అర్హతకు కొలబద్ద కులమా ?
గీటురాయి 8-1-1987
అఖిల భారత బ్రాహ్మణాభివృద్ధి సంస్థవారు మన తెలుగు దేశపు అభిరామన్ననూ ఆహ్వానించి తమ సమావేశంలో అధ్యక్ష స్థానంలో కూర్చో బెట్టి తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. దేవుడి దగ్గర అర్చకులుగా, పూజారులుగా ఉంటున్న బ్రాహ్మణుల అనువంశిక అర్చకత్వాన్ని అలాగే కొనసాగించవయ్యా రామయ్యా అని వారు అభ్యర్ధించారు. ఇతర కులాల వాళ్ళు అర్చకత్వపు పరీక్షలు రాసి పూజారులు కావటానికి వీలులేదని, బ్రాహ్మణులు మాత్రమే పూజారులు కాదగుననీ దాని భావం. బ్రాహ్మణ అర్చకుల వంశ పారంపర్యత్వాన్ని కాపాడవలసిందని వారి కోరిక.
హరిదాసుకు అందరూ తనవారే అన్నట్లు ఈ రాజయోగికి ఎవరితో నయినా ఇట్టే కలిసి కరిగిపోయే లక్షణం సహజంగా అబ్బింది. ఈయన సాయిబుల్లో సాయిబుగా, కోయవాళ్లలో కోయవాడుగా, బ్రాహ్మల్లో బ్రాహ్మణుడిగా సాక్షాత్కరించగలడు.
బ్రాహ్మణ మహాసభ గనుక మంచి మంచి పురాణ ఇతిహాసాలతో కూడిన ప్రసంగాలు సంస్కృత శ్లోకాలు నోటిలో పెట్టుకొని వెళ్ళాడు అన్న గారు. నాది వివేకానందుడి మతం అన్నాడు. “ఏది బ్రాహ్మణం ఏది అబ్రాహ్మణం?” అంటూ ఎదురు ప్రశ్నలు వేశాడు. శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు మొదలైన దేవతా మూర్తులంతా బ్రాహ్మణులు కాదు క్షత్రియులు అని ఖండితంగా చెప్పాడు. గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించిన విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడేనని అందువలన దేవుడి దగ్గర పూజారితనం నిర్వహించేటందుకు కావలసింది బ్రాహ్మణత్వం కాదని, భక్తి ప్రపూరితమయిన మానవత్వమేననీ మొహమాటం లేకుండా చెప్పాడు.
అన్నగారి వాదం సమంజసంగానే అనిపిస్తున్నదని ఇంకా కొందరు అదే సభలో వంత పాడారు . 1968 ప్రాంతాలలో శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి అనే సంస్కృత లెక్చరర్ తన “రామాయణ రహస్యాలు” అనే పుస్తకంలో ఈ విషయం విపులంగా ఇలా వివరించారు : - “ బ్రాహ్మణుడనగా ఎవ్వడని మాత్రము ఇప్పటికినీ సహేతుకముగా నిర్ణయింపను వీలు లేదు. ఆ శాస్త్రాలలోనే నిర్వచించిన బ్రాహ్మణ శబ్దమును బట్టి నిరూపింపదగిన బ్రాహ్మణుడు ఇప్పుడు కాదు ఎవ్వడునూ కనిపించడు. కలియుగ మందసలు బ్రాహ్మణుడే ఉండడని బృహన్నారదీయము పలికినది. అర్షయుగములో మనకు గన్పించు ఋషి
నామధేయులందరూ కులగోత్రాదులే లేక, చావు పుట్టుకలు గాని – అమ్మ అయ్యలు గాని లేని బిడ్డలుగానే జన్మించిరి. దారిని బోవు ఏ సుందరాంగినో ఎవడో చూచి మోహించుట – వీర్యస్ఖలనమగుట – దానిని వారిలో ఒక వ్యక్తి పదిలముగా దీసికొని వెళ్ళి కుండలోనో దొప్ప లోనో దాచుకుని కోడివలే పొదుగుట – కొన్నాళ్ళకో కొన్నేండ్లకో ఏదో బిడ్డ వెలుపలికి వచ్చుట – వారిలో కొందరు అప్పటికప్పుడే నూనూగు మీసాల నూత్న యౌవనముతో ప్రయాణము కట్టుట, ఇట్టివి ఆనాటి పుట్టుకలు – పురుళ్ళు. ఆ వ్యక్తులే ఆవల ఏదో ఙ్ఞానము సంపాదించి కొందరను వశీకరించుకొని ఋషులుగా - మహర్షులుగా - రాజర్షులుగా – ఙ్ఞానులుగా పరిణమించిరి. వారినే కొన్నాళ్ళకు బ్రాహ్మణులుగా భావించిరి. వారే బ్రాహ్మణులు, వారి ఎడల జూపవలసిన భక్తి పేరే బ్రాహ్మణ భక్తి. వారే ఈ భూమికి దేవతలు. "
“గోత్ర ఋషులు ఎనిమిది మందిలో ఒక్క విశ్వామిత్రుడే స్వచ్ఛమైన ఆర్యుడు. తక్కిన వారు అనార్యులు లేదా ఆర్య అనార్య జాతుల వారి మిశ్రమ సంతానం “ అని శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు తన ‘సీత జోస్యం’ పుస్తకంలో వ్రాశారు. శ్రీ డి. డి. కోశాంబిగారు వ్రాసిన “On the origin of the Brahmin gotras” అనే పరిశోధక వ్యాసంలో బ్రాహ్మణుల గురించిన మరిన్ని వివరాలు ఉన్నాయి.
ఏతావాతా తేలిందేమంటే కులాలనేవి ఆది నుండీ లేవు. కల్పించుకున్న కులాలేవీ నేడు స్వచ్ఛంగా లేవు. సంకరమైపోయాయి. అవి మనుష్యుల మధ్య తేడాలను కల్పిస్తూ అలాగే వర్ధిల్లటం అనవసరం, అనర్ధం . “మానవులంతా సమానులే”ననే దృక్పధాన్ని అవలంబించటం మంచిది. గౌరవనీయుడు దైవ పరాయణత, నిజాయితీ తత్పరత గలవాడేగానీ కులతత్వం మూర్తీభవించిన వాడు కాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి