1, ఆగస్టు 2012, బుధవారం

భాగ్యనగరం దుస్థితి


భాగ్యనగరం దుస్థితి
                      ఆంధ్ర పత్రిక 22-12-1986
       తెలుగుదేశ రాజధాని నగరం ఈనాడు పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నది. కేవలం 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల హైదారాబాద్ జిల్లాలో 1981 జనాభా లెక్కల ప్రకారం 22 లక్షల 60 వేల మంది కిక్కిరిసి నివసిస్తున్నారు. 1985 అంచనా ప్రకారం జంట నగరాలలో 30 లక్షల జనాభా వుంది. అంటే చదరపు కిలోమీటరు భూమిమీద 13825 మంది నివసిస్తున్నారు. 35 వార్డులు, 100  డివిజన్లలో 15 లక్షల 26 వేల ఓటర్లు ఉన్నారు.

       ఉత్తరాన బొలారం, దక్షిణాన ఫలక్ నుమా, తూర్పున ఘటకేసర్, పడమట సనత్ నగర్ లను అంచులుగా తీసికొంటే ఈ పట్టణం 40 కిలోమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంది. వేలాది జనం కిక్కిరిసిన బస్సుల్లో పట్టణంలోకి వస్తూ పోతూ ఉంటం మనం చూస్తూ ఉంటాము.

ప్రస్తుతం ఎనిమిదిన్నర లక్షల మంది ప్రజలు 695 మురికివాడల్లో నివసిస్తున్నారు. అంటే మొత్తం జనాభాలో మూడున్నరవంతు జనం మురికి వాడల్లోనే ఉన్నారు. మామూలు వాడల కంటే మురికివాడలే ఎక్కువగా ఉన్నాయి. 1990 సం || లోగా 30 వేల ఇళ్ళు నిర్మించాలని ఒక ప్రణాళిక అయితే ఉంది గానీ అది అనుకొన్నట్లుగా పూర్తి అవుతుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా మురికివాడల్లో ఉంటున్న మూడు లక్షల కుటుంబాలకు 30 వేల ఇళ్ళు ఏ మూల కబురు అంటున్నారు. అవి కట్టి ఇచ్చేది గూడా మరో మూడేళ్ళలోన! మురికివాడల జనసంఖ్యలో దేశంలో హైదరాబాదు అయిదవది.

హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాల మీద 33 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేస్తున్నది. (1985-86) ఇందులో 14 కోట్లు (42 శాతం) ఉద్యోగుల జీతభత్యాలకు పోతున్నది. ఈ నగర డ్రైనేజి వ్యవస్థను 1931 కీ||శే మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు రూపొందించారు. అది కేవలం లక్షలమంది అవసరాలను తీర్చగలదు. కానీ ఇప్పుడు అంతకు ఆరురెట్లు జనం పెరిగారు. అందుకు తగినట్లుగా డ్రైనేజి వ్యవస్థను మెరుగు పరచలేదు. మాన్ హోల్స్ లో పడి చిన్న పిల్లలు మరణిస్తున్నారు. దోమల బెడద విపరీతంగా పెరిగి పోయింది. మూసీనదికి రెండు ప్రక్కలా ఒక కిలోమీటరు ప్రాంతలో దోమలదాడి తీవ్రంగా ఉంటుంది. నగరమంతటా దోమల పెంపకం జరుగుతున్నదా అనిపిస్తుంది. 400 మంది ఉద్యోగులు 85 దళాలుగా ఏర్పడి దోమల సంహార కార్యక్రమంలో పని చేస్తున్నారు. కానీ దోమల నిర్మూలన జరుగలేదు. ఈ ఏడాది ఈ కార్యక్రమానికి 42 లక్షల రూపాయలు కేటాయిస్తే అందులో సిబ్బంది జీతాలు 36 లక్షల రూపాయలు అంటే కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే దోమల మీదకి వెళుతున్నాన్న మాట !

మూసీ నది ఒడ్డున పశువుల మేత కోసం గడ్డి పెంచుతున్నారు. జంట నగరాల్లో 400 పశువుల ఫారాలున్నాయి. ఇక్కడ దోమలు వృద్ధి అవుతున్నాయి. కార్పొరేషన్ దోమలను చంపే మందు చల్లవలసిందిపోయి, వాటిని పారద్రోలే పొగను వీధుల్లో చిమ్ముతున్నది. అందువలన దోమలు కొంతదూరం పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయి. 1929 నుండి దోమల నిర్మూలన కార్యక్రమం కొనసాగుతున్నా ఈనాటికీ ఈ కార్యక్రమం విజయవంతం కాలేదు.

ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దాంతానికి రాజధాని నగరంలో నివాసం నరకసమానం అవుతుంది. రాజధానివాసులు పలురకాల రోగగ్రస్తులు కావటం తధ్యం. ప్రభుత్వం ఈ క్రింది సూచనలను పరిగణనలోకి తీసికొని ఆచరణలోకి తెస్తే హైదరాబాదు బాగుపడగలదు : -

·                   బొలారం, సనత్ నగర్, ఫలక్ నుమా, హయాత్ నగర్, ఘట కేసర్ లను కలుపుతూ సర్కులర్ రైల్వే లైను వేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్పించాలి.
·                   నగరంలోని డైరీ ఫారాలను, కోళ్ళ ఫారాలను, నగరం వెలుపలికి తరలించాలి. దోమలను చంపే మందు మాత్రమే క్రమం తప్పకుండా చల్లాలి.
·                   నగరం లోపల ఉన్న పరిశ్రమలను వెంటనే బయటికి తరలించాలి. రోడ్లను వెడల్పు చేసి సిటీ బస్సుల సంఖ్య పెంచాలి. వివిధ కాలనీ నుండి కూడలి ప్రదేశాలకు షటిల్ సర్వీసులు వేయాలి.
·                   ఉద్యోగులకు ప్రభుత్వం క్వార్టర్లను కట్టించి అద్దెకు మాత్రమే ఇవ్వాలి. ఇళ్లను స్వంతగా ఇచ్చివేయరాదు. వారు రిటైర్ కాగానే వారి వారి మండల కేంద్రాలలోనే ఇళ్ళు కట్టించి ఇచ్చి వారిని నగరం నుండి పంపివేయాలి.
·                   మురికివాడల లోని ప్రజలను పల్లెలకు తరలించి వారికి తగిన పనిని అక్కడే కల్పించాలి. యాచకులను, అనాధలను పట్టుకొని వారిని అనాధాశ్రమాలకు వృత్తిశిక్షణా కేంద్రాలకు పంపించాలి.
·                   రాష్ట్రంలో నాలుగుచోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వోద్యోగులను రాజధాని నుండి తరలించాలి. శిఖరాగ్ర పనులకవసరమైన సిబ్బందిని మాత్రమే  నగరంలో ఉంచాలి.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి