తెల్లనిదీ తెల్లదే, నల్లనిదీ... తెల్లదే !
ఏడురంగులు కలిస్తేనే తెలుపు
ఏడురంగులు కలిస్తేనే తెలుపు
గీటురాయి 18-7-1986
“ శాయి శాయి
రామ శాయి కృష్ణ శాయి
అల్లా శాయి నానక్ శాయి
మౌలా శాయి గోవింద శాయి
ఏసు శాయి అయ్యప్ప శాయి “
అని బేగడ రాగం ఏకతాళంలో కీర్తనలు మోగిపోయే సమయంలో నేనుకూడా అదే ప్రాంతంలో ఉండటం తటస్థించింది. మొదట్లో ఈ గోల పట్టించుకోలేదుగాని కొంచెం నిదానంగా వింటే అల్లా పేరు గూడ శాయి నామంలో కల్తీ చేసినట్లు అర్ధమయ్యింది.
“ వలమ్ యకుల్ లహు కుఫువన్ అహద్ “ (అల్లాహ్ కు సమానుడు ఏ ఒక్కడును లేడు) అని రోజుకయిదుసార్లయినా మనం స్మరించుకుంటామే? మరి ఈ అల్లా శాయి ఎవరండీ? అని ఒక శాయి భక్తుణ్ని అడిగాను. రుద్రాక్ష పూసల దండను అవతల పడేసి నాకేసి విచిత్రంగా చూశాడు. అల్లా శాయి అంటే తెలియదా చిట్టి నాయనా ? ఆయన సాక్షాత్తూ అల్లాయే నాయనా ! అన్నాడు.
మరి పక్కన ఈ శాయి పేరేమిటి స్వామీ కొరుకుడు పడకుండాను ? అని అడిగాను. అల్లా యొక్క అవతారాలు ఎన్నని చెప్పను భాయి ! “ ఈశ్వర అల్లా తేరేనాం “ అని గాంధీగారంతటి వాడే గంట గంటకీ ధ్యానం చేశాడు గదా ! అల్లాయొక్క అసంఖ్యాకమైన పేరుల్లో “ శాయి “ కూడా ఒకటి నాయనా ! అన్నాడు. “ హిందూ ముస్లిం భాయీ భాయీ “ అంటూనే మరో ప్రక్క ముస్లిముల్ని పొడవటానికి ఇత్తడి త్రిశూలాలను పంచిపెడుతున్న వాళ్ళ సంగతి ఏమిటి స్వామీ అని అడిగాను. అదంతా వట్టి సైతాను చేష్ట నాయనా ! కులం మతం నాకు పట్టవు ప్రజలే నాకు దేవుళ్ళు “ అని సెలవిచ్చిన మన అభినవ వివేకానందుడు రామారావు గారిని చూచి వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి. ఆయన చూడు ముస్లిం సోదరులతో పాటు నమాజు కూడా చేస్తాడు. హైందవ అధ్యాత్మిక భావాలననుసరించి సన్యాసం, కాశాయం గట్రా ధరించాడు. మరి ఈ ఇత్తడి త్రిశూలాల వాళ్ళకు ఇదంతా చేతనవునా ? అదీ సంగతి. మానవులంతా దేవుని పిల్లలేననటానికి ఇంతకంటే మంచి ఆదర్శ పురుషుడు నీకు కనిపిస్తాడా ? భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేగదా ? అని ఎదురు ప్రశ్న వేశాడు.
నిజానికది భిన్నత్వంలో ఏకత్వమో ఏకత్వంలో భిన్నత్వమో బోధపడక ఎందుకు వచ్చిన గొడవలే అనుకొని ఇక నేనేమీ చెప్పలేక ఇంటి ముఖం పట్టాను. కిళ్ళీ కొట్టులో పేపరు వ్రేలాడుతోంది. “ ఈ నెల చివరికి ఆఫ్ఘనిస్తాన్ నుండి రష్యా సేనల నిష్క్రమణ? “ అనే హెడ్డింగ్ కనబడుతోంది. “ అమ్మేవాళ్లలో బుద్ధిమంతులు, కొనే వాళ్ళలో బుద్ధి హీనులు ఎక్కువ “ అనే సూక్తి వెంటనే గుర్తొచ్చింది. పేపరు కొనలేదు. ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోయాను. వేకువ జామునే భజన మొదలయ్యింది.
.... అల్లా శాయి, నానక్ శాయి ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి