18, జులై 2012, బుధవారం

మన్ను పూజపై తిరగబడిన మానవసేవ

మన్ను పూజపై తిరగబడిన మానవసేవ
               గీటురాయి 21-11-1986
దేశమంటే మట్టా? మనుషులా ? అనే మీమాంస వచ్చిపడింది. దేశభక్తి మ తాతల ఆస్తి అని చెప్పుకునే ఒక జాతి జనం దేశమంటే మట్టేనని ఘం మోగించి చెబుతున్నారు. దేశమంటే మట్టి కాదు మనుషులు రా అని చెప్పిన గురజాడ గుడ్లు వెళ్లబెట్టి చూస్తున్నాడు.

ఈ మట్టిలోనే పుట్టాము. ఈ మట్టిలోనే పెరిగాము. ఈ మట్టిని మించిన దైవం మనకు వేరే లేదురా అని వాళ్ళు గట్టిగా పాటలు గూడా పాడుతున్నారు. నీ తల్లి నిన్ను నవమాసాలే మోసింది. కానీ ఈ తల్లి (భూమి) నిన్ను కడదాకా, నీ కట్టే కాలేదాకా మోస్తుంది రా అనే  చరణాలు అందుకొంటున్నారు.

మంత్ర జలం కంటే మంగలి జలమే మంచిదనే వాళ్ళు ఈ మట్టి భక్తులకు నచ్చటం లేదు. పైగా మట్టి కోసమే గట్టి పోరాటాలు జరుగుతున్నాయి. తెలుగు వీర లేవరా అని ఒకాయన అంటే తమిళ కత్తి పట్టరా అని మరోకాయన, మరాఠీ తట్ట ఎత్తరా అని ఇంకొకాయన వాదులాడుకొంటున్నారు. ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన దొంగవాడు అని మన మట్టి మీదే ఎల్లలు గీచుకున్నారు.

ఆ మధ్య ఒక మహానుభావుడి చిరునామా అడిగితే నేను ప్రపంచ పౌరుణ్ణి, ప్రపంచమే నా దేశం న్నాట. అంతే, అతన్ని పెద్ద దురాక్రమణ దారుడిగా లెక్కగట్టి అలతనికి దేభక్తే లేదు పొమ్మన్నారు మన మట్టి పూజారులు. అతని వాదం ఏమిటంటే నేనివ్వాళ్ళ ఇక్కడున్నాను. రేపు పరలోకంలో ఉంటాను. అప్పుడు అదే నా దేశం. ఈ లోకం కేవలం ఒక మజిలీ మాత్రమే. ఇక్కడ నా చిరునామా తాత్కాలికమేగదా! అని.  

ఎడారి నేలను పట్టుకొని పాలు తేనెలు ప్రవహించే దేశమని, నీళ్ళు అందక పంటలు ఎండిపోతుంటే సస్యశ్యామలమనీ కీర్తించే వాళ్ళకు వాస్తవ దృక్పధం లోపించింది అనుకోవచ్చు. కానీ పక్క దేశాలలోని భూమిగూడా తమదేనని పాడుకొనే అఖండవాదులను విశ్వజనీన హృదయం గలవాళ్ళు ఎలా నోళ్ళు మూయించగలరు ? వాళ్ళ ధోరణి గిట్టనివాళ్ళు మరగుజ్జు మహావృక్షమెక్కి అరచినా మరగుజ్జుగానే ఉంటాడని అంటారు. పొట్టివాడి నెత్తి పొడుగువాడు గొడితే, పొడుగు వాడి నెత్తి దేవుడు కొట్టడా అని తిట్టి పోస్తు న్నారు.

ట్టికి మొక్కేదా మల్లయ్యా ? అంటే మరి ఎవరికి మొక్కుతావు చెల్లయ్యా ! అంటూ సుప్రీం కోర్టులో ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ మధ్య దేవుడికి తప్ప మరి దేనికీ మొక్కేదిలేదని కొందరు పిల్లకాయలు మొండికేశారు. పిల్లల్లారా, ఈ గీతంలో మీరు మన భూమిని ఆరాధిస్తున్నారు. భూమి పూజ చేయటంలో తప్పు లేదు. గొప్ప గొప్ప
నాయకులే ఈ పని చేస్తున్నారు మీకేం వచ్చింది పొయ్యేకాలం? అన్నా  ఆ గడుగ్గాయలు వినలేదు.ఆ పాటకు మా నోళ్ళు తెరవమంటే తెరవమని మొసలిపట్టు పట్టారు. చివరికి ఎలాగో సుప్రీంకోర్టోళ్ళు బర్రెను కుడితి  తొట్టి దగ్గరకు తీసికెళ్లగలంగాని దానిచేత త్రాగించలేము గదా అని మట్టి భక్తులకు సర్ది చెప్పారు. పిల్లలు అందరితోపాటు గౌరవంగా లేచి నిలబడ్డారు. అంతే చాలు, బలవంతంగా వాళ్ళ నోళ్ళు తెరిపించడం, తర్వాత పాడించటం మన రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను (అంటే నోరు తెరవటానికి గాని, మూయటానికి గాని భారతీయుని కివ్వబడిన స్వేచ్ఛను) హరించటమేనని తీర్పు చెప్పారు.

       ఇప్పుడు నోళ్ళు తెరవటం పాలకుల పని అయింది. మట్టి భక్తులనోట మట్టిగొట్టినట్టయ్యింది. తూ.. తూ అని ఊశారు. మట్టి పూజకు పార్లమెంటులో పాడెగడదామని,పట్టం డదామని (చట్టం చేద్దామని) నిశ్చయించుకున్నారు.

       ఇది ఇలా ఉంటే వారియర్ అనే యోధుడు చేతులుమడిచి పైకి లేచాడు. వంటికిట్టిన మట్టి దులిపి మరీ అడిగాడు. బెంగాలోడు రాసిన వంగగీతం దేశమంతా పాడారు . అసలందులో దేశాన్ని గురించికాక దేశాన్ని ఏలేవాడిని గురించి ఉంది. దేశం కలకాలం ఉంటుంది కాని ఏలేవాడు ఎల్లకాలం ఉండదు. అందులో వర్ణించిన (కొన్ని) భూభాగాలు కూడా మన దేశంలో లేవు. గీతం ఉందంటే దేవభాషలోనే ఉండాలి అని దుమ్ముదులుపుతున్నాడు. తన దగ్గర చదువుకునే పిల్లలు ఆ గీతం పాడకుండా నోళ్ళు మూయించాడు.

       మచ్చాలు తినే నోటికి సొచ్చాలు ఎట్లా వస్తవి ? అని ఆయన ప్రశ్నిస్తుంటే పాలకులు మట్టి దిన్న పాముల్లాగా ఉంటున్నారు. మంత్రసాని పని ఒప్పుకున్నాక ఏది వచ్చినా పట్టాలి!అని సుప్రీంకోర్టును ఆడిపోసుకుంటున్నారు. ఈ గడ్డ మీదనే కరువొచ్చి మట్టి తింటున్న వాళ్ళకు మాత్రం ఈ మన్ను పూజ పోరాటం గురించి ఏమీ తెలియదు. బెల్లం ఉంని మోచేతి దాకా నాకితే, మోచేతి దాకా మట్టి మాత్రమే తగిలినట్లుంది పరిస్థితి.

       దేశమా! నీవు మట్టివే అయితే నీపైన నివసించే ఈ మనుషులెవరు ? నేను ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి ?” అని ఒక పిచ్చివాడు తల చించుకొంటున్నాడు. ఒక నాయకుడు మాత్రం ఓట్ల కోసం మట్టిని అర్ధించకుండా నేరుగా మనుషుల దగ్గరకు వస్తున్నాడు. అతనికి తెలుసు దేశమంటే ఏమిటో!

1 కామెంట్‌:

  1. హహహ ....చాలా రోజుల తరవాత మంచి వ్యంగ్య వ్యాక్యానం చదివాను .....అవును నాయకుడికి తెలుసు దేశం అంటే మట్టి కాదు ,మనిషి ఓటు అని ...

    రిప్లయితొలగించండి