నిలకడ మీద తేలే నిజం ఏదో ?
గీటురాయి 1-5-1987
చిత్తరమయిన మొగుడు ఉత్తరం వేస్తే, చింతల తోపులోకి వెళ్ళి చదివించుకుంటే ఇంకా చిత్తరంగా ఉందట.ఫైయిర్ ఫాక్స్, బోఫర్స్ వ్యవహారాలు వెల్లడై తమ గబ్బు సంస్కృతి ప్రజలకు బట్టబయలయ్యేటప్పటికే “ఇదంతా పెద్దకుట్ర” అని కాంగ్రెస్(ఐ) వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఇది పెద్ద కుట్ర అని కాంగీయులు ఇంత త్వరగా తెలిసికోగలగటం గొప్పతనమే. పైగా “ఇది సామ్రాజ్యవాదులు, ప్రతిపక్షాల వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకై పన్నిన కుట్ర” అని తెలిసికొన్నారు.
వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమయిన అలీనోద్యమానికి రాజీవ్ గాంధీ చక్కని నాయకుడు కావటం వల్ల, జాత్యహంకారానికి ఆయన ఎదురు తిరిగి పోరాడటం వల్ల, బహుళ జాతి వ్యాపార సంస్థలకు ఇండియాలో స్థానం కల్పించకపోవటం వల్ల ఆయన ప్రభుత్వాన్ని కూల్చాలని వీళ్ళంతా కలిసి కుట్రపన్నారట. ఆ కుట్రలో భాగమే ఫైర్ ఫాక్స్, బోఫర్స్ భాగోతాలు వెల్లడికావటమట.
కేంద్ర కాంగీయులు రాష్ట్ర కాంగీయులకు అలా ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చదువుకొని అవే మాటలు వల్లిస్తూ “ నిజం చెప్పి నింద మాపుదామని” మన రాష్ట్ర కాంగీయులు శ్రీ బాగారెడ్డి గారు మరీ బాగా నడుం బిగించారు. ఆయన చెప్పిన నిజమేమిటి ? “రక్షణ శాఖకు సంబందించి అన్ని దేశాలకు రహస్యాలుంటాయి. వాటిని బయట పెడితే దేశానికి ముప్పు వాటిల్లుతుంది,ఫలితంగా దేశం ముక్కలైపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విపత్తును అధిగమించే శక్తి పార్టీకుంది” అన్నారు.
అది ఎలాగా? “అబద్ధాన్ని పదిసార్లు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకోవటం పొరపాటు. నిజం నిలకడ మీద తెలుస్తుంది.“బాగారెడ్డి గారి మాటల ద్వారా, కాంగ్రెస్ తీర్మానం ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. వెనుక ఎవడో చిల్లి బాగా లేదని బెజ్జం వేశాడట. విదేశాలలో డబ్బు దాచుకుని దేశాన్ని దోచుకుతింటున్న దొంగలను పట్టుకోటానికి శ్రీ వి. పి. సింగ్ ప్రారంభించిన “దురాచారాన్ని” కొనసాగిస్తే కాంగై సంప్రదాయాలకు అపచారం కదా ! అందుకని కొట్టవద్దు, తిట్టవద్దు... అన్నట్లు కాంగ్రెస్ ఆయన్ని చాకచక్యంగా పదవి నుండి తొలగించింది. చాపక్రింద నీళ్ళను “పరాయి వాళ్ళ కుట్ర” గా మార్చి ప్రచారం చేస్తున్నది. వాస్తవాలు బయపెట్టమని కోరిన ప్రతిపక్షాల వాళ్ళను గూడా కుట్రదారుల్లో చేర్చడం దాని ప్రత్యేకత.
ఈ లెక్కన కాంగ్రెస్ వాళ్ళు తప్ప మరే పార్టీ వాళ్ళూ దేశ భద్రతను కోరటం లేదన్నమాట. నిజమే మరి. మందబలంతోటి, మొండిగా వితండవాదం చేస్తూ కాలం గడుపుకు వస్తేనే కదా దేశానికి భద్రత. కానీ బాగారెడ్డిగారన్నట్లు నిజం నిలకడ మీద తెలీస్తే మాత్రం కాంగై భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని గిట్టనివాళ్ళు అంటున్నారు. కాంగై భద్రత అంటే దేశ భద్రతే అన్న సంగతి వీరు మరచిపోతున్నారు. రాజు దుర్గుణుడైనా భట్రాజులు అతన్ని సకల సద్గుణ సంపన్నుడనే పొగుడుతారు కానీ వాని దుర్గుణాలను బయటపెట్టి తెగడుతారా? అనే సచ్చు సామెతలు చెబుతున్నారు, ఏమయినప్పటికీ దేశ భద్రత, సమైక్యత అనే విలువయిన నినాదాల పాలసీతో కాంగై మరోసారి విజృంభించబోతున్నది. ఈ దెబ్బతో కుట్రదారుల గుట్టురట్టయిపోతుంది. బాగారెడ్డి చెప్పిన నిలకడ మీద తేలే నిజం ఇదే కావచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి