ఇంద్రజాలం, మహేంద్రజాలం, రాజకీయం !
గీటురాయి 1-1-1987
హైదరాబాదులోని గాంధీభవన్ లో జూనియర్ సర్కార్ ఇంద్రజాల ప్రదర్శన, అసెంబ్లీ సమావేశాలు ఒకే రోజున మొదలయ్యాయి. అందువల్లనేనేమో ఎవరి నోటైనా ఇంద్రజాలమనే పదం పలికింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగానే ఉంది అని ఆర్ధిక మంత్రి ప్రసంగిస్తే ఇదంతా మహేంద్రజాలం అన్నారు కాంగైయులు. మరో నాలుగు రోజుల్లోనే వెలువడిన తెలుగు సమాచారం పత్రికలో సైదులు గారు సంపాదకీయం రాస్తూ “ఇంద్రజాల మహేంద్రజాలాలతో ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ చూపగలరు” అని కౌరవసేన లాంటి కాంగీయుల్ని ఎత్తి పొడిచాడు. మరో వారం రోజుల్లోనే ‘సోనియా నా అంతు చూస్తానన్నది’ అని ఉపేంద్ర మోత్తుకుంటే అదంతా ఉపేంద్ర జాలం పొమ్మన్నారు కాంగైయులు. ఇన్ని రోజులపాటు గాంధీ భవనంలో ఇంద్రజాల ప్రదర్శన జరుగుతూనే ఉంది. ఆ సర్కార్ ఏ గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలో ప్రయోగించి ఈ నాయకులంతా ‘ఇంద్రజాలం ఇంద్రజాలం’అని తాము పోయిన చోట్లల్లా ప్రచారం చేసేలా చేశాడేమోనని ప్రజల అనుమానం.
ఇంద్రజాలం కంటే మహేంద్రజాలం మరింత గొప్పదై ఉండవచ్చు. ఈ రెంటిని గురించే అబ్బుర పడుతూ ఒకవైపు తేరుకోలేకుండా ఉంటే, మరో ప్రక్క నుండి ఈ ఉపేంద్రజాలం అనే కొత్త విద్య ఊడిపడింది. అసలు వీటిలో దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో అర్ధంకాక చస్తున్నాఋ జనం .
వెనుకటి రోజుల్లో ఎవడో తల నిజంగా కోసి ఇచ్చినా పుచ్చకాయలే పోవోయ్ అనాడట. రాజకీయ నాయకులు చేస్తున్న ఈ గారడీ పనులు ఇలాగే ఇంకా కొంతకాలం కొనసాగితే నిజం చెప్పినా ప్రజలు నమ్మలేని పరిస్థితి వస్తుంది. డూ డూ బసవన్నా అంటే తల ఊపినన్ని రోజులు ఊపారు. ఇక ఊపేది లేదు అని ఖండితంగా చెప్పే రోజు కూడా దగ్గర్లోనే ఉన్నట్లు నాకు అంతర్వాణి బోధిస్తున్నది.
అసలు ఈ రాజకీయ నాయకులే పెద్ద ఇంద్రజాలికులు అనిపిస్తున్నది. ఓ తలనెరసిన ఇంద్రజాలికుడు ఇలా అన్నాడు:
“చుప్, ఓం, మంత్రకాళీ! అంటూ
మాయ చూపిస్తే ఇంద్రజాలం
ఇదిగో రేపే, ఇప్పుడే, ఇక్కడే అంటూ
దగా చేస్తుంటే రాజకీయం”
ఇంద్రజాలం అనే పని ఇంద్రుడు చేస్తుండే వాడేమోనని దాని అర్ధం కోసం నిఘంటువులు వెదికితే ఓ పురాతన గ్రంధంలో ఇలా ఉంది. “మంత్రౌషధాదులచే నొక విధమగు పదార్ధమును మరియొక విధముగా జూపెడు విద్య” అయితే దీనికి ‘ఇంద్రజాలం’ అని పేరెందుకు వచ్చింది? గౌతముని వేషంతో వచ్చి ఇంద్రుడు అహల్యను కలవటం వల్లనే అయ్యుండొచ్చుఅని ఇంకో పండితుడి వ్యాఖ్య. మాయా ప్రవరాఖ్యుడు వరూధినిని కలవటం కూడా ఇంద్రజాలమే. ఈ మాత్రం దానికి మంత్రాలు ఔషధాలు వాడేవాళ్ళట పూర్వం.
ఇప్పుడు కేవలం వాగ్దానాల తోటి, వర్ణనల తోటి క్షామదేశాన్ని సైతం సస్యశ్యామలంగా కళ్ళముందు ఉంచుతారు. రెండు వేల సంవత్సరం నాటికి అందరికి ఇళ్ళు ఇస్తామంటున్నారు. భూముల్ని పంచుతామంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న అద్దె యింటినే స్వంతంగా భావింపజేస్తున్నారు. పస్తులే పరమాన్నం అనుకో అంటున్నారు.
ఈ పనులు చేయటాన్ని ఆ రోజుల్లో ఇంద్రజాలమనీ, గారడీ విద్య అనీ, కనుకట్టు అనీ, వశీకరణమనీ అనుకునేవారు. ఇప్పుడు ఈ పారిభాషక పదాలన్నిటినీ తొలగించి మనం ‘రాజకీయం’ అనుకోవటమే ఉత్తమం. ఫలానా నాయకుని ‘ సమ్మోహన శక్తి’ ఏ మాత్రం సడలలేదు అంటారు. ఆ సమ్మోహన శక్తి అంటే ఏమిటి ? ప్రజల ముందుకు పోయి లేనిపోని వాగ్దానాలు చేసి, ప్రత్యర్ధులను పడదిట్టి, నేను పదవిలోకి వస్తే కొండంత బంగారం తవ్వి మీ తల మీద కెత్తుతాను అని చెప్పి వారిని ఒప్పించగలగటమే గదా ! అలా జనాన్ని ఒప్పించటం, నువ్వు తప్ప మాకిక దిక్కులేదు అని అనిపించుకోవటం ఏ ఇంద్ర జాలికుడికైనా సాధ్యమేనా? ఏ హిప్నోటిస్ట్ కైనా వల్ల అయ్యే పనేనా? మరి ఇలాంటి పనిని రాజకీయ నాయకులు అవలీలగా చేయగలుగుతున్నారు. అంతటి దిట్టలు కూడా ఏమీ ఎరుగని అమాయకుల్లాగా అప్పుడప్పుడూ తమలో కొందరిని ఇంద్రజాలికులతో పోల్చుకోవటం అన్యాయంగా ఉంది. అసలు కొత్తగా అలా పోల్చుకోవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మంత్రాలు ఔషదాలతో కూడిన కనికట్టు విద్య ఇంద్రజాలమయితే, మనుషులను మభ్యపెట్టి వారిని తమ తమ బందెలదొడ్లలో కట్టి పడేసే విద్యే రాజకీయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి