కులాల గోడూ వద్దు రిజర్వేషన్ల రగడా వద్దు
గీటురాయి 5-9-1986
“ ఏ కులమని నను వివరమడిగితే
ఏమని చెప్పుదు లోకులకు, పాలుగాకులకు
దుర్మార్గులకు ఈ దుష్టులకు
అండ పిండ బ్రహ్మాండమంతయు
నిండి యున్న ఆ ఏకేశ్వరునిదే నా కులము “
--- అని దూదేకుల సిద్దయ్య (సిద్దీఖ్) ఎంత చెప్పినా, నచ్చ చెప్పినా కులపిచ్చి గాళ్ళు అతన్ని మనఃపూర్తిగా తమలో కలుపుకోలేదు. అందుకనే చివరికి విరక్తి చెంది,
కులమేది కులమేదియని
ఆరాలు తీయుచు దయ్యాలవోలె
గోలచేయు వారందరిని బట్టికొని
తయ్యకు తాధిమి ధిమి ధిమి
ధిమియని ఏకే కూలమే నా కులము “ అన్నాడు.
ఇంటిలో నుండి పొమ్మని చెప్పనక్కర లేదు మిరపకాయల కోరు పెడితే సరి అన్నట్లు తక్కువ కులం వాడినని ఎక్కిరిస్తే వాడే వెళ్లిపోతాడులే అనుకున్నారు. ఎక్కిరించినవాళ్లు విశ్వ బ్రాహ్మలు, వీళ్ళని అసలు నికార్సయిన బ్రాహ్మలు ఎక్కిరించారు. వీళ్ళందర్నీ కలిపి నాయీ బ్రాహ్మలు ఎక్కిరించారు. ఎందుకంటే వాళ్లూ వీళ్ళని తేడా లేకుండా అందరికీ శిరో ముండనం చేసేది వాళ్లేనట.‘కులం, తక్కువ వాడు కూటికి ముందు‘ అని (తక్కువ కులాల వాళ్ళను గురించి) ‘గొంతుదాకా తిని కులమడిగినట్లు‘ అని (ఎక్కువ కులాలవాళ్లను గురించి ) సామెతలు కూడా పుట్టాయి.“ కులానికింత అంటే, తలా గోరంత “ అన్నట్లు ఈ కుల పిచ్చి ఎంతో ఘోరంగా వ్యాపించింది.మనిషిని మనిషిగా చూడక ఏ కులం వాడో తెలిసికొన్న తరువాతనే మర్యాద ఇచ్చే సంప్రదాయం బాగా ముదిరింది. మన తెలుగు రాముడు చేస్తున్నన పనులు కుళ్ళుబోతు వాళ్ళముందు కులికినట్లుగా ఉన్నాయి.
‘ఓరీ రజక చక్రవర్తి ! అంటే ఇంత పెద్ద పేరు మాకెందుకు దొరా ? మీకే ఉండనివ్వండి’ అని చాకలి వాళ్ళంతాబడి చీఫ్ మినిస్టర్ చుట్టూ తిరిగి ఎట్లయితే చివరికి వాళ్ళను షెడ్యూల్డ్ కులాల్లో చేర్చాలని పైన (ప్రైమ్ ) మినిస్టర్ కు సిఫారసు చేయించారు. అయితే ఆయన వీళ్ళ సమస్యను నమలక మింగక నాన వేస్తున్నాడు.
ఇటీవలనే కూటికి పేదలయిన బ్రాహ్మలంతా కలిసి తమను కూడా షెడ్యూల్డు కులాల్లో చేర్చాలని ముక్తకంఠంతో కోరినట్లు ఒకవార్త. ఈ రకంగా వీళ్ళంతా షెడ్యూల్డ్ కులాల్లో చేరటానికి కారణం ఏమిటని ఆలోచిస్తే అది షెడ్యూల్డ్ కులాల మీద పుట్టుకొచ్చిన ప్రేమ కాదని కేవలం రిజర్వేషన్ సదుపాయాన్ని పిండటానికేననీ కులానికి పేదైన ఒకాయన చెప్పాడు.
రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవాళ్ళు బస్సులను హైజాక్ చేస్తున్నా, అద్దాలు పగలగొడ్తున్నా, పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకోవటం ఒక వింత. లాకప్ కర్తలైన పోలీసులేనా వీళ్ళు అని ఆశ్చర్య పోతున్నారు జనం. లాఠీ చార్జి చేయటానికి, లాకప్ లో పెట్టి తన్నటానికి వాళ్ళు వెనుకబడిన కులాల వాళ్ళు కాదు కదా అని మరొకతను చెప్పాడు.
చూడగా చూడగా ఇదంతా పెద్ద విషవలయం లాగా అనిపించింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నాకు గట్టి నమ్మకం, ఎందుకంటే సమస్య ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే పరిష్కారం ఎలా చెయ్యాలో గూడా తెలుస్తుందని ప్రేమయ్య మాస్టారు నాకు నాల్గో తరగతిలోనే చెప్పాడు కులాలనేవి ఉండటం వల్లనే గదా రిజర్వేషన్లు వచ్చింది. ఆ కులాలనే రద్దు చేస్తే రిజర్వేషన్ల అవసరం ఉండదు గదా అని ఒక సంపాదకుని ముందు సందేహం వెలిబుచ్చాను. ఆయన వాదం ఏమిటంటే “ కుల వ్యవస్థ ఉండాలి, కులతత్వం పోవాలి, రిజర్వేషన్లను ఎత్తి వేయాలి “ ఇది నాకు అసలు అర్ధమే కాలేదు, “ కులాలుండాలి, రిజర్వేషన్లు పోవాలి.” కులాలు ఎందుకుండాలి?అని అడిగాను. ఎవరి పని వారే చేయటానికి, అందరూ ఎక్కేవాళ్ళయితే పల్లకి మోసేదేవరు ? అన్నాడాయన.
ఇద్దరూ చెరికాసేపు మోయవచ్చు గదా ? అంటే అలాకాదు మోసేవాడు మొయ్యాలి, ఎక్కేవాడు ఎక్కాలి అన్నాడు. మీకు సోషలిజం మీద నమ్మకముందా అంటే సోషలిజమంత చండాలపు వ్యవస్థ రెండోది లేదన్నాడు. మరే వ్యవస్థ మంచిదీ అంటే నిస్సందేహంగా కుల వ్యవస్థే అన్నాడు. ఇప్పుడు నాకు సమస్య మరింత అర్ధమయ్యింది.
రిజర్వేషన్లు ఎత్తివేయాలని కోరేవాళ్ళు కులాలను కూడా ఎత్తివేయమని అడగాలి. అలా ఎందుకు అడగటం లేదు ? “ అన్ని కులాల్లోనూ పేదవాళ్ళున్నారు “ అంటున్నారు మరి ఈ పేదవాళ్ళంతా కుల విచక్షణ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోరు ఎందుకని ? ‘కూటికి పేదనుగాని కులానికి పేదనుకాదు’ అని అహంకారం చూపిస్తారెందుకు?
చెంబు ఎక్కడ పెట్టి మర్చిపోయ్యావురా ? అంటే చెంబట్లకు కూర్చున్న చోటికి ఇటు అన్నాడు.చెంబట్లకు ఎక్కడ కూర్చున్నావురా ? అంటే చెంబు పెట్టిన చోటికి అటు అన్నాడట.ఈ రకంగా ఆగ్ర కులాల వాళ్ళు అటూ ఇటూ కానీ సమాధానాలు ఇస్తూ గందరగోళం చేస్తున్నారు.
రిజర్వేషన్ లకు పేదతనమే ప్రాతిపదికగా ఉండాలనుకుంటే సమస్త కులాలను నిషేధించాలి. కుల వ్యవస్థ ఉండాలనుకుంటే కులం ప్రాతిపదికగా రిజర్వేషన్లూ ఉండాలి. ఏదో ఒకటి ఎన్నుకొని మిన్నకుండటం పోయి ఆందోళనకు దిగటం అర్ధరహితం. అన్న చేసిన పని ఆయనకందుబాటులో ఉన్నంత వరకు బాగానే ఉందనిపించింది నా మట్టుకు. రాజీవుడు కూడా అన్నను అనుసరించాలి. లేదా కులాలన్నిటినీ రద్దు చేసి కులాంతర వివాహాలు చేసుకొన్న వారికే రిజర్వేషన్ లు పరిమితం చెయ్యాలి. నాకు తోచినంత వరకు ఇదే పరిష్కారం ! అవ్వా కావాలి బువ్వా కావాలి అనే అత్యాశ దేశ ఆరోగ్యానికి మంచిది కాదు. అదీ ఇదీ కాకపోతే సాంఘిక స్థానం కావాలనుకునే షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి మిగిలిన మార్గం ఒకటే వారు కుల వ్యవస్థ లేని సువ్యవస్థకై అన్వేషించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి