23, ఆగస్టు 2012, గురువారం

సం’కుల’ సమరం


సంకుల సమరం
                                
                    గీటురాయి  19-6-1987
             
              రెండేళ్ళ క్రితం రజక చక్రవర్తులంతా కలిసి రామారావుని బెదిరించి     తమను షెడ్యూల్డు కులాల జాబితాకెక్కించేలా రాజీవ్ గాంధీకి సిఫారసు   చేయించుకున్నారు. వెనుకబడిన కులాల లిస్టులో వీళ్ళది 35 వ కులం. మరి వీళ్ళకు మొదటి నుండీ ప్రధాన ప్రత్యర్ధులుగా ఉంటున్న నాయీ బ్రాహ్మలది అదే లిస్టులో 26 వ కులం. అంటే దాదాపు 9 కులాలు మరింత వెనుకబడిన కులాలన్నమాట.  

              చాకలి వాళ్ళంతా చక చకా పైకెక్కి పోతుంటే మంగలి వాళ్ళంతా చూస్తూ ఊరుకోవలసిందేనా? పెట్టండి మహాసభ! పట్టండి మంత్రుల జుట్టు!అంటూ మహోద్రేకంతో వచ్చి పడ్డారు మహానగరానికి. ఆంధ్ర మహా భోజుడి ఇంటికి వెళ్ళి మహాజరు సమర్పించారు. మమ్మల్ని కూడా చాకలి  వాళ్ళలాగానే చండాలపు కులాల్లో, ఛఛ షెడ్యూల్డ్ జాతుల్లో, తు తు షెడ్యూల్డ్   కులాల్లో చేర్పించండి అని.

                   అడిగిన వాళ్ళకు లేదనకుండా వరాలిచ్చే అన్న అడ్డం చెప్పకుండా    ఆమోదించాడు. ఢిల్లీకి సిఫారసు చేశాడు. రాజీవుడు భోజనం కూడా మాని  బెంగపెట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రామారావు తప్పు ఏమీ లేదు. శనగలు తిని చెయ్యి తుడుచుకున్నట్లుగా సిఫారసైతే చేసి చేతులు  దులుపుకున్నాడు. చాకలి వాళ్ళను మంగలి వాళ్ళను రాజీవయ్య మీదికి తోలి రామారావు రాగాలు తీస్తున్నాడు. దొరక పుచ్చుకుని ఉతికే వాళ్ళొకరయితే సుబ్బరంగా షేవ్ చేసే వాళ్ళు మరొకరు. రాజయ్యకు దారేది?

              మధ్యలో మసాలా ర్రన్న లేచి వీరిద్దరి కళ్ళల్లో మసాలా  కొడుతున్నాడు. ఒక రకంగా ఈ రెండు కులాల వాళ్ళ నోళ్ళల్లో జాతీయ రహదారిలో దొరికే దుమ్ము కొట్టాలని చూస్తున్నాడు. ఆయన వాదన        ఏమిటంటే ఈ చాకలోళ్ళు మాల మాదిగల బట్టలు ఉతకరు. ఈ  మంగలోళ్ళు మాల మాదిగల తలలు గొరుగరు. ఇం సుపీరియారిటీ  కాంప్లెక్స్ తో బాధపడుతున్న వారిని మాలో చేరిస్తే వాళ్ళ రోగం మాకు   కూడా అంటుకోదా? మా ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎగిరిపోదా? అసలు  మేమంతా ఒకటైపోయి ఒకరిని ఒకరు గుర్తించగలమా? టాట్, వీళ్ళను  షెడ్యూల్డ్ కులాల్లో చేర్చటానికి ఎంత మాత్రమూ వీలు లేదు అని.

              ఈ రభస అంతా ఒకవైపు జరుగుతూనే ఉంది. మరో వైపు షెడ్యూల్డ్   కులాల్లో చేరాలని అత్యాతో ఉన్న కులాల వాళ్ళంతా విడివిడిగా  సమావేశాలు జరుపుతున్నారు. వీళ్ళంతా వెనుకబడిన తరగతుల       జాబితాలోని వాళ్ళే, మరి వీళ్ళందరినీ వదిలిపెట్టి కేవలం చాకలోళ్ళకు, మంగలోళ్ళకు మాత్రమే సిఫారసు చేసిన అన్నగారి విజ్ఞానం విచిత్రంగా  ఉంది.

              చిచ్చాయ చిచ్చాయ అంటే సందాసందాయ అన్నట్లు ఈ కులాల వాళ్ళంతా తలావక చెయ్యి వెయ్యకమానరు. ఇవ్వాళ విశ్వబ్రాహ్మలు కూడా వచ్చి ఇదే కోరిక కోరితే ఇంకేమన్నా ఉందా? అసలు దేశమంతా  షెడ్యూల్డ్  కులాల జనమే అయిపోతారు. ఇక నూటికినూరు శాతం రిజర్వేషనే అని   అంబేద్కర్ సంఘం వాళ్ళు అరుస్తున్నారు. గోంగూరలో చింతకాయ వేసినట్లుగా, గోకి దురద తెచ్చుకున్నట్లుగా, గోచీ విప్పి పాగా చుట్టినట్లుగా ఉంది ఈ కులాల వ్యవహారం అంతా. ఇదంతా చాలదన్నట్లు సంక్షేమ శాఖ  డిప్యూటీ మంత్రి గిరిధారి గోమాంగో రాజ్యసభలో ఓ దివ్య సిద్ధాంతం సెలవిచ్చారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి పిల్లలకు వారి తండ్రి   కులమే సిద్ధిస్తుందట. అయితే తల్లి షెడ్యూల్డు కులస్థురాలై తండ్రి అగ్రకులస్థుడై ఆమెను వదిలిపెడితే పిల్లలు అగ్రకులస్థులు కాలేరట.నందిని  చెయ్యబోయి పందిని చేసినట్లు ఈ నాయకులు కుల నిర్మూలన కోసం ఒక    పక్క గొంతులు చించుకుంటారు. మరో ప్రక్క కులాలను నిక్కచ్గా  నిర్మొహమాటంగా విడదీసి పాలిస్తుంటారు.




             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి