2, జనవరి 2013, బుధవారం

బిచ్చం బిడ బిడ కుండలు లొడలొడ



బిచ్చం బిడ బిడ కుండలు లొడలొడ

గీటురాయి 20-11-1992

రాష్ట్రంలోని బీద వాళ్ళకేసే బిచ్చపు బియ్యం కోటాను 16 కిలోల నుండి 20 కిలోలకు పెంచారు. బిచ్చం బిడబిడ కుండలు లొడలొడ అన్నట్లుగా పెరిగిన ఈ నాలుగు కిలోలతో పేదవాళ్ళ బ్రతుకులేమీ బాగుపడవుగాని, రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 50 కోట్ల రూపాయల భారం నెత్తిన పడుతుంది. బొక్కలో నిద్రపోయే నక్క కలలో తనవాత పడే కోళ్ళను లెక్క పెట్టుకున్నట్లుగా ఏవేవో చేసి రాష్ట్ర ఆర్ధక పరిస్థితిని పరిపుష్ఠం చేస్తామని నాయకులు లెక్కలు గట్టి చెప్పారు. బోడిముండకు తలసుళ్ళు వెదికినట్లు, బోడెద్దుకు పోట్లు మరపినట్లు, ఆర్థిక సలహాదారులంతా నానా రకాల ప్రయోగాలు చేయించారు. బియ్యం దంచిన వాడికి బొక్కిందే దక్కుదల అన్నట్లుగా రాష్ట్రంలోని బీద మొహం వాళ్ళంతా నేతలు ప్రసాదించిందే ప్రాప్తంగా ఎంచుకుని అదో రకమైన నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.

కిలో అయిదు రూపాయల చొప్పున కార్డుకు 20 కిలోలు పట్టణ ప్రాంతాల్లో మిల్లర్లు అమ్ముతారని మరో ప్రయోగం. పల్లె ప్రాంతాల వారికి ఈ సౌకర్యం లేదు. పల్లెలకు పామాయిలూ లేదు. బిచ్చపు వాడు బీదవాడికి లోకువ అన్నట్లుగా పట్టణ ప్రాంతాల్లో తెల్లకార్డు ఉన్నవారికి పల్లెల్లో తెల్లకార్డులున్న వాళ్ళు లోకువయ్యారు. ఒక పద్ధతి పాడూ లేకుండా ఏదో దయ తలచి చేసే సంతర్పణలాగా ఉంది గానీ ఈ బియ్యం పంపకంలో న్యాయం లేదు. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నారు. అసలు ఈ బియ్యం వ్యాపారం నెత్తికెత్తుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు కోరారు ? బహిరంగంగా మార్కెట్ లో బియ్యం అందరికీ అందుబాటు ధరల్లోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. లేవీలు విధించి, ద్వంద్వ ధరల విధానం ప్రకటించి, డీలర్లను, అధికారులను, బ్లాక్ మార్కెటీర్లను, మిల్లర్లను మేపటం మినహా ఈ బియ్యం పథకం ల్ల ఒరిగింది ఏమి లేదు.

సబ్సడీ పేరుతో పై నుంచి క్రింది వరకు స్వాహా కార్యక్రమం అమలు జరుగుతోంది. నాసిరకం బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. పాడి అవును దానం చేసి, పాలు తాను పితుక్కున్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. పేలాలు చల్లి దయ్యాల్ని లేపినట్లుగా నెలనెలా ఈ బియ్యం పంపకం పెద్ద సంతలాగా తయారుచేశారు. సారాయి మీద వచ్చే అదాయంతో బియ్యం మీద సబ్సిడీ ఇస్తున్నామని జనాన్ని మోసం చేస్తున్నారు. మా కొంపలు గుల్ల చేసే మీ సారాయి వద్దు. మా ఆరోగ్యాన్ని హరించే మీ ముక్కి పోయిన సబ్సిడీ బియ్యమూ వద్దు. ఈ డబ్బు అభివృద్ధి కార్యక్రమాలకు వాడండి అని జనం అడుగుతున్నారు. బిచ్చపు కూటికి  శనేశ్వరం అడ్డం పడ్డట్లుగా కొంతమంది పేదలు బాధపడవచ్చు గానీ ఈ పథకం వల్ల తమ పేదతనం అంతరించదని గ్రహించాలి.

బిడ్డ బావిలో పడ్డాడంటే చద్దికూడు తిని వస్తానుండు అన్నాడట ఓ స్వార్ధపరుడు. రాష్ట్ర ప్రభుత్వం సారాయినీ, బియ్యాన్నీ వెంటనే వదిలిపెట్టి పనికి ఆహార పథకం ప్రారంభించాలి. ఈ పథకం వల్ల అభివృద్ధితోపాటు లక్షలాది శ్రామికులకు పని దొరుకుతుంది. సారాయి సబ్సిడీ రెండూ లేనందువల్ల సోమరితనం, బాధ్యతారాహిత్యం నశిస్తాయి.

బిచ్చానికి పోయినా బిగువు తప్పలేదు, దుప్పటి పోయినా పల్లెవాటు తప్పలేదు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ బలవంతపు బ్రాహ్మణార్ధం మానుకొని ఈ బిగువును రాష్ట్ర సరిహద్దుల దగ్గర చూపాలి. మన రాష్ట్రం నుండి గింజ బియ్యం బయటికి పోకుండా చూస్తే చాలు ఓపెన్ మార్కెట్లో బియ్యం రేట్లు వాటంతట అవే తగ్గుతాయి. సారాయి మానుకోవటం వల్ల ఆదా అయ్యే డబ్బుతో పేద ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి