ముద్దోచ్చేరాళ్ళుకూడా మూతి పళ్ళు రాలగొడ్తాయి ! గీటురాయి 14-11-1986
“అందమైన జీవితమూ
అద్దాల సౌధము
చిన్న రాయి విసిరినా
చెదిరిపోవును
ఒక్క తప్పు చేసినా ముక్కలే
మిగులును “ అన్నాడు ఆత్రేయ .
రాళ్ళు లోపల నుండి విసిరినా, బయటి నుండి విసిరినా అద్దాలు పగలక తప్పవు. రిజర్వేషన్ల అనుకూల, వ్యతిరేక ఉద్యమాలలో పగిలిన అద్దాలు (అద్దాల సౌధాలు కాదు కేవలం బస్సుల అద్దాలు) వేల సంఖ్యలో ఉన్నాయట. అద్దాలు పగలగొట్టుకొని శరవేగంతో దూసుకొచ్చిన రాళ్ళు అనేక అందమైన ముఖాలను సైతం చెదరగొట్టినట్లు ఆర్టీసీ వాళ్ళ ప్రకటన. మీ ముఖాలను కాపాడుకోండి అని మరోకచోట హెచ్చరిక.
ఏ నిమిషానికి ఏమి జరుగునో
ఎవరూహించెదరూ ?
విధి విధానమును తప్పించుటకు
ఎవరు సాహసించెదరూ ?
అని మరోకచోట నిట్టూర్పులు. పోలీసులు సైతం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, తమ ముఖాలను పరిరక్షించుకొనే ఏర్పాట్లలో మునిగిపోయినట్లు వినికిడి.
ఈ నల్లని రాళ్లలో
ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున
ఏ గుండెలు మోగెనో
అని కొంతమంది వేదాంతులు ఉద్యమకారులు విసిరిన రాళ్ళను పట్టుకొని పరీక్షించి చూస్తూ పదాలు పాడారట.
రాళ్లకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు ఒక రాజకీయ నాయకుడు గట్టి ఉపన్యాసం ఇచ్చాడు. ఉద్యమాలలో విసరడానికేగాక, శంకుస్థాపనలు చెయ్యటానికి రాళ్ళు ఎంతో అవసరమని ఆయన వాదన. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని భావితరానికి పునాదిరాళ్ళు వీళ్ళేనని పొగిడాడు. కాదు కాదు పాత తరానికి సమాధిరాళ్ళు అని మరోకాయన మొరాయించాడు. పళ్ళు ఊడగొట్టుకోను ఏ రాయి అయితేనేమీ ? అంటారు గీటురాయి వాళ్ళు.
రాతి పశువును పూజిస్తారు. చేతి పశువును చెండుకుంటారు అని ఒక పూజారి గోల. రాని అప్పు రాతితో సమానం అని ఒక వడ్డీ వ్యాపారి వ్యధ. రాళ్ళ చేలో గుంటక తోలటం వ్యర్ధమని రైతు సోప. ఈ రాళ్ళ సంగతి విన్నవాళ్ళు బెల్లంకొట్టిన రాళ్ళలాగా అయిపోతున్నారేగాని తిరుగు సమాధానం ఇవ్వటం లేదు.
పలనాటి వాళ్ళు రాళ్ళు తిని రాళ్ళు ఏరిగే రకం అన్నాడు శ్రీనాధుడు. ఎక్కడికెళ్ళినా రాయి లాంటి జొన్నన్నపు ముద్ద తినమని పడేసేవారట.
“ చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సర్పంబులును తేళ్ళు పళ్లనాటి సీమ పల్లెటూళ్ళు “
అని విసుక్కున్నాడు “గరళం మింగానని గర్వించకు ఈ రాయి లాంటి జొన్నన్నం ముద్ద మింగు నీ పస తెలుస్తుంది” అని శివయ్యను సవాలు చేస్తాడు. ఆయన కూడా ఆ సాహసం చేయలేదు. ఆ సవాలును ఎదుర్కొన లేదు.
ఈ మధ్య ఒక వింత వార్త వచ్చింది. సాయంత్రం మసకపడేటప్పటికల్లా ఎక్కడి నుండో గులకరాళ్ళు లేచివచ్చి తమ పేటలో పడుతున్నాయని హైదరాబాద్ లోని మలకపేట నివాసులు పేపర్ల వాళ్ళకు చెప్పారు. మరో పేటలో వాళ్ళు బలంకొద్దీ పిచ్చిగా ఈ రాళ్ళు తమ పేటలోకి విసురుతున్నట్లు వారు చెప్పారు. వటపత్రశాయికి వరహాలలాలి... అని పిల్లల్ని బుజాన వేసుకొని బయట తిరుగుతూ నిద్రపుచ్చవలసిన తల్లులు ఈ రాళ్ళ వానకు భయపడి ఇళ్లలోనే ఉండి లాలి పాటలు పాడుకోవటం వల్ల పిల్లలు కూడా నిద్రపోవడం లేదని వాపోయారు.
పొట్లకాయ వంకర పోవటానికి రాయి కడతారు. “ కుక్క తోక వంకర “ అని తెలిసి కూడా రాయి కడితే సరవుతుందా ? చిల్లర రాళ్ళకు మొక్కితే చిత్తం చెడిపోతుంది రా. “ ఒక్కడయిన” ఆ పరమేశ్వరునికి మొక్కు బాగుపడతానని అతనెవరో గాని బండరాయిలాగా బోధించినా ఈ వంకర మనస్తత్వం గల వాళ్ళెవరూ వినలేదు .
శంఖులో పోస్తే తీర్థం, పెంకులో పోస్తే నీళ్ళు అన్నట్లు కొన్ని రాళ్ళు దేవుళ్ళవుతున్నాయి. కొన్ని రాళ్ళు రోళ్ళు మాత్రమే అవుతున్నాయి. రోకలి దెబ్బలు నిత్యమూ తినే రోలు, దేవుడైన రాయిని చూచి ఇలా అనుకుంటున్నది : -
రాయైతేనేమిరా దేవుడు ?
హాయిగా ఉంటాడు జీవుడు
ఉన్న చోటే గోపురం
ఉసురు లేని కాపురం
అన్నీ ఉన్న మహానుభావుడు !
దేవుడయిన రాయి రోలును చూచి ఇలా ఉంటున్నది ; -
నీ పనే మేలుగదే రోలా
నా చుట్టూ ఉంది చూడు కాపలా
నా వంటి నిండా నలుగు,
ప్రతివాడూ నాపై అలుగు
మట్టి కంపు జైలు నుండి
నాకెప్పుడు కలుగు వెలుగు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి