1, ఆగస్టు 2012, బుధవారం

భారత గృహిణిని కాదమ్మా నేను భీతాహరిణిని


భారత గృహిణిని కాదమ్మా నేను భీతాహరిణిని
                                 గీటురాయి    19-12-1986
          రాముడు కాడమ్మా నిందలు నమ్మడు
       కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు
       నువు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు
       నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు
       ఏమని వర్ణించను ?”

       అని అమ్మాయికి రాబోతున్న భర్తను గురించి సకల విధాలా నచ్చజెప్పవలసిన రోజులొచ్చాయి. పోయిరాగమ్మ జానకీ  అని కళ్ళ నీళ్ళు ఆపుకొని పళ్ల బిగువున అమ్మాయిని ఆత్తవారింటికి పంపిస్తున్నారు గాని, ఏ ఉరిత్రాడో, కిరసనాయిలు డబ్బానో, లోతైన నుయ్యో అమ్మాయికోసం ఒకవేళ ఎదురు చూస్తున్నాయేమోనని అమ్మా బాబుకు ఎంత ఆదుర్దాగా ఉందో చెప్పలేము.

       ఆలయన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
అని భార్యను దైవ సమానంగా చూసుకొనే పిచ్చి మారాజుల కాపురాలు బాగానే సాగిపోతున్నట్లు ఒక సర్వేలో వెల్లడయ్యింది. అయితే మొగుడొల్లక ముప్పైఏళ్ళు, ఆలొల్లక అరవై ఏళ్ళు, బాలప్రాయం పదేళ్ళు, నిక్షేపంలాంటి నూరేళ్ళు ఏకాకుల్లాగా వెళ్ళదీసే జంటలు గూడా ఎక్కువగానే ఉన్నట్లు వెల్లడయ్యింది.

       సతిపతిపోరే బలమై
       సతమతమాయెను బతుకే
అని కొందరు నిత్యమూ పోరుకాపురం చేస్తుంటారు. మరికొందరేమో నీదారి నీది నాదారి నాది చల్ మోహనరంగా అని వేరొకచోట కూర్చుని చేరదీసి సేవచేసే తీరూ కరువాయే నీదారేవేరాయేఅని విలపిస్తూ ఉంటారు. లేనిది కోరేవు ఉన్నది వదిలేవు. ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే అని తమ తిక్క బుద్ధిని తిట్టుకొంటూ చెంప లేసుకొంటారు కొందరు.

       మొదటి పెళ్లి అవసరం, రెండో పెళ్లి అవివేకం, మూడో పెళ్లి అపస్మారం అన్నారు వెనుక ఎవరో. పెళ్లి మీ పెళ్లి చేసుకుంటూ ట్నారోహణ పర్వం పూర్తిచేసేవాళ్ళు కొందరు. ఈ మధ్యలో సవతులపోరు, సవతి బిడ్డలపోరు పెద్ద యుద్ధకాండ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అత్త,పడుచులపోరు మరొక ఎత్తు. భర్త భార్యకు అనుకూలవంతుడై యున్నప్పటికీ లేనిపోని చాడీలు చెప్పి వారిమధ్య చిచ్చురేపే వాళ్ళున్నారు. భంగు తాగేవాడికి హంగుగాళ్ళు పదిమంది ఉన్నట్లు కోడలిపిల్లను కోసుకుతినటానికి ఇంటిల్లిపాదీ సిద్ధంగా ఉంటుంది. భర్త అర్ధనిమిలినేత్రుడై ఈ కోత పనిని ఇంట్లో వాళ్ళకు అప్పజెపుతాడు.

       బాగుపడదామని పోతే బండ చాకిరీ తగులుకున్నట్లు ఏ డాక్టరో ఇంజనీరో దొరికాని భ్రమసి ఇంటావిడలైనవారు వంటావిడలు అంట్లావిడలు అవుతున్నారు. కాసింత కట్నం ఎక్కువిచ్చైనాసరే గొప్ప వారివియ్యమే అందుకోవాలని ఆడ పిల్లలూ వాళ్ళ తల్లిదండ్రులూ ఆశిస్తున్నారు. కానీ ఎంతచెట్టుకంగాలి అన్నట్లు ఎంత కట్నానికి అంత సత్కారం తప్పదేమో! ఉబుసుపోకపోతే మీరూ ఆలోచించండి.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి