4, జులై 2012, బుధవారం

సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్ !


సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్ !
                                                      గీటురాయి 1-8-1986
                  ఇంటి పేరు క్షీర సాగరం వారు, ఇంటో మజ్జిగ చుక్కకు గతి లేదు అన్నట్లు సెయింట్ల కాన్వెంట్లలో చదువు మహా డాబుసరి వ్యవహారంగా   తయారయ్యింది. ఇంటి కూడు తిని .... ఎవరి వెంటో పడినట్లుగా  కాన్వెంట్ల       యాజమాన్యం ప్రవర్తిస్తున్నది. అసలు ఈ ప్రపంచంలో మూల ఏ ప్రక్రియ     సక్సెస్ అవుతుందో దాన్ని మనవాళ్లు ఇట్టే స్వతంత్రం చేసుకుంటారు.        ఆనవాలు పట్టడానికి కూడా వీలు లేకుండా దానికి నకిలీ తయారు చేస్తారు.        నాణ్యతలో తప్ప మరిదేనిలోనూ తేడా మనకు కనబడదు.

              ఏదో నాలుగు తెలుగక్షరాలు నేర్చుకొని కుదురుగా చదువుకొంటున్న        మా అమ్మాయిని ఇంగ్లీషు మీడియం చదివించాల్సిందేనని మా ఆవిడ      పట్టుబట్టింది. ఎందుకంటే మా పక్కింటివాళ్ళమ్మాయి పొద్దున్నే బూట్లు, టై,   బ్యాడ్జీ మరేవేవో వేసికొని టిప్ టాప్ గా  కాన్వెంటుకు వెళ్ళేది. ఇంటికొచ్చి      టర్ ఫ్లై  బటర్ ఫ్లై అని అరుస్తూ ఉండేది. పక్కింటివాళ్ళ పిల్ల  అరుపులు   విన్న మా ఆవిడ ఒక్క ఉదుటన నా దగ్గరకు పరిగెట్టుకొచ్చి మన పిల్లను        గూడా కన్వెంటులో చేరుస్తారా లేదా ? అని నిగ్గదీసేది. ఈ ఇంటిపోరు      పడలేక చివరికి కాన్వెంట్ల వేటలో పడ్డాను. దారిలో ఓ మిత్రుడు తోడయ్యి        అచ్చంగా కన్వెంట్లే ఉండే ఒక బజారుకి తీసికెళ్ళాడు.


            అన్ని కాన్వెంట్లూ తిరిగి చూచాము. కొద్దో గొప్పో తేడాతో అందరూ మూడువేల దాకా ముట్టజెప్పుకోమని అడిగారు. మూడు రూపాయల ఖర్చు గూడా లేకుండా మా వూరి వీధి బడిలో చేరి చదివానే, ఇక్కడేంది మూడువేలు ఫీజంటున్నారు ? అని వెంవచ్చిన మిత్రుణ్ణి అడిగాను.

ఊదు వేయందే పీరు లేవదోయ్ బాషా, అయ్యి ఎలిమెంటరీ స్కూళ్ళు, ఇయ్యేమో సెయింట్ స్కూళ్ళు ఆటికీ ఈటికీ తేడా లేదా ? అన్నాడు. సెయింట్ అనే మాటకు అంత విలువ ఉంట.సెయింటంటే ఏందని అడిగాను. సన్యాసి, బుషి లేదా ముని అని తడుముకోకుండా జవాబిచ్చాడా బైరాగి. సన్యాసుల స్కూళ్లకు సంపాదనా మెండా ? అని అనబోయి కూడా ఆపుకొన్నాను.

        ఇంకాస్త ముందుకొస్తే అతి విచిత్రమైన బోర్డు కనబడింది. అది ఆల్
సెయింట్స్ హైస్కూల్ నాకు నానార్ధాలు గోచరించాయి. ఇదేం పేరు రా మిత్రమా లా ఉంది?అన్నాను. అవునోయ్ రోజుకొక కాన్వెంట్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో కొత్త కొత్త సెయింట్ల పేర్లు వాటికి తగిలిస్తున్నారు. ఉదాహరణకు సెయింట్ వాణి, సెయింట్ రాణి, సెయింట్ జాక్ పాట్, సెయింట్ ఆయిషా, సెయింట్ ఖాదర్ వలీ, సెయింట్ పకీర్ సాహెబ్, సెయింట్ లిల్లీపుట్ .. ఇలా ఇలా అడ్డమైన పేర్లన్నీ పెట్టేస్తున్నారు గదా ? వీళ్ళందర్నీ భూ వర్తమాన భవిష్యత్  కాలాలలో చావు దెబ్బ తీయటానికని ఈ మహానుభావుడు ఆల్ సెయింట్స్ అని పెట్టుకున్నాడు తప్పేమిటి ? అని ఎదురు ప్రశ్న వేశాడు. 
        సరే ఆ రోజుకు పని కాలేదు. ఇంటికి తిరిగొచ్చాను. పక్కింటి పాపాయిని పిలిచి, పాపా నీవు చదివే స్కూలు పేరేంమ్మా ? అని అడిగాను. సెయింట్ వోణి అనుకుంటూ ఆ పిల్ల పరుగుతీసింది. స్కూలు పేరడిగితే సెంటూ, వోణి అంటుందేమిటండీ ఆ పిల్ల ? అని మా ఆవిడ నన్ను ప్రశ్నించింది. ఆదేలే సెంట్ వాణి అన్నాను మధ్యలో ఈ సెంట్ ఏమిటండీ ఎంచక్కా వాణి కాన్వెంనో, వాణి స్కూల్ అనో పెట్టుకోక అంది. ఆ సెంటులేకపోతే స్కూలు వాణికి  విలువే లేదే పిచ్చి మొమా ! అన్నాను నా ఫ్రెండుతో గడించిన జ్నానాన్ని ఉపయోగించుకొని. ఆ సెంట్ అంత ఖరీదైందా ? మళ్ళీ ప్రశ్న. చివారికెలాగో ఒక గంట సుదీర్ఘోపన్యాసం చేసి ఆమె చేత ' అలాగా ' అనిపించాను.

        మరునాడు అమ్మాయిని తీసికెళ్లి కేవలం రెండొందలు మాత్రమే అడ్మి షన్ ఫీజు తీసికొన్న సెయింట్ చెన్నారెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూలులో చేర్పించాను. పక్కింటి పాపాయితో ధీటుగా మా పిల్లను తయారుచేసి బండెడు పుస్తకాలు వీపుమీదకెత్తి పంపించాము. అలా సంవత్సరం గడిచింది. అమాయి ఇంగ్లీషులో మాట్లాడేదింకెప్పుడు ? అని నాకు ఆదుర్దాగా ఉంది.
అమ్మా మీ స్కూల్లో టీచర్లు ఇంగ్లీషులో మాట్లాడతారా ? ఆపుకోలేక అడిగాను " లేదు నాన్నా , ఎంచక్కా తెలుగులోనే మాట్లాడుకుంటారు. పాఠం మాత్రం ఇంగ్లీషులో చెబుతారు " అంది. ఇంతకు  ముందు తెలుగులో పాఠాలు చదివి అర్ధం చేసికొనేది. ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు ఏదీ పూర్తిగా రావటం లేదు అనుకొన్నాను. పక్కింటి పాపయ్య భార్యతో అంటున్నాడు.
" సెంట్ వాణీలో అంతా తెలుగోళ్లే  లాభం లేదు. సెంట్ పంగనామం హైస్కూల్లో చేరిస్తే గాని పిల్ల బాగుపడదు. అక్క అంతా అరవోళ్ళు. "

3 కామెంట్‌లు:

  1. బావుందండి. చాలా మంది ఎదుర్కునే సమస్య ఇది. కొంత మంది అంగ్ల మాధ్యమ మొజులొ పడి కొట్టుకుంటూ, ఈదుకుంటూ, చీదుకుంటూ, ముక్కుతూ, మూలుగుతూ వుంటే; మరికొంత మంది మాతృ బాషలో చదివితే పిల్లలకు స్రుజనాత్మకత పెరుగుతుందని తెలిసీ భార్య/భర్తని, పక్కింటోడ్ని, సమాజాన్ని వొప్పించలేక ఆ ఆంగ్ల కాలవలో ఈత నేర్పుటకు వాల్ల పిల్లల లంగూటాలు బిగిస్తున్నారు.

    అరె! ప్రభుత్వ పాఠశాలలో అన్ని అర్హతలు వున్న పంతుల్లు వున్నార్రా మొర్రో అంటుంటే, డిగ్రీ కూడా పొందారో లేదో కూడా తెలీని పంతుల్లున్నా బళ్లకి పంపుతామంటారె... ఏమి విచిత్రం... ఇది మన దేశంలోనే, అందునా మన రాష్టంలోని వుందేమో...

    రిప్లయితొలగించండి
  2. https://www.facebook.com/photo.php?fbid=2418415244857118&set=a.233025936729404&type=3&theater

    రిప్లయితొలగించండి