28, జులై 2012, శనివారం

మధ్య దళారుల మిధ్యావాదం మనకొద్దు


మధ్య దళారుల మిధ్యావాదం మనకొద్దు
                       
నేనేదో ఉబుసుపోక, గీటురాయి వాళ్ళదగ్గరికెళితే ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా పాఠకుల్ని ప్రత్యేకంగా ఉబుసుపుచ్చమన్నారు. మేయబోయి మెడకు తగిలించుకున్నట్లయింది నాపని. నా బుర్రకు తట్టింది, నాకు నచ్చింది ఏదైనా వ్రాయగలను గాని ఇలా కుర్చీలో కూర్చోబెట్టి, కాగితం కలం నాచేతికిచ్చి, ప్రవక్త గారి గురించి వ్రాస్తేగాని నిన్ను లేవనియ్యము అంటే ఎలా అని మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది.

పాఠక బాబుల్లారా ! మహాప్రవక్త ముహమ్మదు గారి జన్మదినాలు కొన్ని వందలసార్లు జరుపుకొన్నట్లు, కొంటున్నట్లు మనకు తెలుసు, రబ్బరు స్టాంపును ఎవరు కొట్టినా, ఎక్కడ కొట్టినా ఎన్ని సార్లు కొట్టినా ఒకటే ముద్రపడుతుంది అనేది జగమెరిగిన సత్యం. నొసనామాలు, నోట బండ బూతులు అన్నట్లుగా మనుషులు కేవలం వేషధారులై జీవించడాన్ని ప్రవక్తలు కోరుకోలేదు. ప్రతి ప్రవక్త నిజాయితీపరుడై కపటత్వాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు.

 ఇలాంటి జన్మ దినాలు రాగానే గంధము పూయారుగా, పన్నీటి గంధము పూయారుగా అని ఆ ప్రవక్తల మొఖాల మీద నాలుగు సుగంధ అభినందన సందేశాలు పారేసి, ఆ ప్రవక్తల అసలు సందేశాలను పాటించని జనాన్ని గురించే నాకు భయంగా ఉంది.
జన్మ దినం వచ్చిందని జెండాలెత్తితేసరా? గంధం తీస్తే గొప్పా? పీరులెత్తుకొని వీరావేశంతో నిప్పులు తొక్కటం ప్రవక్తల సందేశమా ? జనం ఇం పిచ్చివాళ్ళయ్యారేమిటి? అనిపిస్తుంది నాకు. నున్నని గుండు, మూరెడు పొడుగు గడ్డంతో అలరారే వ్యక్తి ఆకారం సదాచార సంపన్నుని తపింపజేయవచ్చు. కానీ ఆ వ్యక్తి నోరు నవ్వుతూ, నొసలు వెక్కిరించే టైపైతే ఏమిటి ఉపయోగం ?

ధైర్యం లేని ఆవేశం, తూటాలు లేని తుపాకి, ఆచరణ లేని ఆర్భాటం వ్యర్ధమే. అల్లా అల్లా అని అరిచే ప్రతి వాడూ పరలోకంలో ప్రవేశించడు. అల్లా చిత్తం ప్రకారం అమలు చేసే వాడే ప్రవేశిస్తాడు. అల్లా దగ్గరకు పోయి మధ్యవర్తిత్వం నెరపటానికి ముల్లాలకు అధికారం ఉందా ? ఎవరి రికమండేషన్ నా దగ్గర పారదు, నరుడా నేరుగా నన్నే ప్రార్ధించు, నా ఆజ్ఞలననుసరించు అని దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఆయన మధ్య దళారులను ఏర్పరచలేదు. చేతిలోని అన్నం చెరువులోకి విసిరి, చెయ్యి నాకి చెరువు నీళ్ళు త్రాగినట్లు మనుషులు ప్రవక్తలను, భక్తులనే విగ్రహాలుగా మలచుకొని పూజిస్తూ, సృష్టికరయైన దేవునికి దూరం అవుతున్నారు.

పంట పండించే రైతుకీ గిట్టుబాటు ధర రావడం లేదు. కొనే వినియోగదారుడికి ధర అందుబాటులో ఉండడం లేదు.  మధ్య దళారీలు మాత్రం యమ లాభాలు గుంజేస్తున్నారు. అలాగే మధ్యలో ఈ దళారీ దర్గాలున్నాయి. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. నిజమేనా ? అయితే ఎవరికి చెప్పుకోవాలి ? దళారీలకా ? పురోహితులకా ? ముల్లాలకా?
పాస్టర్లకా? పోపులకా ? ప్రవక్తలకా ? ఎవరికీ కాదు గాని దేవునికే ! పోపు చెవిలో పాపం చెబితే పోతుందా ? పాప ప్రాయశ్చిత్త పత్రం కొనుక్కుంటే పాపం పోతుందా? అసలు మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే కెపాసిటీ మహా ప్రవక్తకు కూడా లేదు. మనుషులు చేసే ప్రార్ధనలు విని నా దగ్గర  వారిని గురించి రికమెండ్ చేయమని మహా ప్రవక్తను దేవుడు నియమించలేదు. ప్రవక్త మీదకు దేవుని కరుణ రావాలని మాటి మాటికి దరూద్ పంపే పెద్ద మనుషులు ప్రవక్త చెప్పినట్లుగా నడుచుకోకపోతే ఫలం ఏమిటి ?

       కూడు వండేది గంజి కోసం కాదు, వండిన కూడు అవతల పారేసి కుండ నాకితే ప్రయోజనం ఏమిటి ? వేష భాషలోనూ ఆచార పరంపరలోను మహాశక్తి చూపే మనిషి, జీవితంలోని ఆన్ని రంగాలలో ఆదేరకం ఆసక్తిని కొనసాగించాలి. వట్టి కూర తింటే ఆకలి తీరుతుందా ? దేవుణ్ణి గురించి మనకు తెలియశక్యమైందేదో తెలిసింది. అదీ తన ప్రవక్తల ద్వారా, సృష్టి ద్వారా ఆయనే మనకు తెలియ పరిచాడు. ఆయన అదృశ్య లక్షణాలు ఆయన నిత్య శక్తి, దైవత్వము అనేవి జగదుత్పత్తి మొదలుకొని సృష్ఠించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట తెల్లమౌతున్నాయి. కానీ అక్షయుడైన  ఆ దేవుని మహిమను క్షయమైన మనుషులు, పక్షుల, జంతువుల ప్రతిమా స్వరూపంగా మనుషులు మార్చారు. వారు దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించి సేవించారు అని పౌలు భక్తుడు వాపోయాడు.

       అందుకని నేంజెప్పేదేమిటంటే, ముహమ్మదు ప్రవక్తగారి ప్రవర్తనను మనము అలవాటు చేసికోవాలి. ఆయన దర్గాలకు వెళ్లలేదు. దళారులనాశ్రయించలేదు. ఆర్ధిక, సాంఘిక, రాజకీయ, నైతి  రంగాలలో దేవుని నీతిని, దైవ చిత్తాన్ని ప్రతిష్టించారు. అలానే మనం కూడా ప్రవర్తిస్తే ఆయన జన్మదినాన్ని స్మరించుకోవటంలో సార్ధకత ఉంటుంది.ప్రవక్తలను,మహనీయులను గౌరవించండి.కానీ ఒకే దేవుడైన అల్లా (పరమేశ్వరుడు,యెహోవా) వైపు తిరిగి చిల్లర దేవుళ్ళను వదిలి వేయండి“అని  ఉబుసుపోక రీర్లందరికీ సవినయంగా మనవి చేస్తూ శలవు తీసుకుంటున్నాను ! 
            గీటురాయి  28-11-1986






1 కామెంట్‌: