చేవ లేని చావు చచ్చినా వద్దు
గీటురాయి 20-2-1987
చరిత్రాత్మకమైన చార్మినార్ మీద నుంచి దూకి చనిపోయిన చానలెక్కడున్నారోగాని చార్మినార్ ను మాత్రం మూయించారు. వారు చేసిపోయిన ఈ ఘనకార్యం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆత్మహత్య చేసుకోవాలని ఎంతకాలం నుంచి మదనపడ్డారో, ఎన్ని ఆలోచనలు చేశారోగాని చివరికి చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే నిర్ణయం తీసుకున్నారు.
దూకి చద్దామని చార్మినార్ పైకెక్కి ధైర్యం చాలక దిగి వచ్చిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు. నా మట్టుకు నేను చార్మినార్ మొదటి అంతస్తు నుంచి కిందికి చూచి “ఇక్కడి నుండి దూకి చనిపోయే సాహసం ఎవ్వడూ చేయలేడు”అనుకొనేవాడిని.కానీనిజంగాచచ్చిపోదామనుకొన్నవాళ్ళకు దూకటానికి చింత చెట్టయితేనేమీ,చార్మినారైతేనేమీ అని ఋజువు చేశారు.
ఇప్పుడు చార్మినార్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న జనం ఆ చచ్చి పోయిన వారి గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో దగ్గర ఉండి వినాల్సిందే.
“ఎక్కి ఈ నగరమంతాటినీ వీక్షించే అవకాశమును మూసి వేసిరే మూర్ఖులు” అని ఒక మూర్ఖుడు మదనపడుతూ వుంటాడు. “ఎంత తెగించినారమ్మా, ఎలా దూకినారమ్మా అంత ఎత్తునుంచి?” అని కొందరు పిరికివాళ్లు ఇప్పటికీ భయపడుతున్నారు. “దూకిరిపో, ఏ కాళ్ళో, చేతులో విరుగవలెగాని చావవలెనా ? చచ్చిరిపో, చుట్టూ వలలు కట్టవలెగాని చార్మినార్ ను మూయవలెనా?” అని కొందరు పండితులు పర్యాటకుల చెవుల్లో సలహాలు ఊదుతున్నారు. “ఆత్మకు చావులేదు. ఈ పాత చొక్కాలు వదిలి కొత్త చొక్కాలు ధరించటానికి వెళ్ళింది అంతే” ఒక వేదాంతి వ్యాఖ్య.
సింగపూర్ జాతీయాభివృద్ధిశాఖ మంత్రి తేచిమాంగ్ వాన్, టేబిల్ మీద
“ చావన్నది ప్రతి మనిషికి తప్పదు కానీ మంచి పేరుతో చావటమన్నది ప్రతి మనిషికి ముఖ్యం” అని రాసి ఉందట. రోజూ ఈ సందేశం చదువుకొని విసుగు పుట్టిందో ఏమో “ఏమిటాల్” అనే నిద్ర మాత్రలు మింగి తనువు చాలించాడు. తన లంచగొండితనం బయటపడి ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాట్ట. మంచిపేరుతో చావటం అంటే ఇదేనేమో!
అసలు పూర్వకాలంలో, పెద్ద పెద్ద కట్టడాలులేని రోజుల్లో ఏ చింత చెట్టుమీదకో, తాటి చెట్టు మీదకో ఎక్కి “దూకుతున్నా, పక్కకు తొలగండి” అని బెదిరించేవారు. కిందకు చేరిన జనం ఆగంతకుల కోర్కెలనామోదించి చెట్టునుండి దింపేవారు.
వాళ్ళు ఎత్తయిన వాటి మీద నుంచే ఎందుకు దూకాలనుకునే వాళ్ళంటే పదిమందికీ కనబడటం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించటం కోసం. ఏ వీధిబావిలోనో దూకితే ఆ వీధి వాళ్ళే వస్తారు. పైగా ఓశ్, బావిలోనేగదా పడింది అని చప్పరించేస్తారు. ఊపిరాడక పోవడం తప్ప ఒళ్ళంతా బాగానే ఉంటుంది అదే పదంతస్తుల డాబా మీదకెక్కి దూకిన వాడిదే పెద్ద సాహసం అంటారు.
పెరటి బావిలో పడతానంటే పడుపో అంటారు. పెద్ద కాల్వలో దూకుతానంటే దూకు చూద్దాం అంటారు. కానీ పెద్ద స్తంభం మీద ఎక్కి దూకుతానంటే ఎవరూ దూకనివ్వరు. చుట్టూ వలయం కట్టి మా తలల మీద పడు అంటారు. దీనంతటి బట్టి అర్ధమవుతున్నదేమిటంటే “ చనిపోయే మనిషి కూడా పేరు ప్రఖాతుల కోసం పాకులాడుతాడు” ఆని. హైదరాబాదులోని మూసీ నదిలోని సాంద్ర రసాయనంలో మునిగి చావటానికి ఇంతవరకు ఎవరూ తెగించలేదు. కారణం? ఆత్మహత్య చేసికొనే మనిషి కూడా గౌరవప్రదమైన, మర్యాదకరమైన, పదిమందీ కొనియాడే పద్ధతిలో ఆత్మహత్య కావించుకుంటాడు.
“హత్యకు ఆత్మహత్యకు తేడా ఏమిటి ? ఒక నిండు ప్రాణం తియ్యటం, అది తనదైన ఇతరులదైనా సరే. అందుకే ఆత్మహత్య కూడా నేరమన్నారు. మొన్నటిదాకా న్యాయవేత్తలు, అయితే ఇప్పుడు కాలం మారింది. “ఆత్మహత్య మా జన్మ హక్కు” అని నిరాశావాదుల అంతర్జాతీయ సంఘం వాదిస్తున్నది. చాలా దేశాల న్యాయస్థానాలు పై వాదనతో ఏకీభవిస్తున్నాయి. ఇటీవల మన సుప్రీంకోర్టు కూడా ఆత్మహత్య నేరం కాదని తీర్పు ఇచ్చింది. ఆత్మహత్యకు దారితీస్తున్న పరిస్థితులను నివారించటం చేతకాని ఆధునికులు ఆత్మహత్య సమంజసమేనని చెప్పే దశకు వచ్చారంటే అంతకంటే ఆత్మహత్య సదృశం మరేముంది ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి