10, ఆగస్టు 2012, శుక్రవారం

పప్పు కూటికి ముందు, వెట్టిమూటకి వెనుక...


పప్పు కూటికి ముందు, వెట్టిమూటకి వెనుక...
                               గీటురాయి 22-5-1987
             
              పకపకా నవ్వేవాడు, గబగబా అరిచేవాడు, కపటమెరుగడు అని    సామెత. ఆరుకోట్ల ఆంధ్రుల అన్నగారి విషయంలో ఇది నిజమేననిపిస్తున్నది. ఏదో ఉద్రేకంలో అరుస్తాడు, కేంద్రం మీద పిచ్చికోపంతో కాసేపు ఊగిపోతాడుగానీ, మరుక్షణంలోనే అతి అమాయకుడి లాగా జావగారిపోతాడు. పడిలేస్తేగాని పాతరలోతు తెలియదన్నట్లు పడటంలేవటం ఈయనగారికి రోజూవారీ కార్యక్రమంలాగా తయారయ్యింది.
             
              అసలు ఆయనంతట ఆయన పడేవాటి కంటే, కాంగ్రెస్ వాళ్ళు ఆయన కాళ్ళకు పెడుతున్న అడ్డాలవల్ల ఎక్కువగా పడుతున్నాడు. పప్పుకూటికి ముందు, వెట్టి మూకు వెనుక వెళ్ళే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఈయన  ఖర్మ ఏమోగాని నెత్తికి వెట్టి మూ తప్పటం లేదు. కాసు బ్రహ్మానందరెడ్డి  టైంలో నగరానికి నీళ్ళు తెచ్చే విషయమై శ్రీనివాసరావు కమిటీని వేశారట. ఆ కమిటీ రిపోర్టు ఏం చేశారని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అన్నను నిలదీస్తున్నారు. ఆయన తెలివంతా ఏమైపోయిందో గాని బ్రహ్మానందరెడ్డి తరవాత అంత మంది ముఖ్యమంత్రులొచ్చారు గదా, వాళ్ళనెవర్నీ ఇలా  అడగకుండా నన్ను ఘోరావొ చేయటానికొస్తారేమిటి?” అని  అడగలేకపోతున్నాడు.నేనేమన్నా దేవుడినా వాన కురిపించటానికి? అనలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకు ప్రజలే దేవుళ్ళ. ఆ దేవుళ్లే తాగటానికి నీళ్ళు లేక ఈ పెద్ద దేవుడి కాళ్ళు పట్టుకుని పడలాగుతున్నారు. పాత వేశ్య వీరమాత అయినట్లు కాంగ్రెస్ వాళ్ళంతా ఈయన పాతివ్రత్యాన్ని శంకిస్తున్నారు.

              పాలకోసం పొదుగు కోసినట్లు కృష్ణా నది నీళ్ళే తెమ్మని కాంగ్రెస్  వాళ్ళు అడుగుతున్నారు గాని గోదావరి నుంచి తే అనే మాటే వారి నోటివెంట రావటం లేదు. మళ్ళీ వాళ్ళే ఏం చేశారంటే, రెండు ముఠాలుగా  చీలి, కృష్ణకు అటు పక్క ఒకళ్ళు ఇటు పక్క ఒకళ్ళు నిలబడ్డారు. ఇక్కడ   తాకావా, చచ్చావే అంటున్నారు. ఈయన తలుచుకుంటే నీళ్ళు రానీ  రాకపోనీ ముందు కాలువ మాత్రం తవ్వేస్తాడు అని వారికి తెలుసు. అందుకే    అగ్రనాయకులంతా తవ్వు తవ్వు అని తొందర జేస్తే ఎక్కడా నువ్వు తవ్వేది?” అని మామూలు నాయకులంతా మిర్రి మిర్రి చూస్తున్నారు.   పైనబడి కొరకబోతున్నారు. దీనికి తోడు ఇంజనీర్లు కూడా కృష్ణ నుంచే  తవ్వుకురా అని సలహా ఇచ్చారు. నూతిలో పడతావా పాతరలో పడతావా ? అన్నట్లు అయ్యింది అన్నగారి పరిస్థితి.
             
              తెలుగు సమాచారం అనే పక్షపత్రిక విషయంలో కూడా ఇంతే. అసలు  ఈ తెలుగు అనే పదమే కాంగ్రెస్ వాళ్ళలో కసి పెంచుతున్నది. మాంసం తింటున్నామనటానికి సూచనగా ఎముకలు దండగుచ్చి మెడలో వేసికునే రకం అన్న.ఆయన ప్రారంభించిన పథకం అని అందరికీ తెలవాలని వాటికి ముందు తెలుగు అని ఉంచుతున్నాడు. సొంత డాబ్బా కొట్టుకోవటంలో కాంగ్రెస్ వాళ్ళది మరో దారి. తెలుగు-వెలుగు అని తెలివి తక్కువ పేర్లు వాళ్ళు పెట్టలేదు. వాళ్ళ పథకాలన్నీ లోక సంక్షేమం కోసమే అన్నట్లుంటాయి.
      
              సమాచార పౌర సంబంధాల శాఖను ఎమర్జన్సీ రోజుల్లో యమ వాడుకున్నారు. ఎమర్జన్సీని సమర్ధిస్తూ ఆ శాఖ ద్వారా స్తోత్రపాఠాలు   ప్రకటించారు. ఆ శాఖ కొన్ని వందల పుస్తకాలు (ఇందిరాస్తుతి)  వెలువరించింది. 1976 మే లో కొత్త లోకం అనే పుస్తకంలో ప్రఖ్యాత    తెలుగు కవులు రచించిన ఇందిరమ్మ కీర్తనలు ఉన్నాయి.

క్రొత్త ఇజం పాత నిజం
ఇందిరా ఇజం, ఇండియా ఇజం
పాంచాలీ  పరాభవం నాటి
శ్రీకృష్ణావతారం ఇందిరాయిజం

              జై ఇందిర, విజయేందిర
               జై భారత హృదయేందిర
               జై భారత రథసారథి
               జై మహిషాసుర మర్ధని

              యమర్జన్సీ తర్వాత ఎన్నికలే ఈ కవులకు కనువిప్పు కలిగించి ఉంటాయనుకున్నాను. ప్రస్తుతం వీళ్ళంతా రామారావును తిట్టిపోయటమే   జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి