కవులు – కాంతామణులు
గీటురాయి 24-4-1987
“భార్య అనుకూలవతి అయితే కవి, లేకుంటే వేదాంతి అవుతాడు” అంటారు. భార్య పోరు పడలేకనే సోక్రటీస్ పెద్ద తత్వవేత్త అయ్యాడు అని కొందరి వాదం. లోకంలో మానవులు పడుతున్న కష్టాలు హింస చూడలేక బుద్ధుడు వేదాంతి అవుతాడు. ఆయనకు బుద్ధి రావటానికి ముందు భార్యను విడిచి వెళ్ళటం గమనార్హం. బైబిల్లోని సోలోమోను కూడా అంటాడు “గయ్యాళితో మంచి భవనంలో కాపురం చేయటం కంటే అరణ్యములో నివసించుట మేలు” అని. ఇంకా “భార్య తోటి పోరు ముసురు కాలంలో ఎడతెగక పడే నీటి బిందువులతో సమానం” అంటాడు.
ఓ ప్రఖ్యాత కవి తను రాసిన కవిత్వం మొదట తన భార్యకు వినిపించేవాడు. ఆవిడ కాస్త తెలివైనది. “డార్విన్ అన్నాడు కోతిలోంచి మనిషి వచ్చాడని, నేను అంటాను మనిషే కోతి అయ్యాడని“ అని తన కవిత్వం ఆమెకు వినిపించాడు. “ అవును, మీ విషయంలో ఈ మాట నిజమే సుమండీ!” అంది ఆమె.అంతే ఆయన కవిత్వం మాని వేదాంతి అయ్యాడు.
ముని మాణిక్యం నరసింహారావుగారు కూడా తన భార్య కాంతంతో పడిన పాట్లు వివరిస్తాడు. కాళిదాసు వ్రాసిన “ఆభిజ్ఞాన శాకుంతలం” లాంటి గొప్ప గ్రంధాన్ని తీసికెళ్లి చదవమని ఇస్తే ఆమె దానిని చారురాచిప్ప మీద మూత పెట్టిందట. అంతే, అంత పెద్ద హాస్యగాడు కూడా సీరియస్ వేదాంతి అవుతాడు. దీనిని బట్టి కవుల్ని వేదాంతులుగా మార్చగల శక్తి భార్యలకే ఉందేమోనని నాకు అనుమానం. కానీ భార్యలను వేదాంతులుగా మార్చే శక్తి భర్తలకు లేదు.
ఉగాది వస్తుందంటే చాలు వేదాంతులు, కవులు, జ్యోతిష్యులు తమ పాత సరంజామా అంతా బయటకు తీసి తమ పాండిత్యాన్ని లోకం మీద పారబోయటానికి బయలుదేరుతారు. ఓసారి “ఉగాది కవిత్వం వినుపించుదురు రండూ” అని పేరుగాంచిన కవుల్ని ఆహ్వానించి అధ్యక్షునిగా ఒక మహా చెడ్డ కవిని అలంకరింపజేశారు. ఆ అధ్యక్షకవి అధ్యక్షోపన్యాసం చేసి కవుల్ని తమ కవితలు చదివేందుకు ఆహ్వానించ వలసింది. కాని ఆయన “ముందు నా కవిత్వం చదివి తరువాత ఒక్కొక్కరినీ పిలుస్తాను” అన్నాడు. ఆయన చేతిలో వంద పేజీల నోటు పుస్తకం ఉంది. అది చూడగానే తమ చిరుకవితలు వినిపిద్దామని వచ్చిన కవులు కంపించిపోయారు. ఆయన ఆ వంద పేజీలు అతి నిరంకుశంగా, ఆసాంతమూ ఆరుగంటల పాటు చదివాడు. సభా మర్యాద కోసం ప్రాణాలు ఉగ్గబట్టుకొని కూర్చోక తప్పింది కాదు. ఆయన కవిత్వం చదవటం పూర్తయ్యేసరికి పట్టుమని హాలులో పదిమంది లేరు. వారిలో ఒక్క స్త్రీ మాత్రమే ఉంది. ఆవిడ కూడా చివరిలో వెళ్ళిపోయింది. కవులంతా వెళ్ళిపోయారు. నిర్వాహకులు హాలు ఖాళీ చేసేసరికి తెల్లవారింది.
ఆసక్తి ఆపుకోలేక అధ్యక్షులవారిని అడిగాను “పెను తుఫానుకు సైతం తొణకని ఇంత పునాదిగల కవిత్వం మీకు ఎలా అబ్బింది సార్?” అని. “ఇది నా భార్యామణి వ్రాసిన కవిత్వం బాబూ, పూర్తిగా చదివాకనే ఆమె వెళ్లిపోయింది. చదవకపోతే ఇంటికెళ్ళాక నాగతి ఏంగాను?” అన్నాడు.
భార్యలు కవయిత్రులైతే వారి వారి రచనలను వినటం, ఫేయిర్ కాపీ చేసి పెట్టడం, పోస్టు చేసి రావటం లాంటి గానుగెద్దు పనులతో భర్తలు వేదాంతులౌతున్నారు. మార్గరేట్ థాచర్ భర్తలాగా ఫీలౌతున్నారు. కవికి వేదాంతికి బోలెడంత వైరుధ్యం ఉంది. భామల వల్లనే కవిత్వం, వేదాతం రెండూ వస్తాయి, ఉదాహరణకు ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దన తాను కవిత్వం రాయాలంటే ఏం కావాలన్నాడో చూడండి
“పసిడి గంటము పట్టి ప్రబంధమొకటి
వ్రాయవలెనన్న నాకు కావలయు వినుడు
శాంత నిశ్శబ్ద ఏకాంత స్థలము ( భార్య పోరు లేని చోటు )
పచ్చకప్పుర తాంబూలమిచ్చు రమణి “
అదే వేదాంత ధోరణికి రాదలచిన ‘తిక్కన’ తాను భారతం రాయబోయే ముందు ఎలా తయారయ్యాడో చూడండి:
“వారకాంతా పరిష్వంగ వర్తనముల
మైల బడినది దేహంబు మనసు కూడ
యజ్ఞమును జేసి పరిశుద్ధ యశము తోడ
భారతము వ్రాయ బూనెద భక్తి వెలయ”
కాబట్టి కవిత్వానికీ వేదాంతానికి కాంతయే కారణమౌతున్నది. కాంతుడు నిమిత్తమాత్రుడే. అందువలన కవి వుంగవుల భార్యలారా, కాస్త మీ భర్తలను కనిపెట్టి ఉండండి. వారు కవులు గానీ, వేదాంతులుగానీ కాకుండా కాపురస్థులుగానే కొనసాగేలా సహాయపడండి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి