ఛాన్స్ ! లక్కీఛాన్స్ ! గీటురాయి 30-1-1987
“ బలే ఛాన్సులే బలే ఛాన్సులే
లలలాం లలలాం లక్కీ ఛాన్సులే
ఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవించితే తెలియునులే “ || బలే ||
అని ఇల్లరికం పోయిన అల్లుడు తనకు పట్టిన అదృష్టయోగాన్ని తలుచుకొని ఉబ్బితబ్బిబ్బయిపోతాడు. పైగా ఛాన్సు కోసం కాచుకొని కూర్చుని కొట్టేయ్యాలంటాడు. అత్త మామలకు ఒక్కటే కూతురైతే, జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వ్రేళ్ళాడమంటాడు. ఎందుకంటే ఆ అత్తామామలు హరీ అంటే ఆస్తి మనకే గదా దక్కేది. వెదవల్లారా అని
జ్ఞానోపదేశం చేస్తాడు. అనేక విషయాలలో మనకు ఛాన్సులు వస్తుంటాయి గాని ఇలాంటి లక్కీ ఛాన్సులు రావటం అరుదు.
“ బలే మంచి చౌక బేరము
ఇది మించినన్ దొరకదు
కొనండోయి సుజనులారా “ || బలే ||
అని నారదుడు శ్రీ కృష్ణుణ్ణి అమ్మకానికి పెడతాడు. కానీ అది వాస్తవానికి చవుక బేరమేమీ కాదు. ఆయన బరువు బంగారం కావాలి. ఎవరి దగ్గర ఉంది? ఒకవేళ అంత బంగారమిచ్చి ఆ లక్కీ వ్యక్తిని కొనుగోలు చేసినా, కొన్న వ్యక్తి ఇల్లు గుల్లే ! ఎందుకంటే అతని ఇంట్లో పాలు పెరుగు వెన్న నెయ్యి ఖాళీ అయిపోతాయి. కాబట్టి ఏది గుడ్ లక్కీ ఛాన్సో, ఏది బాడ్ లక్కీ ఛాన్సో వినియోగదారులు, కొనుగోలు దారులు, దళారులు పోటీ పడి ఆలోచిస్తుంటారు. షేర్ మార్కెట్లు, స్టాక్ ఎక్చేంజీలలో ఈ పోటీ స్పష్టంగా కనపడుతుంది.
“ రండి ! చూడండి !
ఆలసించిన ఆశాభంగం “
అని డ్రామాలకు, సినిమాలకు యమ ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం ఎంత పటాటోపంగా జరుగుతుందంటే ‘భారీ సెట్టింగులతో, ఒళ్ళు గగుర్పొడిచే ఫైటింగులతో, భయంకరమైన సన్నివేశాలతో, మీ గుండెలు దడదడ లాడించే అరుపులతో, కంటతడి పెట్టించే సంఘటనలతో (పొగ పెట్టరు ప్రామిస్) అగ్ర శ్రేణి తారలతో కోట్లాది రూపాయలు వెచ్చించి, విదేశాలలో నిర్మించిన చిత్రం నేడే చూడండి ! మంచి సమయం మించి పోనీయ వద్దు ! ఆలస్యం అమృతం విషం!” – నిజమేననుకొని పోయి వచ్చిన వారికి ఆ తరువాత గాని తెలియదు ఆ ఛాన్సులో ఎంత న్యూసెన్సు ఉందో.
“పురజనుల కోరికపై” ఈ ఛాన్సు పొందే టైమ్ పెంచుతున్నామని కూడా కొందరంటుంటారు. “డిస్కో బట్టలపై డిస్కౌంట్” “సగం ధరకే”, “ఉచితం” లాంటి ఛాన్సులు కూడా ప్రసాదిస్తుంటారు కొందరు. “ ఈ ఛాన్సు స్టాకు ఉన్నంతవరకే”, “ఫలానా పట్టణాలలో మాత్రమే” అని సరసాలాడుతారు కొందరు. ఏమైనా ఇలాంటి ఛాన్సులు కొట్టేసిన వ్యక్తి ఇంటి కొచ్చి తాపీగా లెక్కలు కట్టుకొని చూసుకున్నప్పుడే అందులోని అసలు ఛాన్సు అర్ధం అవుతుంది.
“వండేది అడ్డెడు, ఓగెంగా తిను అల్లుడా అంటే అన్నంపై ద్వేషమెందుకు ఉన్నదంతా ఊడ్చిపెట్టు అత్తా” అన్నాడట. లాడం దొరికిన వ్యక్తి గుర్రం కూడా దొరుకుతుందని పరుగు తీసినట్లు లోకమంతా ఛాన్సుల కోసం పరిగెడుతోంది. ఛాన్సు అనేది ఓ లాంటి తాయం.
“అదృష్టం మీ ఇంటి తలుపు తట్టుతోంది, అందుకోండి” “ఒక్క రూపాయితోనే మీ ఇంట లక్షల పంట” అని లాటరీ వాళ్ళు జనానికి తాయం ఆశ చూపిస్తున్నారు. గారడీ వాడు కూడా బదనికలు, తాయెత్తులు బయటికి తీసి ఛాన్సు అందుకోమంటాడు ఏవేవో మ్యాజిక్కులు చేసి ఇవన్నీ “తాయెత్తు మహిమ” అంటాడు. ఆ తాయెత్తు ధరిస్తే “పీనుగులాంటి మనిషి ఎనుగు అవుతాడు.” ఈ బదనిక చూపిస్తే సాక్షాత్తూ “ఆదిశేషుడు కూడా అవతారం చాలిస్తాడు” కొని ఉపయోగించండి అంటాడు. ఈ యమ ఛాన్సు కొట్టేయాలనే కోర్కెతో వెర్రిజనం ఎగబడి కొంటారు. వాటి మహిమ వాడు వెళ్ళిపోయాక తెలిసొస్తుంది.
రామారావుగారు కూడా రాష్ట్ర జనానికి రకరకాల ఛాన్సులు ప్రకటించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా చీరలు సగం ధరకే. వెనుకబడిన తరగతుల వాళ్ళకు రిజర్వేషన్లు, గడువు లోపల అప్పు తీర్చిన వాళ్ళకు వడ్డీ మాఫి... మొదలైనవి. లేటెస్టుగా “రాళ్ళు కొట్టే ఛాన్సు వడ్డెర వాళ్ళకు మాత్రమే” పరిమితం చేశాడు. ఏ చాకలాయనో, ఏ సాయిబో ఇకమీదట రాళ్ళు కొట్టే కాంట్రాక్టు పొండలేడన్న మాట. కాబట్టి వడ్డెర వాళ్లకిది లక్కీ ఛాన్సు !
రాజకీయ నాయకులు గూడా ఇలాంటి ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంటారు. “ఆకాశం నీ హద్దురా, అవకాశం(ఛాన్సు) వదలొద్దురా” అనే సూక్తిని పాటిస్తూ ఉంటారు. స్వతంత్రంగా ఛాన్సు కొట్టేయాలని చూసిన రంగా, ఆవునీ దూడనీ గూడ స్వంతం చేసుకోవాలనుకున్న బ్రహ్మానందరెడ్డి, ఇం.కా.ఐ వారు, చెన్నా రెడ్డి, చవాన్, వెంగళరావ్, నాదెండ్ల భాస్కర రావు, ఒకరేమిటి నూటికి నూరు మంది ఛాన్సు వాదులే. “ఎంత చేర్చినా, ఏమి చేసినా ఎంతవారలైనా కాంతదాసులే” అనేవారు ఇదివరకు. ఇప్పుడు “ఎంతవారలైనా ఛాన్సు దాసులే” అనుకోవాలి. ఏమంటారు?
“అటు దిటూ, ఇటుదటూ తిరగేసి చెప్పిందే కవిత్వం
1. అర్ధం, పర్ధంలేని శబ్దాలు చేయటమే కవిత్వం
2. వ్యర్ధ ప్రలాపమే కవిత్వం
3. పిచ్చివాడి వాగుడే కవిత్వం “
అనే నాల్గు నిర్వచనాలు గూడా ఇచ్చాను. ఎందుకంటే మహా కవులని పిలిపించుకొన్న వారు గూడా “ కుక్క పిల్ల సబ్బుబిళ్ళ అగ్గిపుల్ల, పందిపిల్ల కావేవీ కవితకనర్హం” అన్నారు. డబ్బాలో గులాకరాళ్ళు పోసి గలగల లాడించినట్లు చెళా పెళా వాగుతుంటే కవిత్వం కాక మరేమవుతుంది? మీరు నమ్మలేకపోతే నేను వంద ఉదాహరణలు చెప్పి నమ్మిస్తాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి