17, జులై 2012, మంగళవారం

కైలాసానికి కడతేర్చే ఖాకీ దేవుళ్ళు


కైలాసానికి కతేర్చే ఖాకీ దేవుళ్ళు                                            గీటురాయి 10-10-1986

ఆర్తులకు బాధాతప్త
హృదయులకు
పోలీసు స్టేషనే చక్కని
ఆశ్రయం
ఖాకీ దుస్తులలో
ఉన్న పోలీసే
సామాన్యుడికి భగవంతుని అవతారం

అని అన్నగారు సెప్టెంబరు 27 న పోలీసు డ్యూటీ మీట్ లో  ఆశు కవిత్వం అందుకున్నారు. కానీ ఒక్క సెప్టెంబరు నెలలోనే ఖాకీలు చేసిన ఖూనీలు అయిదారు వెలుగులోకి వచ్చాయి. ప్రజలు ఈ లాకప్ మరణాల పట్ల ఆందోళన చెందుతున్న సందర్భంలోనే ఆయన పోలీసులే మోక్షమిచ్చే ప్రత్యక్ష దైవాలని పొగడటం గమనార్హం. ఉపాధ్యాయుల దినోత్సవం రోజు గురు దేవో మహేశ్వర అని వాళ్ళనూ పొగిడాడు. టీచరు మహేశ్వరుడు పోలీసు పరమేశ్వరుడు ఇద్దరూ మోక్షానిచ్చేవాళ్ళేనని ఆయన భావన కాబోలు ! ఈయన నిర్వచనం ప్రకారం ప్రాణాలు తోడేసే వాళ్ళను పరమేశ్వరులనుకోవచ్చు. ఈ జాబితాలోకి ఆయన డాక్టర్లను ఎందుకు చేర్చలేదో అంతుబట్టకుండా ఉంది !

పోలీసులు మోక్షాన్ని ప్రసాదించినా శరీరం సమాధిలోనే ఉండాలి గదా చూడండి అని త్రవ్వి చూస్తే దేహం దానిలో కనబడలేదట. ఏమిటీ చోద్యం అని అడిగితే దానినే బొందితో కైలాసం అంటారని చెప్పారట ! ఒకతను పోలీసుస్టేన్ లో చనిపోయాడు. చూడటానికి వచ్చిన వాళ్ళకు మృతుడి దేహం మీద ఒక్క దెబ్బ గుర్తు గానీ, గాయం గానీ కానరాలేదు. పోస్టుమార్టంలో తేలిందేమంటే అతను మూగదెబ్బలు తగలటం వల్ల చనిపోయాడ. పైకి కానరాకుండా పోలీసులు కొట్టే మూగ దెబ్బలకు గురజాడ వారిచ్చిన పేరు న్మద బాణాలు పోలీస్ పరిభాషలో గుండె ఆగి చనిపోవటం.

పోకిరికి పోలీసు, చదువురాని వాడికి సర్వేయర్ పని అప్పజెప్పినట్లుగా ఉంది మన పరిపాలనా వ్యవస్థ. ప్రజా రక్షకులు ప్రజా భక్షకులుగా, అమాయకుల పట్ల యముల్లాగా మారారు. నేరస్తుల్ని పట్టుకొని న్యాయస్థానానికి అప్పజెప్పవలసిన పోలీసులు రోజుల తరబడి నేరస్థుల ప్రాణాలతో ఆడుకొంటున్నారు. పోలీస్ స్టేషన్లు మానభంగ కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి. స్టేన్ కు తెచ్చి చంపి ఎక్కడో పడేసి ఎదురు కాల్పుల్లో చనిపోయానటం అందరికీ తెలిసిందే. పోలీసుల్లో ఈ నేరప్రవృత్తికి కారణం ఏమిటి ? ఎందుకు వారు అలా పవర్తిస్తున్నారు అనేది ఆలోచించాలి.

దీనికంతటికి కారణం అవినీతి.రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం పోలీస్ అధికారులను వాడుకోవటం, పోలీస్ అధికారులు నాయకులకు తాబేదార్లుగా మారి పోలీసుల చేత అడ్డమైన అవినీతి పనులూ చేయించడం ఘనమై నేరస్తులు పోలీసులను అపహసిస్తూ విడుదల కావటం, పలుకుబడి గల నేరస్తులను పట్టుకున్న పోలీసులకు తిట్లు శిక్షలు అవరోహణ కావటం,దీనంతటి పర్యవసానంగా పోలీసుల్లో కసి పెరిగి దానిని అనామకులపై తీర్చుకొని ఆనందిస్తూ ఉంటం. ఒక విషవలయంలాగా జరుగుతూ ఉండి. స్టూవర్ట్ పురం దొంగలు కొందరు క్రైస్తవ భక్తులుగా మారి దొంగతనం మానుకుంటే వారిని తన్ని మళ్ళీ దొంగతనంలో దించి మామూళ్ళు వసూలు చేసుకుంటున్న ఘనత పోలీస్ అధికారులదేనని ఓ ప్రముఖ దినపత్రిక నిదర్శనాలతో సహా నిరూపిస్తే దాని మీద ఎలాంటి ప్రతిస్పందన ప్రభుత్వం నుండి రాలేదు. ఇది పైనుండి క్రిందికి పారుతున్న అవినీతి ప్రవాహం ! సామాన్యుల  ప్రాణాలు తీసే విషపు జలపాతం ! అక్రమార్జన, భోగలాలసత్వం కొనసాగాలనుకొనే నాయకుల అధికారుల పక్షపాతం !


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి