1, ఆగస్టు 2012, బుధవారం

వైరస్ కు కారకములైన వేగుల వరాహములను వధింపుడు


వైరస్ కు కారకములైన వేగుల వరాహములను వధింపుడు

                 గీటురాయి   12-12-1986
అది తోట రాముడు ఏలే తెలుగు దేశము. అచట తామర తంపర వలె మెదడు వాపను విచిత్ర వ్యాధి దిన దిన ప్రవర్ధమానమై, వందలాది పసి బాలలను, పొట్టన పెట్టుకొను చున్నది. తెలుగు వైద్యులందరూ ఈ వ్యాధికి కారణమరసి చూడగా అది యొక విచిత్ర వైరసని తేలినది. ఆ వైరసు వరాహములలో నెదుగుచున్నట్లు దోమల ద్వారా వ్యాపించుచున్నట్లు తెలుగు వైద్యులందరూ నొక్కి వక్కాణించారు.

అందువలన ఈ వ్యాధి వ్యాప్తికి తెలుగు దోమలే గాక తెలుగు పందులు కూడా కారణమైనందున వాటిని నిర్మూలించి తీరవలెవని వారు పట్టుబట్టిరి. ఎందుకనగా వ్యాధి వచ్చిన తరువాత బెల్లడోన వేసి నివారించుటకన్నా వ్యాధి కారకములైన ఈ మూగ జీవములను నిర్మూలించుటయే మిన్న అని వారు భావించిరి.

తెలుగు దోమలను నిర్మూలించుట తన తరముగాదని తెలుగు అధికారులు గమనించిరి. దోమల వేటలో తమకున్న  సుదీర్ఘ అనుభవమును వారొకపరి యోచించిరి. తాము ప్రయోగించు విష ద్రవ్యములు, ధూమములు, దోమలకడ పనిచేయ లేదని వారు తేల్చి చెప్పిరి. తమ అసమర్ధతను ధైర్యముగా ఒప్పుకొనిరి.


దోమల పరాక్రమమును గూర్చి ఒక అధికారి వివరించగా, వాటి ఆయురారోగ్య విశేషములను గూర్చి మరియొక అధికారి నుతించెను. నేరస్తులను పట్టి చిత్రహింసలు పెట్టి చంపు పోలీసులకు సైతము దోమలను చంపుట చేతకాదని మరియొక ప్రతిపక్షి పరిహసించెను. చెవుల చుట్టుజేరి దోమలు వినిపించు సంగీతమునొక వ్యక్తి పొగడెను. అట్టి సంగీతము భువినందెవ్వనికిని సాధ్యము కాదని మురిసెను. వీధులలో సంధ్యలలో దోమలు గుంపులుగా నెగురుచు వివిధ భంగిమలలో జేయు విచిత్ర విన్యాసములను మరొక ప్రజా ప్రతినిధి పది నిమిషముల పాటు వర్ణించెను. సాంస్కృతిక వ్యవహారముల మంత్రి తాను భతనాట్యము నేర్చుకొనునట్లు దోమలే దోహదపడినవని వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఈ రీతిగా తెలుగు మంత్రులు దోమల పైన తమకున్న ప్రగాడమైన మమతానురాగముల నుగ్గడించిరి.

మంత్రులందరి అభిప్రాయములను విన్న తెలుగు ముఖ్యమంత్రి తన తలపాగను తీసి బల్లపై పెట్టి నిట్టూర్పు విడిచెను. ముఖ్యమంత్రి నోట మాటలు జాలువారునోయని మంత్రులందరూ చెవులు నిగిడించి నిశ్శబ్దముగా నుండిరి. ముఖ్యమంత్రి దీర్ఘముగా గాలి పీల్చి సభనుద్దేశించి మాటలాడలేచెను. కానీ క దోమ గాలితో పాటు ముఖ్యమంత్రి ముక్కులోన జొచ్చి నాట్యమాడసాగెను. సభలో ప్రసంగారంభములోనే ముఖ్యమంత్రి తుమ్మెను. అయిననూ అది తెలుగు దోమయేగనుక సరియ సరియ అనెను. ఏఆంగ్ల దోమయో, హిందీ దోమయో అయిన దానిగతి ఏమయ్యెడిదోనని కొందరు గుసగుసలాడిరి. ముఖ్యమంత్రి గంభీర స్వరముతో ఉపన్యాసము మొదలుబెట్టెను.

సభాసదులందరికి నా నమస్కృతులు. ఇంతదనుక సోదరులందరూ తెలుగుదోమల ఘనతను గురించి చెప్పినది నిజము. ఆంగ్ల, తమిళ,యాళ, కన్నడ, హిందీ మొదలైన సమస్త దోమల కంటే తెలుగు దోమలు విశిష్టమైనవని చెప్పుట వారు మరచినారు. నిజముగా తెలుగు దోమలు సారే జహాసే అచ్ఛా అనుటలో సందియమించుకయైనను లేదు. అట్టి తెలుగు దోమలు మెదడు వాపునకు కారణమని చెప్పిన నమ్ముటకు వీలులేదు. తెలుగు ప్రజల మెదడు వాయకుండునట్లు శిరస్త్రాణములను ధరించవలసినదిగా వాహనములు నడుపువారికి ఆజ్ఞలిచ్చియుంటిమి. అటులనే ఇతర తెలుగు ప్రజలు నావలెనే పాగాలు చుట్టి తలలను రక్షించుకొనవలయునని కోరుతున్నాము .

ఆరోగ్యమంత్రి అన్నకు అడ్డు తగిలి ఈలాగనెను: అన్నా! భాగ్యనగర దోమలు పందులను కుట్టిననూ అసలు మెదడువాపు వైరస్ ను వ్యాపింపజేయలేవు. ఈ దోమలు హస్తినాపురమునుండి ఇక్కడికి దొంగచాటుగా వచ్చి యుండ వచ్చును. ఈ మధ్య ఈ రెండు నగరముల మధ్య మన ప్రత్యర్ధులు విపరీతముగా ఆకాశయాము చేయుచున్నారు. వారు తమ వెంట పెద్ద పెద్ద మూలు కూడా తెచ్చుట మన వేగులవారు గమనించిరి .

ఇది వినిన ముఖ్యమంత్రి కనుబొమ్మలు చిట్లించి ఆ.. అర్ధమైనది. హస్తినాపురి పెద్దల ప్రయోగమర్ధమైనది. దీనిని మన మెటులైనను నిరర్ధకము చేయవలెను. హస్తినాపురి దోమలను మనము కనుగొనలేదు. ఎందుకనగా అవి తెలుగు దోమల వేములను వేసికొనియున్నవి. అందువలన వాటికి వైరసునందించుచున్న పందులను సంహరించిన ఎడల వాటికి ఆహారము అందక అవి తిరిగి హస్తినకు మరలిపోవును.

ఇది వినిన వార్తాహరులు అవి తెలుగు పందులుగాదా ఎలా చంపెదరు స్వామీ?” అని అడిగిరి.

అయిననూ కానిండు. హస్తినాపురి దోమలు వచ్చి కుట్టుచుండగా కుట్టనిచ్చుట దోషము కాదా! తెలుగేతర దోమలకు వైరసు నందించి తెలుగు బాలల చావునకు కారణమగుట క్రమశిక్షణా రాహిత్యము గాదా ? నా పరిపాలనలో తెలుగు ప్రజలేకాదు, తెలుగు పశు పక్ష కీటకాదులు సైతం క్రమశిక్షణను పాటించి తీరవలయును. హస్తినకు దాసోహమనిన నాదెండ్ల కేమయ్యెనో మీరెరుగరా? ఆయుధములు చేబూని చైనావారి సిద్ధాంతములను ప్రచారము చేయుచున్న నక్సలైట్లు ఏమగుచుంటిరో మీరెరుగరా ? రాత్రిపూట రహదారులలోనికి రావద్దని చెప్పినా వచ్చుచున్న సోదరీమణులు ఎక్కడికి చేరుచుంటిరో మీరెరుగరా? అటులనే ఈ తెలుగు పందులు కూడా... ఛీ ఛీ... ఈ వేషధారి పందులు కూడా చావవలసినదే. మంత్రులారా! తదుపరి కార్యక్రమము చేపట్టుడు. నక్సలైట్ల వేటలోనున్న

       రక్షక భటులను అవసరమైనచో తాత్కాలికముగా ఈ పందుల వేటకు        రప్పింపుడు. నిజమైన తెలుగు పందులు నివాసములలోనే ఉండును.       వీధులలో తిరుగునవే వేగుల పందులని గమనింపుడు. త్వరితముగా వీటిని     సంహరింపుడు అని ముఖ్యమంత్రి తన ప్రసంగము ముగించి వెళ్లిపోయేను.

              ఎరుకలవాడైతేనేమి గురిగలవాడే మొనగాడు. పందిని పొడిచినవాడే       పార్ధుడు. పందిని పట్టియిచ్చిన వాడే ఉపపార్ధుడు అని పోలీసుల్ని      పొగిడిరి. శతాధిక వరాహ సంహార లాంటి బిరుదులు ప్రధానం చేసిరి.        పందికొక పాయింట్ లెక్కన పారితోషికములు కూడా నిచ్చిరి.

              కానీ ఈ వేటకు బ్రేకుపడెను. ఎరుకలవాళ్ళ సంఘం మా పొట్ట   కొట్టొద్దు బాబో అని హైకోర్టు కెళ్ళెను.ముఖ్యమంత్రి మళ్ళీ ఇరకాటములో      పడెను. హస్తినా తొత్తులయిన న్యాయస్థానములు మా కాళ్ళకు చేతులకు అడ్డుపడుచున్నవి. మేముచేయు సత్కార్యములవి చేయనీయకున్న విగదా? అకటా ! కటకటా !! యని దిగులుచెంది దీర్ఘశ్వాస వదిలెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి