ఓ సన్యాసీ!
గీటురాయి 21-8-1987
“అబ్బమేలోర్వలేనట్టి వాడైనను,
మోహంబుగల తల్లి మూగదైన,
ఆలి రాకాసైన అల్లుడు పగవాడైన,
కూతురు పెను రంకుబోతుదైన,
కొడుకు దుందుడుకైన, కోడలు దొంగైన,
తనకు సాధ్యుడుగాని తమ్ముడైన,
గృహకృత్యములు పొరుగిండ్ల వెంబడిపోయి,
చెప్పి ఏడ్చేడి చెడ్డ చెల్లెలైన,
నరుని ఖేదంబు వర్ణింపతరముగాదు,
అంతటను సన్యసించుటయైన మేలు”
అని ఓ కవి నిరాశపడిపోతాడు ఇంట్లో జనమంతా అలాంటి వాళ్లయితే తానొక్కడే మంచి వాడైనట్లు ఫీలయ్యాడు బాగానే ఉంది. ఎలాగోలా తట్టుకొని ధర్మ మార్గంలో నిలబడి వారికి కనువిప్పు కలిగించాలిగాని సన్యసిస్తే ఏమౌతుంది?ఏమొస్తుంది? అసలు అలాంటి బంధువర్గంలో బ్రతకటం మంచివాడికి కష్టమే. మంచివాడికి కాకపోతే మరెవరికొస్తాయి కష్టాలు? కాసే చెట్టుకే గదా రాళ్ళదెబ్బలు? లాంటి మాటలతో సముదాయించి, మార్గానికి తెచ్చి సంసార సాగరాన్ని ఈడ్చే స్థయిర్యాన్ని కలిగించాలిగాని సన్యాసం పుచ్చుకోమని సలహా ఇస్తే ఎలా? మరో కవి అయితే సన్యాసం కాదురా బాబూ నేరుగా స్వర్గానికే చేరుకో నీ పుట్టుక వ్యర్ధం అంటాడు. ఆత్మహత్యకు పురికొల్పుతాడు చూడండి: -
“తల్లి బందెలమారి, తండ్రి అప్పులముచ్చు,
ఙ్ఞాతి బహుద్వేషి, భ్రాత కోపి,
మరదలు బహుదండి, మామగారవివేకి,
అత్త దుర్గుణ, గణాయత్తబావ,
మరిది తంతరగొట్టు మనిషి, కోడలు మంకు,
భార్య గయ్యాళి నిర్భాగ్యురాలు,
చెల్లెలు కడుదొంగ, అల్లుడుకూళ,
పుత్రుడు దుర్ణయుడు, కూతురు పిశాచి ,
అందరికి పెద్ద దుర్మార్గుడరయ తాను,
అట్టి పురుషాధముని జన్మమెందుకొరకు?”
మనిషి జన్మించింది ఎందుకో, మనిషి బ్రతుక్కి పరమార్ధం ఏమిటో అసలీ జీవిత ఉద్దేశమేమిటో కొంచెం సీరియస్ గా ఆలోచిస్తే అర్ధం అవుతుంది. కానీ నిరాశారోగ పీడితులు, నిర్భాగ్యదామోదరులు, సంఘవిరక్తులు అయిన కవులు, సన్యాసులు, తపస్సంపన్నులనే పేరుతో కొండ గుహల్లో, దండకారణ్యాలలో దాక్కున్నవారు ఇలాంటి ఆలోచనలకు తావీయడం లేదు. బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్...” లాంటి చచ్చువేదాంతంతో, చేతకాని తనంతో, అయోమయంలో పడవేసే ఋషితుల్యులు తయారయ్యారు. ఈ విరక్తివాదుల వల్ల వెన్నెముకలేని, కష్టాలు సహించలేని, ఇరవైలోనే అరవై ఆవహించినట్లున్న జనం ప్రబలుతున్నారు. ఛార్మినార్ మీద నుంచి చింతచెట్ల మీద నుంచీ దూకి చస్తున్నారు. బాధ్యతలను పక్క వాళ్ళ మీదికి నెట్టి ‘తప్పించుకు తిరుగువాడు ధన్య్దుడు’అనుకుంటున్నారు. బాధ్యతలు బలవంతంగా
మెడకు తగిలిస్తే బ్రతుకుబండిని ఈడ్చలేని చవటలమంటూ విలపించి అఘాయిత్యాలకు తలపడుతున్నారు. కుటుంబాన్ని విడిచిపెట్టి కాటికి పోదామనుకొంటున్నారు., చచ్చేంత సాహాసం లేనివాళ్ళు సన్యాసులై అడుక్కు తింటూ సంఘానికి బరువై కూర్చుంటున్నారు. సన్యాసి కావటం ఈజీయేగానీ చద్ది ఎలా వస్తుంది? నాలుగిళ్ళు తిరిగాలి, ‘దేహి’ అని అడుక్కోవాలి. పెట్టేవాళ్ళు పెడతారు, తిట్టేవాళ్ళు తిడతారు. అన్నీ పడాల్సిందే.
చావాలని సన్యాసం పుచ్చుకుంటే గంతా బొంతా అంతా కలిపి గాడిదమోతంత అయ్యిందట. ఈ మోతకంటే ఆ మోతే బాగుందని తిరిగి సంసారిగా మారిన సన్యాసి కథను ఈ నిరాశావాదులు చదవాలి. ఒక సన్యాసి తన గోచీనీ కొరుకుతున్న ఎలుకను చంపటానికి పిల్లినీ, పిల్లి పాల కోసం ఆవును, ఆవు మేత కోసం పనిమనిషినీ.. ఇలా ఇలా అప్పాయింట్ చేస్తూ పోయి చివరికి సంసారి అయిన వైనాన్ని ఈ దరిద్ర దామోదరులు దృష్టిలో ఉంచుకోవాలి. పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు. మరి గిట్టేకాలం వచ్చే దాకా ఓపిక పట్టకపోతే ఎట్లా? ఇంట్లో వాళ్ళంతా విరోధులయ్యారని విసుక్కుంటూ, చెడ్డవాళ్లయ్యారని చీత్కరిస్తూ, ఛలో ఛార్మినార్ అనటమో, సన్యాసి కావటమో చెయ్యకుండా వీరునిగా, సద్ధర్మశీలునిగా, సంస్కర్తగా, సహనశీలిగా మారటం మంచిది. మనకొచ్చే బహుమతి దేవుని వద్ద నుండి వస్తుంది గనుక చాలా సిద్ధ పాటుతో స్వీకరించాలి. అందుకు సదా సిద్ధంగా ఉండాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి