31, జులై 2012, మంగళవారం

సిగ్గులేని సింగారమే రాజకీయ వయ్యారం

సిగ్గులేని సింగారమే రాజకీయ వయ్యారం                          గీటురాయి 5-12-1986
సిగ్గెందుకు లేదురా జగ్గా అంటే, నల్లటివాడిని నాకెందుకు సిగ్గు అన్నాడ. ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే తేడా లేకుండా ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి కుప్పిగంతులు వేసే రాజకీయ నాయకులు ఎప్పుడూ ఉంటారు. ఒక పార్టీ తరఫున గెలిచిన తరువాత మందీ మార్బలంతో సహా అవతలి పార్టీలోకి వలస పొయ్యే వాళ్ళూ ఉన్నారు. అయితే వీళ్ళందరిలో ఒకానొక విశిష్ట పదార్థం ఉండదు. ఆ పదార్థం పేరు సిగ్గు. ఇది వారిలో కొరవడటం వల్ల పదిమందీ ఏమనుకొంటున్నా వారికి ఏమీ అనిపించదు. అసలు వినిపించదు. దీనిని మనం గుర్తు  కోసం విటమిన్ సి అందాం.

సిగ్గు చిన్ననాడేపోయే, పరువు పందిట్లో పోయే. కొరావా సరవా ఉంటే గదిలో పోయే అన్నట్లు పార్టీలు మారి మారి వీరికి సిగ్గు పడాలి అనే సంగతి జ్నాపకం కూడా లేదు. గోగినేని రంగనాయకులు అనే ఆయన ఇందులో ఆచార్యుడు అంటారు. అంతటి ఆచార్యుడు కూడా కొద్దో గొప్పో సిగ్గుపడి నాయకుల గోగినేని రంగా (ఎన్. జీ. రంగా) అని పేరు మార్చుకున్నారు ఎందుకంటే ప్రజలు తేలికగా గుర్తించకుండా ! ఏ పార్టీలో చూచినా ఈయనే కనపడేవారు. అందుకని ఆయన్ని రంగులు మార్చే రంగా అనే బిరుదుతో ప్రజలు సత్కరించారు. మొదట స్వరాజ్యమనీ, తరువాత స్వతంత్రమనీ అరచిన నాయకులంతా చివరికి కాంగ్రెసనే సముద్రంలో నీటి బొట్టుల్లా, కాకి రెట్టల్లా కలిసి పోయారు. ధ్రువతారలని పేరుగాంచిన పెద్దలు ఉల్కల్లాగా రాలి పోయారు. తారలు రాలిపోతాయా అనేది నాకు ఇంకా సందేహంగానే ఉంది.

సెబాష్ మద్దెలగాడా అంటే, అయిదువేళ్ళు పగలకొట్టుకున్నట్లు, కొందరు సుబ్బారాయుళ్ళు డబ్బారాయుళ్ళ ఊదరకు దెబ్బతినిపోయారు. సవరదీసినకొద్దీ నిక్కినట్లు ఆరోజు ఎంత బ్రతిమిలాడి భంగపడినా బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇందిరా గాంధీకి ఇవ్వలేదు. చివరికి సిగ్గుమాలిన ముఖానికి నవ్వే అలంకారమన్నట్లు బ్రహ్మానందపడుతూ ఇందిరా కాంగ్రెసులోనే చేరిపోయారు. అసలు కాంగ్రెస్ లో రాణించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలని అమ్మ నిత్యమూ అంటుండేది. అందులో ప్రధానమైనది సిగ్గులేనితనమేనట. సొంత ఆలోచన లేక పోవటం కూడా మరొక అర్హత అని మురార్జీభాయ్ శలవిచ్చాడు. అయితే ఈ అర్హతలు కాంగ్రెస్ కే కాదు ఈ పార్టీకైనా వర్తిస్తాయి అని నాకు నిదానంగా తెలిసింది. ఇవాళ్ళ పాద పూజలు జరిపే జనం కాస్త ముందడుగులోనే ఉన్నారు.
హర్షుణ్ణి నమ్ముకుని పురుషుణ్ణి పోగొట్టుకున్నట్లు వెంగళరావుగారు ర్సును ఆవు దూడను నమ్ముకుని ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. ఇదే చాన్సనుకొన్న చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రై చక చకా తన తపనంతా తీర్చుకొన్నారు. శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ శానాళ్ళు బతకమ్మా అన్నట్లు ఆయన గారి హయామంతా తులాభారాలతో చందాలతో గడిచిపోయింది. అయితే రాష్ట్రానికి గండం గడవలేదు. ఉద్దండపిండాలనే పేరుతో ఉద్ధరించే మరో ముగ్గురినీ మార్చారు. వాళ్ళంతా కలిసి ఇదుగో ఈ యమధర్మరాజుకి అప్పజెప్పారు తెలుగు జనాన్ని.ఈయన సుప్రసిద్ధ నటులు గనుక మొదటినుండీ విటమిన్ సి కొరత  ఉండేది.

సంసారంలేనివారికి సరసాలెక్కువ అన్నట్లు మన యములవారు పదవినధిష్ఠించింది మొదలు పెదవులాడించటంతోనే పనులు జరుపుకొస్తున్నారు. పదిమందితో ఆయన ఆడుతున్న సరసాలు విరసాలు కావటం చివరికి కోర్టులపాలుగావటం నిత్యకృత్యంగా మారింది.

పదవిపోయిందని అలిగి నాదెండ్ల, చెన్నారెడ్డి వేరే పార్టీలు పెట్టి ఖాళీగా ఉంటున్నారు. వి. బి. రాజుకి పదవి ఇవ్వొద్దు, చెన్నారెడ్డిని ఖాళీగా ఉంచొద్దు అని వెనుక ఒక సామెత ఉండేది. అరిచే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండవ. అందుకే పాపం వీళ్ళు గూడా పనిదొరక్క లో లక్ష్మణా అంటున్నారు. శక్తిచాలనివాడు సాధుత్వము వహించినట్లు వీరు పాపం ఇంతకాలం గమ్మున ఉన్నారు కానీ మనసంతా అటే ఉంది.

అయితే సిగ్గుమాలినదాన్ని చిటికేస్తే, ఆరామడనుంచి ఆలకిచ్చిందట. ఈ మధ్య మూపనార్ అనే అరవాయన పార్టీ బయట నిలబడి కాల్ లెటర్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్న నిరుద్యోగులందరికీ ఆహ్వానం న్నాడు. చవానంతటోడే ఛలో అనగా లేనిది చెన్నారెడ్డికేమిటి అనుకున్నాడో ఎమోగాని తట్టాబుట్టా సర్దుకొని సంసిద్ధమయ్యాడు. మరి ఆయన్ని నమ్ముకొని ఏటిలో దిగినవారిని విడిచి వెళ్ళేవాడేనేమోగాని ఆయనలో కొంత విటమిన్ సి మిగిలి ఉండటంవల్ల ఆ పని చేయలేకపోయాడు. అందుకే అందరం కట్టగట్టుకుని కాంగ్రెస్లో దూకుదాం రండని తన సహచరులందరిని ఆహ్వానించాడు.ఇక ఇప్పుడు ఏనుగునెక్కి రంకుకు పోయినట్లుగా పోబోతున్నాడు. విటమిన్ సి కొరత దేశంలో విపరీతంగా ఉంది – అయితే విదేశాలనుండి దిగుమతి చేసుకొని యుద్ధ ప్రాతిపదికమీద మన  నాయకులందరికీ,ప్రముఖ ప్రజలందరికీ ఇవ్వాలని ఈ మధ్య ఒక సభలో రాజాకీయ సిగ్గరులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారని తెలిసి మహా సిగ్గు పడిపోయాను.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి