కాంతామణులూ కదం తొక్కుతూ కదలిరండి
గీటురాయి 15-8-1986
ఆలయమేలా ? అర్చన లేలా ?
ఆరాధన లేల ?
పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా ?
అదే పరమార్ధము కాదా ?
అని ఆనాటి అనసూయ కుష్టు వ్యాధితో కుళ్ళిపోయిన భర్తను కూరగాయల గంపలాగా నెత్తిన బెట్టుకొని మోస్తుందట.
అమరులెటులైన
సంతాన మందవచ్చు
మనుజ లోకానసాధ్వులు
మగడు లేక
పుత్ర సంతాన
మేరీతి పొందగలరు
తమకు తెలియని ధర్మమేముంది
ధర్మరాజా ?
అని సావిత్రి యముణ్ణి సైతం బురిడీ కొట్టించి చచ్చి పోయిన మొగుడ్ని లేపుకొని ఇంటికి తీసికెళుతుందట.
“ పతి పద సేవయే యోగముగా నాతికి పతియే దైవముగా “
అని పాడుకుంటూ, కుమారీ శతకాన్ని వల్లెవేసికొంటూ, మంగళ సూత్రాలనీ, మగమహారాజు మురికి పాదాలనీ కళ్ళకద్దుకొనే అతివలకు ఈ దేశంలో బోలెడు విలువిచ్చారు. ఆడవాళ్ళ మనస్తత్వాన్ని ఈ రకమయిన సిద్ధాంతాలతో అలవాటు పరచి పురుషాధిక్యతను నిలబెట్టుకొచ్చారు.
చివరికి బాల్య వివాహాలు మొదలయ్యాయి. రేపో మాపో చావబోయే ముసలాడికి, ఎనిమిదేళ్ళ బుచ్చమ్మనిచ్చి పెళ్లి చేసేవారు. వాడు పెళ్ళయిన రెండు రోజులకే హరీమనేవాడు. ఇక ఆ బుచ్చమ్మ జీవితం దుర్భరంగా తయారయ్యేది.నున్నగా గుండు గీసి, తెల్లకోక వంటికి చుట్టి, ఒక బానిసలాగా ఇంట్లో చాకిరీ చేయించుకుంటూ ఉంచే వారు. పొద్దున్నే కంటబడితే ‘ వెధవ ముండా అవతలికి పో‘ అని తిట్టేవారు.బుచ్చమ్మ యుక్త వయస్కురాలవుతుంది. తనంత వయస్సులోనే ఉన్న తోటి ఆడవాళ్ళు చక్కగా సింగారించుకొని, తలలో మల్లెపూలతో కళకళలాడుతుంటే తన దౌర్భాగ్యానికి కారణమేమిటో తెలియక పరితపిస్తుంది. నేను చేసిన తప్పేమీటి అని వాపోతుంది. గిరీశం లాంటి మోసగాడి మాటలకు ఆమెలో వసంతం చిగురిస్తుంది.మోసపోయి లేచిపోతుంది. కందుకూరి వీరేశలింగంగారి తీవ్రకృషి వల్ల మన రాష్ట్రంలో ఈ పీడ విరగడయ్యింది. దేశంలో ఇంకా అక్కడక్కడా ఈ దురాచారం కొనసాగుతోంది.
“ తెలుగింటి ఆడపడుచులు నా ముద్దు చెల్లెళ్ళు “ అని ప్రసంగాలిచ్చిన అన్న ఆడవాళ్ళ విషయంలో కొన్ని మంచి పనులు చేశాడు. అన్నా మా ఆయన్నాదుకోవా ? అని అభ్యర్ధించిన సావిత్రుల ఆక్రందనలకు కరిగిపోయేవాడు. ఆడవాళ్ళకు కూడా సమాన ఆస్తి హక్కు బిల్లు తెచ్చాడు. ఉద్యోగాల్లో ఆడవాళ్ళకు 30 శాతం, రాజకీయాల్లో 9 శాతం రిజర్వేషన్లు కల్పించాడు. మహిళా పోలిటెక్నిక్ లు, మహిళా హాస్టళ్లు ఇంకా... ఏవేవో ఆలోచనలతో ఉన్నాడు. ఇలాంటి పనులన్నీ ఇందిరమ్మ హయాంలోనే దేశం మొత్తం మీద జరగాల్సింది. ఇందిరాగాంధీ కుటుంబ నియంత్రణకిచ్చినంత ప్రాధాన్యత మరి దేనికీ ఇవ్వలేదు. ఇప్పుడూ అంతేనేమో !
అందుకే ఆడవాళ్ళు కళ్ళు తెరవాలి. కుటుంబంలోను, సంఘంలోను స్త్రీ మూర్తుల పాత్ర చాలా ఉంది. సృష్టిలో సగభాగం స్త్రీ. ఆమె లేకపోతే జగత్తు స్తంభిస్తుంది. పక్కింటి మీనాక్షి పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొనే కామాక్షులు ఉండబట్టే మహిళా మండళ్ళు, మహిళా సహకార సంఘాలు మంటగలిశాయి. ఆడవాళ్ళ ధ్యాసంతా అలంకారాల మీదే. పరస్పరం అసూయతో ఫ్యాషన్ రాణులు దహించుకుపోతున్నారు. ఆడవాళ్ళు అసలు శక్తి అడుగున పడిపోయింది. ఆడదాని కష్టాలు ఆడదానికే తెలుస్తాయి అంటారు. కానీ ఇప్పటి వరకూ జరిగిన స్త్రీ విమోచన ఉద్యమాలన్నీ మగావాళ్లే నిర్వహించారు. ( దీని మర్మమేమో తిరుమలేశునికే తెలియాలి ! ) చివరికి ఆడవారికి ఓటు హక్కు ఇప్పించింది గూడా మగవాళ్లే. బుర్ర సరిగా పనిచేస్తే బురఖా అవరోధం కాదు. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం ఎంతో అవసరం. అలాంటి మగువలే మగవాళ్ళకు మధుర భావనలు.
ఆత్మ సౌందర్యం గల ఆడవాళ్ళూ ! మీకు జోహార్లు.
మీ బిడ్డలకు మీ పాదాల దగ్గరే పరలోకం ఉందట !
ఆత్మ సౌందర్యం గల ఆడవాళ్ళూ ! మీకు జోహార్లు.
మీ బిడ్డలకు మీ పాదాల దగ్గరే పరలోకం ఉందట !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి