మధురం... మధురం...
గీటురాయి 29-5-1987
రమజాన్ మాసంలో నమాజులు చేయటం చాలా మంది బహుపుణ్యప్రదంగా భావిస్తారు. ఏనాడూ మస్జిదు ఆవరణలో కానరానివాళ్ళు ఈ నెలలో తటస్థిస్తూ ఉంటారు. బెండ్లు మునిగి గుండ్లు తేలినట్లు ఈ మిశ్రమ భక్తజన సమూహంలో ఏడాది పొడుగునా నమాజు లైన్లో నిలిచే సిసలయిన భక్తులు మరుగునపడిపోతున్నారు. ఎవరు అసలో ఎవరు నకిలీయో తెలిసికోవటం కష్టంగా ఉంది.
మా ఊళ్ళో ఒక త్రాగుబోతు ఉండేవాడు. సారాయి త్రాగటమేగాక దానితోనే తలక పోసుకుని వచ్చాడా అనిపించేది.
“షీషా రహే బగల్ మే జామే శరాబ్ లబ్ పర్
పాకీ యహీ మజాహై దో దిన్ కి జిందగీ కా”
బేపి యేహి షరాబ్ సే నఫ్రత్
ఏ జిహాలత్ నహీతో ఫిర్ క్యాహై?
జిహాద్ కే బద్ లే ఖిల్ద్ మే హూరే
ఎహ్ లిజారత్ నహీతో ఫిర్ క్యాహై?
లాంటి పద్యాలతో ముల్లాల నోళ్ళు మూయించేవాడు. కానీ వాడికి ఏమయ్యేదో ఏమో కానీ రమజాన్ నెలలో అపరముల్లాలాగా తయారయ్యేవాడు. ఒక్కపొద్దులు, క్రమం తప్పని నమాజులతో ఈ నెలంతా గడిపేవాడు. వీడు వాడేనా అని మనం నోళ్ళు వెళ్లబెడుతుంటే, అవును వాడే వీడు అనేవాడు. మొత్తానికి పేచీకి పెదబాబు! రమజాన్ పండుగ మరునాడే సారాయి సీసాతో ప్రత్యక్షమయ్యేవాడు.
ఎంత మత్తులో ఉన్నా నాకు మాత్రం సగౌరవంగా సత్యం చెప్పేవాడు. రమజాన్ నెలలో మెలగిన చందాన మిగతా నెలల్లో కూడా ఉండకూడదట్రా? అన్నాను. సహారన్ పూర్ గాయకుల్ని అప్పనంగా ఇక్కడే ఉంచుతారా మరి? అన్నాడు.
వాళ్ళని ఏడాది పొడవునా ఇక్కడే ఉంచాలంటే మాటలా! రమజాన్ నెలలో ఖురాన్ పారాయణం పూర్తి చేయించటం కోసం మూడు వేల రూపాయలకు మాట్లాడుకొస్తిమి. ఆ మూడు వేల కోసం 300 ఇళ్ళు తిరిగి బిచ్చమెత్తాము. మున్నూట అరవై రోజులూ వాళ్ళే ఉండాలంటే కుదురుతుందా? అసలు ఏమిటి సంగతి. వాళ్ళ గొప్పదనం ఏమిటి” అని అడిగాను.
“భాయీసాబ్, వాళ్ళ గొంతులున్నాయి చూశారూ, గొంతులంటే వాళ్ళవే గొంతులు. మధురాతి మధురంగా వాళ్ళు ఖురాన్ పారాయణం చేస్తుంటే అనంత లోకాల్లో తేలియాడుతూ ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. మూడు వేలు కాదు, ముప్పై వేలు పోసినా ఉత్తరాదివాళ్లను తేవటమే ఉత్తమం అన్నాడు.
ఉత్తరాదివాళ్ళను గురించే ఇప్పుడు ఆలోచనలో పడ్డాను. సంతలోని సరకుల్లాగా గొంతు, శ్రావ్యత, స్పష్టత అన్నీ చూసి కొనుగోలు చేసికొస్తిమి. వాళ్ళ గొంతు మాధుర్యానికి బానిసలయిపోయి ఒక్క రాత్రిలోనే ఖుర్ ఆన్ పఠనం ముగించేయాలని “ఏక్ షబీ షబీనా” ప్రోగ్రాం పెట్టాం. దాని కోసం ముగ్గురు హాఫిజ్ (ఖుర్ ఆన్ సంస్మర్తలు) లను ఎన్నుకున్నాం. వాళ్ళు ముగ్గురూ వంతులవారీగా పఠిస్తున్నారు. తన వంతు వచ్చేలోపు అందులో ఒకాయన బజారుకెళ్లి కిళ్ళీ నమిలి పొగాకు చుట్ట దమ్ము లాగించి వచ్చేవాడు. ఒక చేతెడు నీళ్ళను పుక్కిలించి ఊసి పారాయణం మొదలేసేవాడు. ఇట్లాంటివాళ్లతోనే మా త్రాగుబోతువాడు పూసుకుని తిరిగేవాడు. వాళ్ళ చంకల్లో దూరి ఇరవై నాలుగ్గంటలూ మాట్లాడేంత వ్యాపార రహస్యాలు వీడికి ఎమున్నాయో అనుకునేవాణ్ణి, రమజాన్ నెల ముగిసింది. హాఫిఙ్ లు ఎవరి దారి వారు చూసుకున్నారు. మర్నాడు మన త్రాగుబోతు చంకలో సారాబుడ్డి చూసి మరోసారి విస్తుపోయాను. అప్పుడు నాకన్పించింది – ఖుర్ ఆన్ వినిపించే హాఫిజ్ లయినా, చెవులు కోసుకుని మరీ వినే నమాజీలయినా దాని సారాంశాన్ని అర్ధం చేసుకుని ఉంటే ఎంత బాగుండేదని. సారాయి నిషిద్ధం అన్న విషయం ఖుర్ ఆన్ లో ఉన్నట్టు మన త్రాగుబోతుకు తెలియదు కదా !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి