17, జులై 2012, మంగళవారం

నారు నీరు నీదైతే, నీపై నిగ్రాని నాది


నారు నీరు నీదైతే, నీపై నిగ్రాని నాది                                   గీటురాయి 31-10-1986
చెంపలు నెరసిన వెనుక చాన పతివ్రత అయినట్లు యవ్వనం అంతా దుర్వ్యయం చేసి ముసలి తనంలో బంగారు ముచ్చట్లు చెప్పే ముసలోళ్ళు చాలా మంది తమ యవ్వనంలో చేసిన తప్పులను గురించి పశ్చాతాపపడతారు. కానీ కొంతమంది ముసలి వాళ్ళకు పశ్చాత్తాపం రాదు గదా పిల్లల్ని గూడ చెడగొడతారు. నీ వయసే నాకుంటే ఊరిని విరగదీసే దాన్నికదమ్మా అని చింతామణీదేవినీ చెవులూరించి చెడ్డ పనికి ప్రోత్సహించిన అరవై ఏళ్ళ శ్రీహరికుమారి ఇందుకు చక్కని ఉదాహరణ.  


 గోడ దూకిన వాడేవడంటే ఆలు చచ్చిన వాడన్నట్లు చాలా మంది తండ్రులు తమ పిల్లల ళ్ళెదుట చక్కని మాదిరి కరమయిన జీవితాన్ని ఉంచలేకపోతున్నారు. పిల్లలకు కళ్ళు ఉంటాయి కానీ చెవులుండవ. తల్లి దండ్రులు పిల్లలకు ఎన్నో హితబోధలు చేస్తారు. కానీ వారు మాత్రం  పిల్లలకు చెప్పే నీతుల ప్రకారం నడచుకోరు. అందుకే పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రత్యక్షదైవాలుగా సేవించుకోలేక పోతున్నారు.

ల్లు కుండ ఇంట్లో నిలవపెట్టి రోజూ తప్ప తాగే తండ్రి ,సారాయి షాపు పెట్టిన తండ్రి, వ్యభిచార గృహాన్ని నడిపే తండ్రి, తల్లిని చితకబాది కొంగున దాచుకున్న రూకల్ని లాక్కెళ్ళి తాగొచ్చే తండ్రి, దొంగతనమే  వృత్తిగా గల తండ్రి, దున్నపోతులాంటి ఆరోగ్యమున్నా అడుక్కుతినమే అలవాటు చేసుకొన్న తండ్రి, లంచగొండి తండ్రి తన పిల్లలకు నీతులు బోధించగలడు?

చచ్చి దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళ క్రింద అన్నట్లు అనేక మంది పిల్లలను  సవతి తల్లులు  రాచి రంపా పెడుతున్నారు. రెండవ భార్యగా వస్తున్న స్త్రీ తాను తల్లి బాధ్యతను గూడా నెరవేర్చే సిద్ధపాటుతోనే రావాలి. కొత్త బార్య మోజులో పడి  మొదటి భార్య పిల్లల్ని ఆలనాపాలనా లేకుండా గాలికి వదిలేసే తండ్రిని ఏమనాలో మన పాఠకులయినా చెప్పి పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది.

గాడి కొడకా అంటే తమరు తండ్రులు మేము బిడ్డలము అన్నట్లు ఈ పిల్లలు కూడా సరయిన క్రమశిక్షణ, శీల సంపద లేకుండా పెరిగి అచ్చం ఆ తల్లిదండ్రులనే అనుకరిస్తున్నారు. కోతినిషయ్యాడని డార్విన్ చెబుతాడు. కానీ ఈ మనిషి మరో మహా మనిషిగానో, మనీషిగానో మారడంలేదు.మనిషి కంటే కోతి  నయం అనిపిస్తున్నాడు.

గుంటలో బిడ్డ, కడుపులో బిడ్డ అన్నట్లుంటుంది. కొందరి వ్యవహారం. పుట్టిన వాళ్ళందరినీ సరయిన రీతిలో పోషించుకురావటం, మంచి ఉపాధిని  సంపదను వారికి ఆ తల్లిదండ్రులు చక్కగా కల్పించాలి కదా. కానీ నారు పోసిన వాడు నీరు పోస్తాడని గాలికి వదిలేసే రకమే ఎక్కువగా ఉన్నారు. మన మధ్య. పది సంవత్సరాలు దాటక ముందే పిల్లల్ని కాయకష్టం చేయటానికి పంపుతారు.నారు పోసిన వాడు దేవుడు కాదు. మనిషే. నీరు పోయవలసింది కూడా మనిషే. నారు పోసిన వాడు నీరు కూడా పోస్తున్నాడా లేదా అని కనిపెట్టి చూస్తూ లెక్క అడిగేవాడే దేవుడు.

చేసేవి లోపాలు చెప్పితే కోపాలు. దైవ మార్గంలో చక్కగా జీవిస్తున్న బిడ్డలు తమ తల్లి దండ్రులకేదయినా చెబితే మాకే నీతులు చెబుతావా అంటారు. విపరీతంగా తాగి ఆరోగ్యం చెడగొట్టుకొని నలభయ్యేళ్ళకే ఒకతను చనిపోయాడు ఈ మధ్య. ఆరుగురు పిల్లలు, ఇంకా యవ్వనం గవని భార్య, ముదుసలి తల్లిదండ్రులు అనాధలయ్యారు. బ్రతికీబాధించాడు,చచ్చీ బాధించాడు. జీవితమొక వ్యాధి, నిద్ర ఉపశమనం, మరణమే ఆరోగ్యం అనే వైరాగ్య భావంలోకి అసమర్ధులు, బాధ్యతారహితులు జారుకొంటున్నారు. మరణానంతరం లెక్క అంటే నమ్మని వాళ్ళు, గేలి చేసే వాళ్ళు కూడా ఈ కోవలో ఉన్నారు.


2 కామెంట్‌లు:

  1. సాధారణంగా పేదరికంలో మగ్గుతున్న ఇళ్లల్లోనే ఇలాంటి పసిహృదయాలు ఎన్నొబాధలనుభవిస్తున్నారండీ రహంతు్లాగారు. చాలా బాగా రాసారు. వీరి జీవితాలు ఎప్పటికి బాగుపడాయో ?

    రిప్లయితొలగించండి
  2. అవును.పిల్లలపట్ల బాధ్యత లేనివాళ్ళు కనకపోవటమే పెద్ద పుణ్యం.అనాధలుగా వదిలెయ్యటం,వాళ్ళతో కఠినమైన చాకిరి ,బిక్షాటన చేయించటం...లాంటి పాపం ఊరికే పోదు.అది శాపమై సమాజానికి తగులుతుంది.

    రిప్లయితొలగించండి