పొరుగింటి పోరుకు ఘాటైన మందు
గీటురాయి 22-8-1986
ఆనాటి అగ్రహారము
ఏనాడో కండ్రికాయ
ఏమని చెపుదున్
ఈనాడీనామాయెను
నానాటికీ తీసి కట్టు నాగం భట్టు !
అని కొండవీటి చేంతాడంత దీర్ఘం తీస్తూ మాల్కోసు రాగంలో పాడుతున్నాడు పరంధామయ్య. ఏమిటయ్యా పరం, ఏమయ్యింది ? అని అడిగాను. చైనా వాడు లడక్ దాకా వచ్చాడట. కొంపదీసి యుద్ధమే వస్తే పే కమీషన్ పెంచిన జీతాలు ఇవ్వరేమోనని భయంగా ఉండి అలా పాడుతున్నాలే అన్నాడు.
యుద్ధం రావటానికి జీతాలు తగ్గించడానికి సంబంధం ఏమిటి ? అన్నాను. యుద్ధమొస్తే మన నోటి కాడ కూడు తీసికెళ్లి సైనికులకు పెడతారోయ్ ఆ మాత్రం తెలీదా ? ఇప్పుడు ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయిలో 14 పైసలు రక్షణ కోసమే. మన కోసం 5 పైసలే గదా ! యుద్ధమొస్తే ఆ ఖర్చు 3 పైసలే చేస్తారేమో ! అన్నాడు.
నాకిప్పుడు ఈ సంగతి గురించి ఆలోచించక తప్పలేదు. పైగా దేశానికి సంబంధించిన విషయమాయే. పేపర్లలో చూస్తే “ చైనా దౌర్జన్యం – మన దౌర్బల్యం “ అని సంపాదకీయాలు కానొస్తున్నాయి. పాకిస్తాన్ వాళ్ళు నాలుగు ఫర్లాంగులు ముందుకొస్తే ఎనిమిది ఫర్లాంగులు వెనక్కి కొట్టికెళ్ళే మన వాళ్లేనా ఇలా మాట్లాడుతున్నది అనిపించింది. చైనా వాళ్ళు జూన్ లోనే సందురాగ్ లోయలో చొరబడితే ఆ సంగతి ఆగష్టు నాటికి గాని మనకి తెలియలేదు.
“ 1962 అనుభవం “ అని అన్ని పేపర్ల వాళ్ళూ ఏదో నీళ్ళు నములుతున్నారు. అదే పాకిస్తానో, బంగ్లాదేశో, శ్రీలంకో ఈ పని చేస్తే మనం ఇన్నాళ్ళపాటు సంప్రదింపుల్తో గడిపే వాళ్ళమా? దేశానికి మూడు పక్కల మంచి కాపలా ఉంచిన వాళ్ళు నాలుగో పక్క నిర్లక్ష్యం ఎందుకు చూపారు ? బంగ్లాదేశ్ బంగారం లాంటి మిత్రుడు అంటూనే కంచె కడుతున్నారు. పాకిస్తాన్ పరమ శత్రువు అంటూనే రైలు మార్గం తెరుస్తున్నారు. శ్రీలంక సంగతైతే సరేసరి. చైనావాడితో ఎన్నాళ్ళీ మంతనాలు ? జరిగిన నష్టానికి 24 ఏళ్ళు చర్చలు సాగదీసినా ఒరిగిందేమీ లేదు. యుద్ధం చేసి వాళ్ళను గెలవలేము అనుకొన్నప్పుడు పోయిందేదో పోయింది,ఇక మీదట మనదేదీ పోకుండా చూచుకోవాలనే జాగ్రత్త ఉండొద్దా ? సోషలిజం అని చక్కని నినాదాలిచ్చే సోవియట్ రష్యా అమాయకురాలయిన ఆఫ్ఘనిస్థాన్ ను క్రమంగా కబళిస్తోంది. “ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు “ అనే వైఖరి మన కొద్దు. సింహం లాగా మీదపడే వాడి గురించి జాగ్రత్త పడవచ్చు. కానీ చీడ పురుగులాగా పాకి వచ్చే వాడిని ఎలా ఎదుర్కోవటం ? ... ఎలా? .... ఇలా ఎంతో ఆవేశంగా ఆలోచిస్తున్నాను. ఆన్సర్ దొరకటం లేదు.
పరంధామయ్య పట్టి కుదిపాడు నన్ను. పది నిముషాల నుంచి చూస్తున్నాను. నీలో నువ్వే పళ్ళు కోరుక్కుంటున్నావు గాని పైకొక్క మాటా చెప్పి చావవే. పైసల సంగతేమన్నావు ? అన్నాడు. ఓరి నీ పైసల పిచ్చి పాడుగాను ముందు ప్రదేశం పరులపాలై చస్తుంటే ఉపాయం ఆలోచించుకోకుండా ఇదేమి గోలరా ? అన్నాను. ఏ ప్రదేశం ? అరుణాచల ప్రదేశమా ? ఆ ఏముంది, బంగ్లాదేశ్ కి కట్టునట్టు కంచే గడితే సరి ! అన్నాడు కంచెలు పీకేసి లోపలికొచ్చే రకంగదా ఇది ? పొట్లకాయకు బొచ్చుపురుగు పట్టినట్టు కంచెను తినేస్తారు అన్నాను. లోపలికొస్తే యుద్ధం చెయ్యాల్సిందే అన్నాడు. అంత శక్తి మనకు లేదు. 1962 సంగతి మరచి పోయావా ? అన్నాను. అలాగైతే “ ఆఫ్ఘనిస్థానే మనకు ఆదర్శం “ అన్నాడు. ఎలా ? అడిగాను ఆశగా. “ అమెరికా నుంచి అపాయం – పాకిస్తాన్ నుంచి ప్రమాదం “ అనే సాకుతో రష్యా సేనల్ని కర్మాల్ ఆహ్వానించాడు గదా ! ఆ విధంగా రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్థాన్ ను ( ఆదు ) కొన్నారు. స్వతంత్రం వచ్చింది మొదలు నీవే దిక్కు అని రష్యాను నమ్ముకున్నాం. నీళ్లూ నూనె చస్తే కలవ్వు. అలానే చైనా రష్యా కూడా. అందుకని “ చైనా చీడ “ నుంచి రష్యా వాళ్ళ నొచ్చి ఆదుకొమ్మని అరుద్దాం. వాళ్ళొచ్చి అరుణాచలం పొడుగునా నిలబడతారు. వాళ్ళ వెనకాల మనం ఎలా ఉంది ఐడియా?లేదు పరంధామంకు సాటి ... అని మరో పాట అందుకున్నాడు. నాకైతే లోపల్లోపల చైనా మీద కోపం బుసలు కొడుతున్నది గాని నిజం చెప్పొద్దూ, ఏమీ చేయలేని ... అదేదోతనం అంటారే, అది ఆవహించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి