ప్రతి అలంకృత పైత్యమూ కవిత్వమే! గీటురాయి 23-1-1987
“రాయాలోయ్ బాషా రాయాలోయ్
రాతి లాంటి కవిత్వం రాయా లోయ్
ప్రత్యర్ధుల చెవుల్లో చేర్నాకోల్ దెబ్బలు
మిత్రుల ఎదల్లో పువ్వులజల్లులు
కొట్టాలోయ్ బాషా కొట్టాలోయ్”
- అని కవులు నాకు ఊదరగొడితే కవిత్వం రాద్దామని పూనుకున్నాను. అసలు కవిత్వమంటే ఏమిటి ? అది ఎక్కడ దొరుకుతుంది ? అని ప్రశ్నించుకోకుండానే కవిత్వం మొదలేశాను. త్వరలోనే అర్ధమయ్యింది. కవిత్వమంటే ఒక లాంటి పైత్యం మాత్రమేనని.
1. “అటుదిటూ, ఇటుదటూ తిరగేసి చెప్పిందే కవిత్వం
2. అర్ధం, పర్ధంలేని శబ్దాలు చేయటమే కవిత్వం
3. వ్యర్ధ ప్రలాపమే కవిత్వం
4. పిచ్చివాడి వాగుడే కవిత్వం “
అనే నాల్గు నిర్వచనాలు గూడా ఇచ్చాను. ఎందుకంటే మహా కవులని పిలిపించుకొన్న వారు గూడా “ కుక్క పిల్ల సబ్బుబిళ్ళ అగ్గిపుల్ల, పందిపిల్ల కావేవీ కవితకనర్హం” అన్నారు. డబ్బాలో గులకరాళ్ళు పోసి గలగల లాడించినట్లు చెళా పెళా వాగుతుంటే కవిత్వం కాక మరేమవుతుంది? మీరు నమ్మలేకపోతే నేను వంద ఉదాహరణలు చెప్పి నమ్మిస్తాను.
“కాదేదీ కవితకనర్హం” అంటే కవిత్వం. “కవిత్వానికి ఏదీ అనర్హం కాదు” అంటే మామూలు మాట. అటుదిటూ, ఇటుదటూ చేయటమనే సూత్రం (మొదటిది) మీరిప్పుడు ఒప్పుకొన్నట్టేగదా.
“పెద్దనవలె కృతి చెప్పిన పెద్దన వలె లేకపోతే ?
ఎద్దనవలె, మొద్దనవలె, గ్రద్దనవలె”
ఏమిటీ పిడి గుద్దులు? అర్ధం పర్ధంలేని శబ్దాలుచేసే కవిత్వం అంటే ఇదే (రెండవది).
మూడోది వ్యర్ధ ప్రలాపం. అది ఎలా ఉంటుందో చూడండి:
“ఎక్కడమ్మ చంద్రుడూ,
చక్కనైన చంద్రుడూ
చుక్కలారా, అక్కలారా
నిక్కి చిక్కి చూతురేలా”
ఈ కవిత్వంలో పనికొచ్చే ముక్క ఏదైనా ఉందేమో ఆలోచించండి.
ఇక నాల్గోది పిచ్చివాడి వాగుడు. ఆలకించండి:
ఆకాశం దించాలా?
నెలవంక తుంచాలా?
సిగలో ఉంచాలా?
“నీ పాడె కట్టాలా ?
నీ పచ్చిబద్దలు పంచాలా?”
అన్నట్లు సాగుతుంది ఈ కవిత్వం. కవిత్వం గడ్డి అనుకోని గాడిదలన్నీ పడిమేయసాగినవట. గాడిదలు సమావేశమైనప్పుడు చక్కని కవిత్వం చెప్పుకుంటాయట. ఈ విషయం తెలిసికొన్న కవులు చెవులు నిగిడించి గాడిదల కవిత్వం వినబోతే పకాళించి తన్నినవట. గాడిద తన్నులకు తలతిరిగిన కవులు మళ్ళీ మామూలు మనుషుల్లాగా సూటిగా స్పష్టంగా మాటలాడటం, వ్రాయడం ఆరంభించారట.
చెప్పదలుచుకొన్నది సూటిగా అర్ధమయ్యేలా చెప్పటం ఇష్టంలేని వాళ్ళే కవులు. వాళ్ళు పాటలూ, పద్యాలు రాస్తారుగానీ చస్తే నాలుగు పొడి మాటలు చెప్పరు. చందస్సనీ గురులఘువులనీ దీర్ఘాలు తీస్తారు.
గాడిదలంటే గుర్తొచ్చింది. గాడిదల సంగీతంలో కూడా కవిత్వం ఉంది. “అదిగో ద్వారకా... ఆ... ఆ... ఆ... అని అర్జునుడి వేషంవేసిన వ్యక్తి డ్రామాలో తీసే రాగం ఎంతో కవిత్వంతో కూడి ఉంటుంది. ఆయన తన రాగం ద్వారా చెప్పదలచుకున్న కవిత్వం పూర్తయ్యేలోగా వినే వ్యక్తి ద్వారకకు పోయి తిరిగి రావచ్చు. మసీదులో “ అజాన్” ఇచ్చేటప్పుడు కూడా కొందరు కమ్మని రాగ కవిత్వం వినిపిస్తారు.
“విశ్వకవి” అని గుర్తించి రవీంద్రనాధ టాగూర్ కి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఆయన ‘గీతాంజలి’ అనే పుస్తకంలో, “ఎక్కడ మనసు భయం లేకుండా ఉంటుందో ( Where the mind is without fear) అక్కడికి జనాన్ని తోలుకుపొమ్మని దేవుణ్ణి ప్రార్ధిస్తాడు. అది నిశ్చయంగా కవులు లేని ప్రదేశమే అయివుంటుందని నా నమ్మకం. ఎందుకంటే దేవుడు ఉన్నదున్నట్టే చెప్పాడుగానీ కల్పించి చెప్పలేదు. కవుల్ని ప్రవక్తలుగా పంపినట్లయితే మనకి తమ కవిత్వం చెబుతారనుకున్నాడో ఏమో గొర్రెలు కాసే వాళ్లనీ, అక్షరం ముక్కరాని వాళ్ళనీ ప్రవక్తల్ని చేసి పంపాడు. ఆయనకి తెలుసు కవులు కాలాంతకులని!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి