మొరిగే కుక్కకు జవాబేది?
గీటురాయి 3-7-1987
కుక్కలంటే చిన్నప్పుడు నాకేమీ భయం ఉండేది కాదు. కానీ ఒకసారి ఒక పెద్ద కుక్క ‘భౌ’ అని అరుస్తూ నా వెంట పడి రెండు వీధుల వరకు తరిమింది. ఆనాటి నుండి ఎద్దుల్లాంటి కుక్కలు కనబడితే చాలు నాకు ఒళ్ళు జల్లుమంటుంది. ఏ వీధిలోనైనా కొన్ని కుక్కలు కలబడి పోట్లాడుకుంటున్నా, వాటి అరుపులు వినబడుతున్నా ఆ వీధి గుండా పోవటం ఆపివేసి మరో వీధి గుండా వెళ్ళటం అలవాటు చేసికున్నాను.
నేను ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వీధికుక్కలను పట్టికెళ్లమని మునిసిపాలిటీ వాళ్ళకు ఫిర్యాదు చేసేవాడ్ని. మెడకు లైసెన్సు బిళ్ళ కట్టి ఉన్న కుక్కలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాటి స్వంతదారులకు వాటినలా వదలవద్దని మనవి చేసే వాడిని. “మెడకు బెల్టు ఉంటే కుక్క, నడుముకు బెల్టు ఉంటే పోలీసు అంటారు” అని నా మిత్రుడు నాకు నచ్చజెప్పాడు. అప్పటి నుండి నాకు వీళ్ళిద్దరూ అంటే చాలా భయం.
కానీ మన ప్రధాని రాజీవ్ గాంధీకి కుక్కలంటే అసలు భయమేమీలేనట్లుంది. పైగా మొరిగే ప్రతి కుక్కకూ జవాబు చెప్పాల్సిన పని లేదు, దుడ్డు కర్ర తీసికొని నాలుగు వాయిస్తే చాలు అని అంటున్నాడు. ఈ దేశంలో కుక్కలను “ఇజ్జూ ఇజ్జూ” అనే వాళ్ళకంటే “ఇస్కో ఇస్కో” అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని ఆయనకు తెలియదు. కనీసం కుక్క అరుస్తూ వెంటబడినపుడు “ఛాయ్” అని అదిలించటం తెలియాలి. లేకపోతే దానికేదైనా ‘తాయం’ చూపించాలి.
ఛీ కుక్కా అంటే ఏమక్కా అన్నదట. రాంజెట్మలాని అరుపులు మరింత ఎక్కువయ్యాయి. కానీ కుక్కలు దొంగను చూచినపుడే అరుస్తాయి అనే మాట శుద్ద అబద్ధం. అమాయకులను అన్యాయంగా కరిచే కుక్కలు కూడా కొల్లగా ఉన్నాయి. వాడు వీడు అని విచక్షణ చూపక నోటికి అందినవాడినల్లా పట్టి పీకి పారేసే పిచ్చికుక్కలూ ఉన్నాయి. అందువలన వీటి దృష్టిలో పడకుండా దాక్కోవటం మంచిది. మాస్కోకు పొయ్యి మళ్ళీ రాకుండా అక్కడే ఉండాలి. లేదా కుక్కకు జవాబు చెప్పాలి.
అరిచే కుక్క ముందు గజ్జెలు వాయించినట్లు, కుళ్ళే వాడి ముందు కలికినట్లు రాజీవ్ గాంధీ పెద్ద పొరపాటు చేశాడు. కుక్క అరవకుండా ఉండాలంటే దానికి చివాట్లు పెట్టించాలి. దానిని సవరదీయాలి. తింటానికేదైనా ఇంత తెచ్చి పడెయ్యలి. ఇక అది ఎప్పటికీ మొరగదు.
కుక్కతో వైరం కంటే దాని యజమానితో వైరమే మేలు. కుక్క యజమానికి శత్రువుగా ఉంటూనే కుక్కను మచ్చిక చేసుకునే వాడి తెలివితేటలు అమోఘం. కుక్కను గుర్రంలాగా సాకి దొంగవస్తే యజమానే మొరిగాడట. అలా ఉంటుంది పరిస్తితి. కుక్కకు ఏ వేషం వేసినా మొరగక మానదు. అందువలన అది మోరగకుండా తగిన మందు వెయ్యాలి. నయానాభయానా నచ్చ జెప్పాలి. నమ్మకం కలిగించాలి. ఎంతసేపు మొరుగుతుందో మొరగనివ్వండి చూద్దాం అని బిగదీసుకు కూచుంటే ప్రత్యర్ధులంతా వచ్చి దాని గొలుసు విప్పటం ఖాయం. అప్పుడు గోర్బొచెవ్ కూడా గాయపడక తప్పదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి