దరిద్రునికి దైవమే తోడు
గీటురాయి 26-7-1991
ధనవంతుడికి
స్నేహితులు చాలా మంది ఉంటారు. దరిద్రుణ్ణి చుట్టాలు కూడా దగ్గరకు రానివ్వరు. ఈ లోక స్వభావం
అలాంటిది. దశ వస్తే దిశ కుదురుతుందని
కొంతమంది అడ్డగోలు పనులన్ని చేసి దశవంతులై పోజూలిస్తుంటారు. వాళ్ళ హృదయం అప్పటికీ చెత్తకుండీలాగా ఉన్నా,
ముఖాన్ని మాత్రం పూల బుట్టలాగా అలంకరించుకొని
బజారు కొస్తారు. సిగ్గు లేని ముఖానికి నవ్వే అలంకారమన్నట్లు బహు మందహాసం తో మర్యాద చూపుతారు.
అయితే కొంతమంది దశ
కోసం ఎంత కలవరించినా అది రాదు. దరిద్రాన్ని ముందు పిలవమంటుంది. దరిద్రుడికి
పిల్లలెక్కువ అన్నట్లుగా వాడి మీద సవాలక్ష భారాలుంటాయి. వాడు ఏ రేవున వెళ్ళినా ముళ్ళ
పరిగే. వాడు చేను సాగు చేస్తే వడగళ్ళ వాన కురుస్తుంది. వాడు సంగీతం పాడితే భూమి ఆకాశాలే
తాళపు చిప్పలుగా మారుతాయి. వాడికి సద్దికట్టి ఇస్తే ఊరిబయట కుంట దగ్గరే
కడుపునింపుకొని వెళతాడు. వాడికి ఆకలెక్కువ. వాడి భార్య దశకొద్దీ దొరికాడు పుసికళ్ళ మొగుడు అని సదా ఈసడిస్తూ ఉంటుంది. వాడు
మాత్రం స్వంత ఇంటిలో సలక్షణంగా సకల సౌకర్యాలతో తులతూగుతూ ఉన్నట్లు అప్పుడప్పుడు కలలుకంటుంటాడు.
కుక్కి మంచంలో పడుకున్న తన దిక్కుమాలినతనాన్ని లేచాక చూచుకోని తిట్టుకుంటాడు. నెత్తి మీద కప్పుకు
పడ్డ కంతలు మనసుకు చిల్లులు పెడతాయి. ఆ కంతల్లోంచి కారేనీళ్లు వాడి కన్నీళ్లతో
కలుస్తాయి. దారిద్ర్యం వాడి ఆరో ఇంద్రియం అవుతుంది.
వీళ్ళిద్దర్నీ
చేసింది దేవుడే. చరిత్ర కందిన కాలం నాటి నుంచి చూసినా పేదలు, శ్రీమంతులు కలిసి జీవిస్తూనే ఉన్నారు.
ఎన్ని దానాలు చేసినా ఎవడి దరిద్ర్యం
తీరుతుంది ? ఎక్కడి దరిద్రులు అక్కడే వున్నారు.
స్వయం
కృషితో దారిద్రాన్ని వదుల్చుకొని ధనవంతులై కొందరు బాగుపడితే, లక్షాధికారి కంటే భిక్షాధికారే మేలు లెమ్మని అడుక్కుతినే
వృత్తినే
అంటిపెట్టుకొని కొందరు ఉన్నారు. అడుక్కుతినే వాడికి అరవై ఊళ్ళు,
అరవై ఆరు రుచులు అన్నట్లుగా దేశమేమిటి,
ప్రపంచమంతా ప్రబలి పోయారు. కాకపోతే
ప్రపంచంలోని అడుక్కుతినే వాళ్ళలో అరవయ్యారు శాతం
మంది ఇండియా (మన కర్మభూమి) లోనే ఉండి ఉంటారు.
అడుక్కుతినే
వాడి ఇంటికి విరసక తినేవాడొచ్చినట్లు టిబెట్టు, శ్రీలంక, బంగ్లాదేశ్
శరణార్ధులు నానా దేశాల్లో చెల్లుబాటు కాని
వాళ్ళంతా మన దేశానికొచ్చి పడుతున్నారు.
అడిగి పెట్టించుకోరా బుడిగి దాసరీ అన్నట్లుగా వాళ్లందర్నీ
మన ప్రభుత్వం కంటికి రెప్పల్లా కాపాడుతోంది. అడుక్కుతిన్నా బోలె అలాదుగా
ఉండాలి అని వాళ్ళు మనలో కలవనే కలవటం లేదు. పైగా అడుక్కుతినే
వాడు పెరుగన్నం కోరినట్లుగా వాళ్ళూ కొన్ని డిమాండ్లు చేస్తున్నారు.
ఈ
మధ్య తిరుపతి లో బిచ్చగాళ్లందరినీ పట్టుకెళ్లి ఓ పెద్ద హాస్టల్ లో
పట్టుపరుపుల
మీద పండబెట్టి గోవిందరాజస్వామిని కొలిచినట్లుగా కొలుస్తామని
టి.టి.డి. వాళ్ళు ఒక పథకం ప్రారంభించారు. ఆ ఊళ్ళో
ఓ పదివేల మంది అడుక్కుతినే వాళ్ళున్నట్లు
అంచనా. ఓ వెయ్యి మందిని పట్టుకెళ్లి సకల
మర్యాదలూ చేసి ఇక మీరిక్కడే ఉండండి అన్నారట. ఈ మర్యాదలకు నాలుగు రోజుల్లోనే మొహం మొత్తి అడుక్కుతినటమే మాకు హాయిగా ఉంది అని భిక్ష గాళ్ళంతా గోడలు దూకి పారిపోయి మళ్ళీ గుడి మెట్ల దగ్గర అయ్యా బాబూ ధర్మం” అంటూ కూర్చున్నారట. ఈ ఊళ్ళో అడుక్కోటానికి వీల్లేదు అని అధికారులు అంటే,
ఈ ఊరు కాకపోతే మరో ఊరు అని అడుక్కునే
వాళ్ళంతా తెగేసి చెప్పారట. పైగా తిరపతిలోనే అడుక్కునే
హక్కు కోసం ఐక్యంగా పోరాడుతున్నారట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి