ఇల్లు కట్టి చూడు...
గీటురాయి 18-12-1987
“మేడంటే మేడా కాదు
గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లూకున్నా
పొదరిల్లూ మాదీ”
అని పాడుకుంటూ అన్నీ దేశాల వాళ్ళు అంతర్జాతీయ ఆశ్రయ కల్పనా సంవత్సరాన్ని అవజేశారు. అంతర్జాతీయ ఆశ్రమం లాంటిది ఏదైనా ఒకటి కట్టించినా ఈ సంవత్సరానికి పెట్టిన పేరు సార్ధకం అయ్యేది. ఇక నిరాశ్రయులకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలనే సదాశయాన్ని నిక్షేపంగా మరచిపోవటానికి, జనం మరచిపొయ్యేలా చేయటానికి దేశనాయకులు ప్రయత్నిస్తారు. కానీ మనం ఇల్లు ఇల్లు అని గోల పెడుతూనే ఉండాలి. వాళ్ళ చెవుల్లో ఇళ్ళు కట్టుకుని పోరుతూ ఉండాలి. ఇలాంటి ఇంటిపోరు తప్పదని ముందుగానే గ్రహించారో ఏమో మరి మన ‘అన్న’ గారు ఇళ్ళు కట్టించటంలో ఫస్టు మార్కు కొట్టేశాడు దేశంలో ! కానీ రాష్ట్రంలోని ఇల్లిల్లూ తిరిగి తాను కట్టుకున్న పెద్ద ఇల్లు (పార్టీ) పడిపోకుండా ఏం చేస్తాడో పైవాడికే తెలియాలి.
ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్నారు. అసలు ఇల్లు లేని వాడికి వెనుకటి రోజుల్లో పిల్లనిచ్చే వారు కాదట. ఇప్పుడు కనీసం అద్దె ఇల్లయినా ఉంటే అదే చాలు అనుకుంటున్నారు. ఇల్లే తీర్ధం, వాకిలే
వారణాసి. కడుపే కైలాసంగా బ్రతికే జీవులు కూడా ఎందరో ఉన్నారు. ఇల్లు ఇరకాటం ఆలు మరకటం అని ఆపసోపాలు పడే అభాగ్యులూ ఉన్నారు. ఇల్లాలు గుడ్డిదయితే ఇంటి కుండలకు చేటు అన్నారు. ఇల్లు చూచి ఇల్లాలిని చూడమన్నారు.
ఈ దేశ నాయకులంతా ఇప్పుడిప్పుడే ఇళ్ల ఇంపోర్టెన్స్ ను గుర్తిస్తూ ఇంట గెలిచి రచ్చ గెలవవోయ్ అని ఒకరినొకళ్ళు సవాలు చేసికుంటూ ఉంటారు. ముఠా కుమ్ములాటలతో, ముసుగులో గుద్దులాటలతో నిండి వున్న అధికార పార్టీని చూచి “ ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అంటూ ఈసడిస్తూ ఉంటారు. ఇల్లెక్కి కొరివి తిప్పినట్లుగా కొందరు అసమ్మతివాదులు అపాయకరమైన పనులకు పాల్పడుతారు.
ఇంటికి గుట్టు మడికి గట్టు ఉండాలి అంటారు. కానీ ఇంటి గుట్టును బయటపెట్టి లంకంత పార్టీకి చేటు తెచ్చే ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఒక కంట కాదు వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే మరి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నారు. ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలన్నీ తెగకాలినవట. అలాగే పార్టీ సభ్యుల్లో ఎవర్ని కూడా నెంబర్ టూ నువ్వే అని గారాబం చేయకూడదు. నెత్తిన ఎక్కించుకోగూడదు. ఇవతలికి రమ్మంటే ఇల్లంతా నాదేననే రకాలు ఉంటారు. ఇంట్లో చొరబడి ఇంటి వాసాలు లెక్క పెట్టుకొనే కక్కుర్తి మనుషులూ ఉంటారు. “ ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఇల్లు జాగరతే తుమ్మెదా “ అని ఓ సినీకవి హెచ్చరించాడు కూడా. అందువలన అధిష్టాన వర్గం చాలా అప్రమత్తంగా ఇంట్లో వాళ్ళ గురించి పరిశీలన చేస్తూ ఉండాలి. ఇంటి యజమాని ఇంట్లో పిల్లి బయట పులిలాగా యాక్షన్ చేయకుండా ఇంట్లో వాళ్ళు కామెంట్ చేయటానికి వీల్లేనంత సజావుగా ఉండాలి.
ఇల్లు కాలింది జంగమయ్యా అంటే నా జోలే నా కప్పరా నా దగ్గరే ఉన్నాయిలే అన్నాడట. పార్టీ నాశనమైపోయినా సరే తన బతుకు బాగుపడితే చాలు అనుకునే స్వార్ధపరులు, ఇల్లు పీకి పందిరి వేసేవాళ్ళు రాజకీయాలలో అతి సహజం. పక్క ఇంటిలో పోరును పండుగంత వేడుకగా భావిస్తూ పచ్చని ఇంటిలో చిచ్చు పెట్టేవారు, పొరుగింటి వారు పచ్చగా ఉంటే చూడలేక ఓర్వలేక పోయేవారు. చివరికి ఇంట్లోవాళ్ల చేతనే ఇంటికి నిప్పంటిస్తారు. అలా ఇల్లు కాలి ఏడుస్తుంటే త్వరగా బావి తవ్వించండి అని ఉచిత సలహాలిస్తారు, చుట్టకు నిప్పివ్వమని కూడా అడుగుతారు. అందువలన ఇరు పోటీలు పడి ఇల్లు చెడగొట్టుకోకుండా, పక్కింటి వాళ్ళ తొక్కుకు ఆశపడకుండా, పరాయి పంచన చేరకుండా, ఇంటిని కనిపెట్టుకుని పడి ఉండటం ఇంట్లో సభ్యుల కర్తవ్యం, కనీస ధర్మం. ఇంట్లో క్రమశిక్షణ, ఇంటివాడిపట్ల, ఇంటిపేరు పట్ల, ఇంట్లో జనానికి గౌరవ విధేయతలు కొరవడితే “ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు” అన్నట్లుంటుంది. అందువలన అంతర్జాతీయ ఆశ్రయ కల్పనా సంవత్సరం ముగింపు సందర్భంగా అన్నీ పార్టీల వాళ్ళూ తమ తమ ఇల్లు చక్కదిద్దుకోగలరని ఆశిద్దాం !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి