ, నొసలు వెక్కిరించే టైపైతే ఏమిటి ఉపయోగం ?

ధైర్యం లేని ఆవేశం, తూటాలు లేని తుపాకి, ఆచరణ లేని ఆర్భాటం వ్యర్ధమే. అల్లా అల్లా అని అరిచే ప్రతి వాడూ పరలోకంలో ప్రవేశించడు. అల్లా చిత్తం ప్రకారం అమలు చేసే వాడే ప్రవేశిస్తాడు. అల్లా దగ్గరకు పోయి మధ్యవర్తిత్వం నెరపటానికి ముల్లాలకు అధికారం ఉందా ? ఎవరి రికమండేషన్ నా దగ్గర పారదు, నరుడా నేరుగా నన్నే ప్రార్ధించు, నా ఆజ్ఞలననుసరించు అని దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఆయన మధ్య దళారులను ఏర్పరచలేదు. చేతిలోని అన్నం చెరువులోకి విసిరి, చెయ్యి నాకి చెరువు నీళ్ళు త్రాగినట్లు మనుషులు ప్రవక్తలను, భక్తులనే విగ్రహాలుగా మలచుకొని పూజిస్తూ, సృష్టికరయైన దేవునికి దూరం అవుతున్నారు.

పంట పండించే రైతుకీ గిట్టుబాటు ధర రావడం లేదు. కొనే వినియోగదారుడికి ధర అందుబాటులో ఉండడం లేదు.  మధ్య దళారీలు మాత్రం యమ లాభాలు గుంజేస్తున్నారు. అలాగే మధ్యలో ఈ దళారీ దర్గాలున్నాయి. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. నిజమేనా ? అయితే ఎవరికి చెప్పుకోవాలి ? దళారీలకా ? పురోహితులకా ? ముల్లాలకా?
పాస్టర్లకా? పోపులకా ? ప్రవక్తలకా ? ఎవరికీ కాదు గాని దేవునికే ! పోపు చెవిలో పాపం చెబితే పోతుందా ? పాప ప్రాయశ్చిత్త పత్రం కొనుక్కుంటే పాపం పోతుందా? అసలు మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే కెపాసిటీ మహా ప్రవక్తకు కూడా లేదు. మనుషులు చేసే ప్రార్ధనలు విని నా దగ్గర  వారిని గురించి రికమెండ్ చేయమని మహా ప్రవక్తను దేవుడు నియమించలేదు. ప్రవక్త మీదకు దేవుని కరుణ రావాలని మాటి మాటికి దరూద్ పంపే పెద్ద మనుషులు ప్రవక్త చెప్పినట్లుగా నడుచుకోకపోతే ఫలం ఏమిటి ?

       కూడు వండేది గంజి కోసం కాదు, వండిన కూడు అవతల పారేసి కుండ నాకితే ప్రయోజనం ఏమిటి ? వేష భాషలోనూ ఆచార పరంపరలోను మహాశక్తి చూపే మనిషి, జీవితంలోని ఆన్ని రంగాలలో ఆదేరకం ఆసక్తిని కొనసాగించాలి. వట్టి కూర తింటే ఆకలి తీరుతుందా ? దేవుణ్ణి గురించి మనకు తెలియశక్యమైందేదో తెలిసింది. అదీ తన ప్రవక్తల ద్వారా, సృష్టి ద్వారా ఆయనే మనకు తెలియ పరిచాడు. ఆయన అదృశ్య లక్షణాలు ఆయన నిత్య శక్తి, దైవత్వము అనేవి జగదుత్పత్తి మొదలుకొని సృష్ఠించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట తెల్లమౌతున్నాయి. కానీ అక్షయుడైన  ఆ దేవుని మహిమను క్షయమైన మనుషులు, పక్షుల, జంతువుల ప్రతిమా స్వరూపంగా మనుషులు మార్చారు. వారు దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించి సేవించారు అని పౌలు భక్తుడు వాపోయాడు.

       అందుకని నేంజెప్పేదేమిటంటే, ముహమ్మదు ప్రవక్తగారి ప్రవర్తనను మనము అలవాటు చేసికోవాలి. ఆయన దర్గాలకు వెళ్లలేదు. దళారులనాశ్రయించలేదు. ఆర్ధిక, సాంఘిక, రాజకీయ, నైతి  రంగాలలో దేవుని నీతిని, దైవ చిత్తాన్ని ప్రతిష్టించారు. అలానే మనం కూడా ప్రవర్తిస్తే ఆయన జన్మదినాన్ని స్మరించుకోవటంలో సార్ధకత ఉంటుంది.ప్రవక్తలను,మహనీయులను గౌరవించండి.కానీ ఒకే దేవుడైన అల్లా (పరమేశ్వరుడు,యెహోవా) వైపు తిరిగి చిల్లర దేవుళ్ళను వదిలి వేయండి“అని  ఉబుసుపోక రీర్లందరికీ సవినయంగా మనవి చేస్తూ శలవు తీసుకుంటున్నాను ! 
            గీటురాయి  28-11-1986






18, జులై 2012, బుధవారం

ముద్దోచ్చేరాళ్ళు కూడా మూతి పళ్ళు రాలగొడ్తాయి !


ముద్దోచ్చేరాళ్ళుకూడా మూతి పళ్ళు రాలగొడ్తాయి !                          గీటురాయి 14-11-1986
అందమైన జీవితమూ  
అద్దాల సౌధము
చిన్న రాయి విసిరినా
చెదిరిపోవును
ఒక్క తప్పు చేసినా ముక్కలే
మిగులును అన్నాడు ఆత్రేయ .

 రాళ్ళు లోపల నుండి విసిరినా, బయటి నుండి విసిరినా అద్దాలు పగలక తప్పవు. రిజర్వేషన్ల అనుకూల, వ్యతిరేక ఉద్యమాలలో పగిలిన అద్దాలు (అద్దాల సౌధాలు కాదు కేవలం బస్సుల అద్దాలు) వేల సంఖ్యలో ఉన్నాయ. అద్దాలు పగలగొట్టుకొని శరవేగంతో దూసుకొచ్చిన రాళ్ళు అనేక అందమైన ముఖాలను సైతం చెదరగొట్టినట్లు ఆర్టీసీ వాళ్ళ ప్రకటన. మీ ముఖాలను కాపాడుకోండి అని మరోకచోట హెచ్చరిక.

ఏ నిమిషానికి ఏమి జరుగునో
ఎవరూహించెదరూ ?
విధి విధానమును తప్పించుటకు
ఎవరు సాహసించెదరూ ?


అని మరోకచోట నిట్టూర్పులు. పోలీసులు సైతం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, తమ ముఖాలను పరిరక్షించుకొనే ఏర్పాట్లలో మునిగిపోయినట్లు వినికిడి.

ఈ నల్లని రాళ్లలో
ఏ కన్నులు దాగెనో
ఈ బంల మాటున
ఏ గుండెలు మోగెనో
అని కొంతమంది వేదాంతులు ఉద్యమకారులు విసిరిన రాళ్ళను పట్టుకొని పరీక్షించి చూస్తూ పదాలు పాడారట.

రాళ్లకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు ఒక రాజకీయ నాయకుడు గట్టి ఉపన్యాసం ఇచ్చాడు. ఉద్యమాలలో విసరడానికేగాక, శంకుస్థాపనలు చెయ్యటానికి రాళ్ళు ఎంతో అవసరమని ఆయన వాదన. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని భావితరానికి పునాదిరాళ్ళు వీళ్ళేనని పొగిడాడు. కాదు కాదు పాత తరానికి సమాధిరాళ్ళు అని మరోకాయన మొరాయించాడు. పళ్ళు ఊడగొట్టుకోను ఏ రాయి అయితేనేమీ ? అంటారు గీటురాయి వాళ్ళు.

రాతి పశువును పూజిస్తారు. చేతి పశువును చెండుకుంటారు అని ఒక పూజారి గోల. రాని అప్పు రాతితో సమానం అని ఒక వడ్డీ వ్యాపారి వ్యధ. రాళ్ళ చేలో గుంట తోలటం వ్యర్ధమని రైతు సో. ఈ రాళ్ళ సంగతి విన్నవాళ్ళు బెల్లంకొట్టిన రాళ్ళలాగా అయిపోతున్నారేగాని తిరుగు సమాధానం ఇవ్వటం లేదు.

పలనాటి వాళ్ళు రాళ్ళు తిని రాళ్ళు ఏరిగే  రకం అన్నాడు శ్రీనాధుడు. ఎక్కడికెళ్ళినా రాయి లాంటి జొన్నన్నపు ముద్ద తినమని పడేసేవారట.

చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సర్పంబులును తేళ్ళు పళ్లనాటి సీమ పల్లెటూళ్ళు

అని విసుక్కున్నాడు గరళం మింగాని గర్వించకు ఈ రాయి లాంటి జొన్నన్నం  ముద్ద మింగు నీ పస తెలుస్తుంది అని శివయ్యను సవాలు చేస్తాడు. ఆయన కూడా ఆ సాహసం చేయలేదు. ఆ సవాలును ఎదుర్కొన లేదు.

ఈ మధ్య ఒక వింత వార్త వచ్చింది. సాయంత్రం మసకపడేప్పటికల్లా ఎక్కడి నుండో గులకరాళ్ళు లేచివచ్చి తమ పేటలో పడుతున్నాయని హైదరాబాద్ లోని మలకపేట నివాసులు పేపర్ల వాళ్ళకు చెప్పారు. మరో పేటలో వాళ్ళు బలంకొద్దీ పిచ్చిగా ఈ రాళ్ళు తమ పేటలోకి విసురుతున్నట్లు వారు చెప్పారు. వటపత్రశాయికి వరహాలలాలి... అని పిల్లల్ని బుజాన వేసుకొని బయట తిరుగుతూ నిద్రపుచ్చవలసిన తల్లులు ఈ రాళ్ళ వానకు భయపడి ఇళ్లలోనే ఉండి లాలి పాటలు పాడుకోవటం వల్ల పిల్లలు కూడా నిద్రపోవడం లేదని  వాపోయారు.

పొట్లకాయ వంకర పోవటానికి రాయి కడతారు. కుక్క తోక వంకర అని తెలిసి కూడా రాయి కడితే సరవుతుందా ? చిల్లర రాళ్ళకు మొక్కితే చిత్తం చెడిపోతుంది రా. ఒక్కడయిన ఆ పరమేశ్వరునికి మొక్కు బాగుపడతానని అతనెవరో గాని బండరాయిలాగా బోధించినా ఈ వంకర మనస్తత్వం గల వాళ్ళెవరూ వినలేదు .

శంఖులో పోస్తే తీర్థం, పెంకులో పోస్తే నీళ్ళు అన్నట్లు కొన్ని రాళ్ళు దేవుళ్ళవుతున్నాయి. కొన్ని రాళ్ళు రోళ్ళు మాత్రమే అవుతున్నాయి. రోకలి దెబ్బలు నిత్యమూ తినే రోలు, దేవుడైన రాయిని చూచి ఇలా అనుకుంటున్నది : -

రాయైతేనేమిరా దేవుడు ?
హాయిగా ఉంటాడు జీవుడు
ఉన్న చోటే గోపురం
ఉసురు లేని కాపురం
అన్నీ ఉన్న మహానుభావుడు !

దేవుడయిన రాయి రోలును చూచి ఇలా ఉంటున్నది ; -

నీ నే మేలుగదే రోలా
నా చుట్టూ ఉంది చూడు కాపలా
నా వంటి నిండా నలుగు,
ప్రతివాడూ నాపై అలుగు
మట్టి కంపు జైలు నుండి
నాకెప్పుడు కలుగు వెలుగు?




మన్ను పూజపై తిరగబడిన మానవసేవ

మన్ను పూజపై తిరగబడిన మానవసేవ
               గీటురాయి 21-11-1986
దేశమంటే మట్టా? మనుషులా ? అనే మీమాంస వచ్చిపడింది. దేశభక్తి మ తాతల ఆస్తి అని చెప్పుకునే ఒక జాతి జనం దేశమంటే మట్టేనని ఘం మోగించి చెబుతున్నారు. దేశమంటే మట్టి కాదు మనుషులు రా అని చెప్పిన గురజాడ గుడ్లు వెళ్లబెట్టి చూస్తున్నాడు.

ఈ మట్టిలోనే పుట్టాము. ఈ మట్టిలోనే పెరిగాము. ఈ మట్టిని మించిన దైవం మనకు వేరే లేదురా అని వాళ్ళు గట్టిగా పాటలు గూడా పాడుతున్నారు. నీ తల్లి నిన్ను నవమాసాలే మోసింది. కానీ ఈ తల్లి (భూమి) నిన్ను కడదాకా, నీ కట్టే కాలేదాకా మోస్తుంది రా అనే  చరణాలు అందుకొంటున్నారు.

మంత్ర జలం కంటే మంగలి జలమే మంచిదనే వాళ్ళు ఈ మట్టి భక్తులకు నచ్చటం లేదు. పైగా మట్టి కోసమే గట్టి పోరాటాలు జరుగుతున్నాయి. తెలుగు వీర లేవరా అని ఒకాయన అంటే తమిళ కత్తి పట్టరా అని మరోకాయన, మరాఠీ తట్ట ఎత్తరా అని ఇంకొకాయన వాదులాడుకొంటున్నారు. ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన దొంగవాడు అని మన మట్టి మీదే ఎల్లలు గీచుకున్నారు.

ఆ మధ్య ఒక మహానుభావుడి చిరునామా అడిగితే నేను ప్రపంచ పౌరుణ్ణి, ప్రపంచమే నా దేశం న్నాట. అంతే, అతన్ని పెద్ద దురాక్రమణ దారుడిగా లెక్కగట్టి అలతనికి దేభక్తే లేదు పొమ్మన్నారు మన మట్టి పూజారులు. అతని వాదం ఏమిటంటే నేనివ్వాళ్ళ ఇక్కడున్నాను. రేపు పరలోకంలో ఉంటాను. అప్పుడు అదే నా దేశం. ఈ లోకం కేవలం ఒక మజిలీ మాత్రమే. ఇక్కడ నా చిరునామా తాత్కాలికమేగదా! అని.  

ఎడారి నేలను పట్టుకొని పాలు తేనెలు ప్రవహించే దేశమని, నీళ్ళు అందక పంటలు ఎండిపోతుంటే సస్యశ్యామలమనీ కీర్తించే వాళ్ళకు వాస్తవ దృక్పధం లోపించింది అనుకోవచ్చు. కానీ పక్క దేశాలలోని భూమిగూడా తమదేనని పాడుకొనే అఖండవాదులను విశ్వజనీన హృదయం గలవాళ్ళు ఎలా నోళ్ళు మూయించగలరు ? వాళ్ళ ధోరణి గిట్టనివాళ్ళు మరగుజ్జు మహావృక్షమెక్కి అరచినా మరగుజ్జుగానే ఉంటాడని అంటారు. పొట్టివాడి నెత్తి పొడుగువాడు గొడితే, పొడుగు వాడి నెత్తి దేవుడు కొట్టడా అని తిట్టి పోస్తు న్నారు.

ట్టికి మొక్కేదా మల్లయ్యా ? అంటే మరి ఎవరికి మొక్కుతావు చెల్లయ్యా ! అంటూ సుప్రీం కోర్టులో ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ మధ్య దేవుడికి తప్ప మరి దేనికీ మొక్కేదిలేదని కొందరు పిల్లకాయలు మొండికేశారు. పిల్లల్లారా, ఈ గీతంలో మీరు మన భూమిని ఆరాధిస్తున్నారు. భూమి పూజ చేయటంలో తప్పు లేదు. గొప్ప గొప్ప
నాయకులే ఈ పని చేస్తున్నారు మీకేం వచ్చింది పొయ్యేకాలం? అన్నా  ఆ గడుగ్గాయలు వినలేదు.ఆ పాటకు మా నోళ్ళు తెరవమంటే తెరవమని మొసలిపట్టు పట్టారు. చివరికి ఎలాగో సుప్రీంకోర్టోళ్ళు బర్రెను కుడితి  తొట్టి దగ్గరకు తీసికెళ్లగలంగాని దానిచేత త్రాగించలేము గదా అని మట్టి భక్తులకు సర్ది చెప్పారు. పిల్లలు అందరితోపాటు గౌరవంగా లేచి నిలబడ్డారు. అంతే చాలు, బలవంతంగా వాళ్ళ నోళ్ళు తెరిపించడం, తర్వాత పాడించటం మన రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను (అంటే నోరు తెరవటానికి గాని, మూయటానికి గాని భారతీయుని కివ్వబడిన స్వేచ్ఛను) హరించటమేనని తీర్పు చెప్పారు.

       ఇప్పుడు నోళ్ళు తెరవటం పాలకుల పని అయింది. మట్టి భక్తులనోట మట్టిగొట్టినట్టయ్యింది. తూ.. తూ అని ఊశారు. మట్టి పూజకు పార్లమెంటులో పాడెగడదామని,పట్టం డదామని (చట్టం చేద్దామని) నిశ్చయించుకున్నారు.

       ఇది ఇలా ఉంటే వారియర్ అనే యోధుడు చేతులుమడిచి పైకి లేచాడు. వంటికిట్టిన మట్టి దులిపి మరీ అడిగాడు. బెంగాలోడు రాసిన వంగగీతం దేశమంతా పాడారు . అసలందులో దేశాన్ని గురించికాక దేశాన్ని ఏలేవాడిని గురించి ఉంది. దేశం కలకాలం ఉంటుంది కాని ఏలేవాడు ఎల్లకాలం ఉండదు. అందులో వర్ణించిన (కొన్ని) భూభాగాలు కూడా మన దేశంలో లేవు. గీతం ఉందంటే దేవభాషలోనే ఉండాలి అని దుమ్ముదులుపుతున్నాడు. తన దగ్గర చదువుకునే పిల్లలు ఆ గీతం పాడకుండా నోళ్ళు మూయించాడు.

       మచ్చాలు తినే నోటికి సొచ్చాలు ఎట్లా వస్తవి ? అని ఆయన ప్రశ్నిస్తుంటే పాలకులు మట్టి దిన్న పాముల్లాగా ఉంటున్నారు. మంత్రసాని పని ఒప్పుకున్నాక ఏది వచ్చినా పట్టాలి!అని సుప్రీంకోర్టును ఆడిపోసుకుంటున్నారు. ఈ గడ్డ మీదనే కరువొచ్చి మట్టి తింటున్న వాళ్ళకు మాత్రం ఈ మన్ను పూజ పోరాటం గురించి ఏమీ తెలియదు. బెల్లం ఉంని మోచేతి దాకా నాకితే, మోచేతి దాకా మట్టి మాత్రమే తగిలినట్లుంది పరిస్థితి.

       దేశమా! నీవు మట్టివే అయితే నీపైన నివసించే ఈ మనుషులెవరు ? నేను ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి ?” అని ఒక పిచ్చివాడు తల చించుకొంటున్నాడు. ఒక నాయకుడు మాత్రం ఓట్ల కోసం మట్టిని అర్ధించకుండా నేరుగా మనుషుల దగ్గరకు వస్తున్నాడు. అతనికి తెలుసు దేశమంటే ఏమిటో!