పేరు కోసం పడే పాటు ఇంతింత కాదయా ...!
గీటురాయి 3-10-1986
పేరులోన ఏమి పెన్నిది వున్నది ? అని వెనకటికి ఒకాయన ‘ పేరు ‘ ను నిర్లక్ష్యం చేశాడు. కాని పేరు తెచ్చుకోవటం కోసం పెద్ద మనుషులంతా ఎప్పుడూ తాపత్రయ పడుతూనే ఉన్నారు. పేదలంటే చీదరించుకొనే దౌర్భాగ్యుణ్ణి పట్టుకొని ‘ పేదలపాలిట ఆశాజ్యోతి ‘ అని పేరు పెడతారు. గొంతు తెరిస్తే గార్ధభ స్వరమే పలికే విద్వాంసునికి ‘ గానకళా కోవిదుడు ‘ అనే పేరు రావాలని మహా కోరిక.
Life is short, but art is long అన్నాడు లాంగ్ ఫెలో. రాజ్య సర్వస్వాన్నీ ధారపోసి, భార్యా బిడ్డలను నిర్దయగా అమ్మివేసి హరిశ్చంద్రుడు కూడా అలానే అన్నాడు. “ శాశ్వతమదే... యశస్సు ! “ అని. ఆ దెబ్బతో మామూలు హరిశ్చంద్రుడు “ సత్య” హరిశ్చంద్రుడై కూర్చున్నాడు. ఈ కీర్తి కాంక్ష ఎంత గొప్పదంటే అది మనిషినొక చోట నిలువనీదు. కంటికి నిద్దుర రానీదు. ‘ ప్రపంచ విజేత’ అనిపించుకోవాలనే కోర్కె అలెగ్జాండర్ కు కలిగే గదా లోకం మీద పడింది ?.
“ ఆడిన మాట తప్పడు “ అనే పేరు రావాలని శిబిచక్రవర్తి మేనికండను చెండి ఇస్తే, బలిచక్రవర్తి రాజ్యమంతటినీ కోల్పోతాడట. “ పేరు ధర్మరాజు పెనువేప విత్తనము, మాట తేనేతేట మనసు విషము, నేతి బీరకాయ, ఎరుగలేని వాడి ఎదుట పొగడు, “ అని కృష్ణుడొకసారి ఎగతాళి చేస్తాడు. ఒకానొక పేరు పొందటం కోసం ఒకరినొకరు అణగద్రొక్కటం గూడా చరిత్రలో కనబడుతుంది.
ఉగాండా మాజీ అధినేత ఇడీ అమీన్ కు తన దేశానికి తన పేరే ఉండాలని ఉబలాటం. ఒక సెక్రటరీ ఇడీ అమీన్ తో అన్నాడట – అయ్యా, అమెరికా వాళ్ళను అమెరికన్లు, రష్యా వాళ్ళను రష్యన్లు, ఇండియా వాళ్ళను ఇండియన్లు అంటున్నారు. కానీ మన దేశానికి ‘ఇడీ’’ అని పేరు పెడితే, మనవాళ్లను ‘ఇడియట్లు’ అంటారేమో గదా ! అంతటితో ఆ ఇడియట్ పేరు మార్పు ప్రతిపాదన మానుకొన్నాడు.
వీధులకు, కాలువలకు కూడా మనుషుల పేర్లు పెడుతున్నారు. ఫలానా రాజేంద్ర ప్రసాద్ రోడ్డు మీద బస్సు’ క్రిందపడి పదిహేను మంది చచ్చారని, జవాహర్ లాల్ కాలువకు గండిపడి ఇరవై ఊళ్ళు కొట్టుకుపోయాయని వార్తలొస్తుంటే ఆ పెద్ద మనుషుల ప్రేతాత్మలు ఆ కాలవల్నీ రోడ్లనీ ఇంకా ఆవహించి ఉన్నాయేమోనని కొందరు సనాతన వాదులు బాధపడుతున్నారు.
రాజకీయ నాయకులు ఈ పేర్లపందెంలో ఇంకాస్త ముందుకెళ్లారు. ఎక్కడో ఒకచోట నాలుగిళ్ళు ప్రభుత్వ సొమ్ముతో కట్టించి వాటికి వారి పేర్లు పెట్టుకోవటం. వెంగళ రావు నగర్, సంజీవరెడ్డి నగర్, వేమా ఎల్లాయ్య నగర్, సంజయ్ గాంధీ కాలనీ... అంటే వెంగళరావు నగరోళ్ళంతా వెంగళ్రావుకే ఒట్లేస్తారనుకోకండి. అక్కడ తెలుగుదేశం వాళ్ళుకూడా ఉంటారు. అది ఆ పేరుగాలాయనకు కంటగింపేగాని ఏమీ చేయలేడు.
కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం, ఇందిరాపార్కు, నెహ్రూ జూలాజికల్ పార్కు, కొత్త రఘురామయ్య కాలేజీ, దొడ్ల సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి లాంటివన్నీ ఈ పేర్ల పిచ్చినీ, కీర్తి కాంక్షను తెలియజేస్తున్నాయి. ఇందిరా గాంధీ ‘ఓపెన్ ‘ యూనివర్సిటీ కూడా ఇలాంటిదే.
రంగారెడ్డి, సంగారెడ్డి, ప్రకాశం అనీ జిల్లాలకే ఎసరు పెట్టడం కూడా జరిగింది. ఎక్కడో ఒక స్టేడియానికో, ఆసుపత్రికో పేరు తగిలించుకొంటే పెద్ద పేరు రావటం లేదు. అందుకని జిల్లాలకు తగిలిస్తే యమ పేరొస్తుందని లేటుగా అర్ధమయ్యింది. దేశాలకే ఎసరు పెట్టిన వాళ్ళూ లేకపోలేదు. ఆఫ్రికాలో దూరి తిష్టవేసి అక్కడి సంపాదనను కొల్లగొట్టిన ‘ సేసిల్ రోడ్స్’ తన పేరు మీద ఆ దేశానికి ‘ రోడీషియా’ అని నామకరణం చేశాడు.
రుద్రాక్ష మాలలు, కాషాయ దుస్తులు వేసికొని కష్టపడినా, బ్రహ్మ దేవుని తలలో నుంచి ఊడిపడ్డామని చెప్పుకొంటున్న వాళ్ళు రామారావును అంగీకరించలేదు. వివేకానందుడిలా పాగా చుట్టినా వట్టి వేషం పొమ్మన్నారు. పేరు మాత్రం రాలేదు. జిల్లాలకన్నా తన పేరు పెట్టుకొందామని చూస్తే ఆ జిల్లాల వాళ్ళు ఊరుకొనేట్లు లేరు. ఇంతకంటే పెద్ద పేరుగల వాళ్ళు తమ జిల్లాలలో ఉన్నారు. పెడితే వాళ్ళ పేర్లు పెట్టండి అంటున్నారు.
పూబోడీ అని పొగిడితే ఎవర్రా బోడి ? నీయమ్మ బోడి నీ అక్క బోడి ! అని తిట్టినట్లు ఇప్పుడు నంద్యాల ప్రాంతం వాళ్ళు తెగ విమర్శిస్తున్నారు. ఏ రాఘవేంద్ర స్వామి పేరో, మరో కోదండరాముడి పేరో మా(కాబోయే) జిల్లాకు పెట్టక ఈ తారకరాముడి పేరే ఎందుకు పెట్టాలి ? అని వాళ్ళు నిలదీస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారి స్వయం పేరుతో మీ జిల్లా వెలుగొందుతుంది అంటుంటే వారికి సంతోషం కలగటం లేదు. ఇప్పటికే లంగారెడ్డి, సొంగారెడ్డి, ప్రకాశం లాంటి పేర్లతో ఆ జిల్లా కేంద్రం ఎక్కడుందో మరిచిపోయాము. ఇంకా ఈ మనుషుల పేర్లు ఎంతకాలం ? ఆయా జిల్లా కేంద్రాల పేర్లే ఆయా జిల్లాలకు ఉంచవచ్చు గదా ? అని అడుగుతున్నారు. కానీ పేరు బలం ముందు ఊరిబలం దిగదుడుపేనని నాయకుల వాదన. నోరు గల వాళ్ళదే రాజ్యం లాగుంది !
https://www.facebook.com/nrahamthulla/posts/1169927499705905
రిప్లయితొలగించండి