17, జులై 2012, మంగళవారం

కర్మనీదేఫలమూనీదే


కర్మనీదేఫలమూనీదే                                           గీటురాయి 17-10-1986
ముఖస్తుతి చేసిన వాడినీ, చేయించుకొన్న వాడినీ చెరుస్తుంది. వెనుకబడిన తరగతులోళ్ళ ఉద్ధారకా దీన జన బాంధవా అని 64 కొబ్బరికాయ నీళ్ళతో పట్టాభిషేకం చేసిన వాళ్ళు, చేయించుకొన్నాయనా ఇవ్వాళ చాలా ఇరుకున పడ్డారు. ముందు ముల్లు తొక్కి వెనుక భద్రం అన్నట్లు అన్న పొరపాట్లు చేయడం, తరువాత సారీ అనటం బాగా అలవాటు చేసికొన్నాడు. ముందు పోటూ, వెనుక తన్నూ అన్నట్లు ఇటు ఉద్యమాలు అటు న్యాయస్థానాలూ ఆయన్ని ఊపిరి సలపనీయకుండా వాయిస్తున్నాయి.ముందు నడిపించి వెనుక కొంకులు గొట్టే వాళ్ళూ ఆయన చుట్టూ తయారయ్యారు. ఇంతకీ ఈ శిక్షలన్నీ చాలా వరకు స్వయంగా సంపాదించుకొన్నవే. సంపదలో మరుపులు, ఆపదలో అరుపులు ! కేంద్రమే రిజర్వేషన్ల మీద ఒక జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించాలి అని ఇప్పుడు వాపోతున్నాడు. ఇంతకీ వెనుకబడిన కులాలోళ్ళకు అయ్యవారు చేసిన మేలేమిటి ? అని పరిశీలిస్తే ఏమీ లేనట్లే తేలింది.


 ముంమోపి కాళ్ళకు మొక్కితే నీవూ నాలాగే వర్ధిల్లు అందట, రెండవసారి దండంబెడితే నా మొగుడి మాదిరే బ్రతకమందట. ఎంతో ఆర్భాటంతో, వొళ్ళు గగుర్పొడిచే రీతిలో రిజర్వేషన్ల ర్వం ఆరంభమయ్యింది. కర్మిష్టిని నేను, ఫలితం మీది అనుభవించండి అని వరాలు ప్రసాదించిన అన్న కనుసన్నలలోనే వెనుకబడిన కులాల నాయకుల కాళ్ళు విరిగాయి. వేళ్ళు పగిలాయి.ఈనాడు మరో కమీషన్ వేస్తాను నోరు మూయండి అంటున్నాడు.

మానుగొట్టి మీద దోచుకున్న ముఖ్యమంత్రి మూడు ఆశ్రమ విద్యాపీఠాలు స్థాపిస్తారట. వాటి పేర్లేమిటో తెలుసా ? నాగార్జున విద్యాపీఠం, మల్లికార్జున స్వామి విద్యాపీఠం, వరాహనృసింహస్వామి విద్యాపీఠం. తిరుపతిలో మహిళా విశ్వ విద్యాలయానికి పద్మావతి దేవి పేరు పెట్టడం మన కేరుకే! ఇలాంటి పేర్లు పెట్టాలని ఆయనకెందుకనిపిస్తున్నది ?

మక్కాకు పోయినా టక్కరితనం మానని వానిలా ఉంది ఈయన వ్యవహారం. అనేక రకాల మతాల ప్రజలు నా పాలనలో ఉన్నారు. నేను వారందరికీ ప్రతినిధిని; నేను చేసే పనులు వర్గాన్నీ అపోహలకు గురి చేయగూడదు అనే తలంపు ఆయనకు ఉంటేగా. ఎక్కడో ఉన్న మహేష్ యోగిని పిలిచి వెయ్యి ఎకరాల భూమిని వేద విశ్వ విద్యాలయం కోసం ధారాదత్తం చేయబూనటం, తెలుగు తల్లి అనీ ఉర్దూ ఎల్లీ అనీ విగ్రహాలు స్థాపించడం ఆయన నిరంకుత్వాన్ని సూచిస్తున్నాయి. అమెరికాలోని సంపన్నులకు వెంకటేశ్వరస్వామి బొమ్మలు ముద్రించిన నాణాలు తీసికెళ్ళబోయి అభాసుపాలయిన అన్న కాషాయం ధరించటం, కమ్మ బిగించటం మొదలు పాగా పెట్టడందాకా ఎన్ని అపశ్రుతులో ! కేరళ మంత్రి ఒకాయాన్ని అన్నగారి పాలనా చాతుర్యం మీద వ్యాఖ్యానించమని కోరగా ఖజానా ఖాళీ చేయడం తప్ప అన్నకేమీ తెలియదు అని కుండబద్దలు  కొట్టినట్లు చెప్పాడు. ఆయన పరిపాలనలో జరిగిన, జరుగుతున్న అనేక దుబారా వ్యయాలను చూస్తుంటే కేరళ మంత్రి చెప్పింది కరెక్టేననిపిస్తున్నది. అన్న ధోరణి ఎప్పటికి మారుతుందో ఏమో! అన్నా, నీవు రూమీ టోపీ పెట్టొద్దు తలకు పాగా చూట్టొద్దు. ప్రజలందరికీ మేలు చేసే పనులు చేయి చాలు. అదే నీ కర్తవ్యం అని అరవాలనిపిస్తుంది. వింటాడా అనేదే సందేహంగా ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి