అవి నీతి కథలు, ఇవి జాతి వ్యధలు గీటురాయి 16-1-1986
“ఆగదు ఆగదు ఈ పోరాటం
ఆకలి మంటల ఈ పోరాటం
హాయ్ హాయ్ క్యా హువా?
ఎన్టీఆర్ మర్ గయా !”
లాంటి స్లోగన్లతో వీరావేశంతో నడిచిన సమ్మె గుండెపోటు వచ్చిన రాజకీయ నాయకుడిలాగా హఠాత్తుగా అనుకోకుండా మరణించింది. సమ్మె నాయకులను,ముఖ్యమంత్రిని సవరదీసి సాగదీసిన ప్రతిపక్షులు దిక్కు తోచక తలా ఒక దిక్కుకు పలాయనమయ్యాయి.
“పనీ లేదు,జీతం లేదు”.కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో తీసికొన్నట్లు అడ్వాన్స్ మాత్రం దొరికింది. యాభయ్ నాలుగు రోజులు సమ్మె చేయించి యాభయ్ రూపాయలయినా సాధించుకు రాకుండా వస్తార్రా? అని నాయకుల్ని ఉద్యోగులు తన్నారు. మమ్మల్నెవరూ తన్న లేదని నాయకులు చెప్పారనుకోండి (మళ్ళీ తన్నకుండా).
కప్పుకొంటానికి ఏమీ లేదు దొరా అంటే అప్పటికి దుప్పటిచ్చాముగాని కలకాలం ఇస్తామా? అని తాత్కాలిక భృతి నిరాకరించింది ప్రభుత్వం. చివరకు పాతిక రూపాయల పాత దుప్పటి, అదీ సగం చినిగింది ఎన్జీవోల మొహాన పారేశారట. చలికాలం అదెలా చాలుతుంది? అని ఉద్యోగుల బాధ.
ఇక సమ్మె కాలంలో జీతానికి సంబందించి “ అయ్యేదిలేదు పొయ్యేది లేదు వీర భద్రప్పా , నా ఎనిమిది అణాలు నాకిచ్చి నీ అర్ధ రూపాయి నీవు తీసుకో” అని ఉద్యోగులు మళ్ళీ వెళ్ళి ముఖ్యమంత్రిని అడిగారు. కానీ అరచేయి చూపించి అవలక్షణం అనిపించుకొన్నట్లు వెనక్కి తిరిగొచ్చారు. ఎప్పటికైనా కోడలు అత్తగారింటికి రాక తప్పదు అనుకున్నారో ఏమో ఆఫీసుల్లో చేరారు. కానీ “మనిషిక్కడ మనసెక్కడో” అన్నట్లు ఇక మీదట ఉంటామని చెప్పారు.
ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం, లంచాల కోసం ఎగబడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ వారు పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల జేబులు వెదికి కరెన్సీ బయటికి లాగిననాడు ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిందించారు. ఇది వారి ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నది. ఉద్యోగులు లంచగొండులు అన్నారు నాయకులు. మీరు మాకంటే పది రేట్లు లంచగొండులు అన్నారు ఉద్యోగులు. అంటే మనమంతా లంచగొండులమే గదా ఈ గోల ఎందుకు ఊరుకోండి అని అర్ధం. మేము లంచం తీసుకోము, మీరు కూడా తీసుకోవద్దు” అని ఉద్యోగులు చెప్పవచ్చు. పెద్ద లంచగొండి చిన్న లంచగొండిని నిందిస్తున్నాడు. అంటే చిన్న లంచగొండి నిజాయితీగా ఉంటం మొదలు పెట్టి పెద్ద లంచగొండిని పట్టి ఇవ్వవచ్చు. కానీ “ లంచగొండి వ్యవస్థ” ఇలా కలకాలం వర్ధిల్లుతూ, కొనసాగుతూ ఉండాల్సిందేనని ఉద్యోగుల కోరిక అయి వుండవచ్చు.
చర్చల్లో మంత్రులొక షరతు పెట్టారు “ అవినీతిపరులైన ఉద్యోగుల్ని శిక్షిస్తే ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించకూడదు “ అని ఈ షరతును హృదయ పూర్తిగా ఆహ్వానించాల్సింది పోయి దీనిని కూడా వ్యతిరేకించారట ఉద్యోగులు. ఇదే షరతును అధికారులకు, కాంట్రాక్టర్లకు, నాయకులకు కూడా ఎన్జీవోలు బిగించగలిగే అవకాశం పోగొట్టుకున్నారు. తన గుణం మంచిదయితే సానివాడలో కూడా కాపురం చెయ్యొచ్చు. కానీ ఉద్యోగులు అవినీతికి వ్యతిరేకంగా శపధం చేసి రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద సవాలు విసరలేదు. పైగా అర్ధమనస్కంగా పని చేస్తామని అలుగు. ఇంతకు ముందు పూర్తి మనసుతో పని చేసినట్టు.
“ పని చేయలేదు గనుక జీతం లేదు “ అని ప్రభుత్వం అంటుంటే “జీతం ఇవ్వలేదుగాబట్టి పని చేసేది లేదు అని “ ఉద్యోగులు తట్టతిరగేశారు. ఇదంతా కుళ్ళుబోతుతనాన్ని, సంస్కారహీనతను చాటి చెప్పడం లేదూ ?మనింట్లో జీతగాడు పని చేయకపోతే మనం జీతమిస్తామా? అసలు జీతగాళ్ల చేత పని చేయించుకోకుండా కూర్చోబెట్టి జీతాలిచ్చిన ఆసాముల్ని ఎక్కడైనా చూచామా ? గుణం మానవే గూటాల పోలీ అంటే, నా మనువైనా మానుతాను గాని నాగుణం మాత్రం మానను అందట. ఇట్లాంటి రకాల్ని ఎవరూ మార్చలేరు. ఏదో దిగిన పేరంటాలు అత్తగారింట ఉన్నా ఒకటే అమ్మ గారింట ఉన్నా ఒకటే అంటారు. ఎక్కడా పనికిరాదు గదా అందుకే ‘నో వర్క్ నోపే”అనేసిద్ధాంతాన్ని ఆఫీసుల్లోపలికి కూడా తీసుకెళ్లాలి. తలా ఒక తట్ట పని ఇచ్చి “ఇంత పనికి ఇంత జీతం” అని పెట్టాలి. గీతం కోసం పలువరించే వాళ్ళ పని పట్టాలి. ప్రజల చేరువకు సౌకర్యాలు చేర్చాలి.
అప్పుడు : -
“ సాగదు సాగదు ఏ పోరాటం
అవినీతి పంటల యమ ఆరాటం
ఏయ్, ఏయ్, క్యా హువా?
గీతాల గోతం గప్ చుప్ “
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి