సిగ్గులేని సింగారమే రాజకీయ వయ్యారం
సిగ్గెందుకు లేదురా జగ్గా అంటే, నల్లటివాడిని
నాకెందుకు సిగ్గు అన్నాడట. ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే తేడా లేకుండా ఆ పార్టీలోకి ఈ
పార్టీలోకి కుప్పిగంతులు వేసే రాజకీయ నాయకులు ఎప్పుడూ ఉంటారు. ఒక పార్టీ తరఫున
గెలిచిన తరువాత మందీ మార్బలంతో సహా అవతలి పార్టీలోకి వలస పొయ్యే వాళ్ళూ ఉన్నారు.
అయితే వీళ్ళందరిలో ఒకానొక విశిష్ట పదార్థం ఉండదు. ఆ పదార్థం పేరు “సిగ్గు”. ఇది
వారిలో కొరవడటం వల్ల పదిమందీ ఏమనుకొంటున్నా వారికి ఏమీ అనిపించదు. అసలు
వినిపించదు.
సిగ్గు చిన్ననాడేపోయే, పరువు పందిట్లో పోయే.
కొరావా సరవా ఉంటే గదిలో పోయే అన్నట్లు పార్టీలు మారి మారి వీరికి “సిగ్గు పడాలి”
అనే సంగతి జ్నాపకం కూడా లేదు. ఇలాంటి జాబితాలో ఒక ప్రముఖుడు ఉన్నాడు . అంతటి ఆచార్యుడు కూడా కొద్దో గొప్పో సిగ్గుపడి పేరు మార్చుకున్నారు ఎందుకంటే ప్రజలు తేలికగా
గుర్తించకుండా ! ఏ పార్టీలో చూచినా ఈయనే కనపడేవారు. అందుకని ఆయన్ని “రంగులు మార్చే
రంగా” అనే బిరుదుతో ప్రజలు సత్కరించారు. మొదట స్వరాజ్యమనీ,
తరువాత స్వతంత్రమనీ అరచిన నాయకులంతా చివరికి కాంగ్రెసనే సముద్రంలో నీటి బొట్టుల్లా, కాకి రెట్టల్లా కలిసి పోయారు. అలా పేరుగాంచిన కాంగ్రెస్ పెద్దలు కూడా ఉల్కల్లాగా
బీజేపీ లోకి రాలి పోయారు. సంతానంకోసం సప్త సముద్రాల్లో స్నానం
చేస్తే, ఉప్పునీరు
తగిలి ఉన్నదికాస్తా ఊడిపోయిందట.కొందరికి పార్టీలు మారటం అసలు కలిసి రాలేదు.
సెబాష్ మద్దెలగాడా అంటే, అయిదువేళ్ళు
పగలకొట్టుకున్నట్లు, కొందరు సుబ్బారాయుళ్ళు డబ్బారాయుళ్ళ
ఊదరకు దెబ్బతినిపోయారు. సవరదీసినకొద్దీ నిక్కినట్లు ఆరోజు ఎంత బ్రతిమిలాడి
భంగపడినా బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇందిరా గాంధీకి
ఇవ్వలేదు. చివరికి సిగ్గుమాలిన ముఖానికి నవ్వే అలంకారమన్నట్లు బ్రహ్మానందపడుతూ
ఇందిరా కాంగ్రెసులోనే చేరిపోయారు. హర్షుణ్ణి నమ్ముకుని పురుషుణ్ణి
పోగొట్టుకున్నట్లు వెంగళరావుగారు అర్సును ఆవు దూడను నమ్ముకుని ముఖ్యమంత్రి పదవి
కోల్పోయారు. ఇదే చాన్సనుకొన్న చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రై చక చకా తన తపనంతా
తీర్చుకొన్నారు. అసలు కాంగ్రెస్ లో
రాణించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలని ‘అమ్మ’ నిత్యమూ అంటుండేది. అందులో ప్రధానమైనది “సిగ్గులేనితనమే” నట. “సొంత ఆలోచన
లేక పోవటం” కూడా మరొక అర్హత అని మురార్జీభాయ్ శలవిచ్చాడు. అయితే ఈ అర్హతలు
కాంగ్రెస్ కే కాదు ఏ పార్టీకైనా
వర్తిస్తాయి అని నాకు నిదానంగా తెలిసింది.పదవిపోయిందని అలిగి నాదెండ్ల, చెన్నారెడ్డి వేరే పార్టీలు పెట్టారు.“వి. బి. రాజుకి పదవి ఇవ్వొద్దు, చెన్నారెడ్డిని ఖాళీగా ఉంచొద్దు” అని వెనుక ఒక సామెత ఉండేది. అయితే
సిగ్గుమాలినదాన్ని చిటికేస్తే, ఆరామడనుంచి ఆలకిచ్చిందట.మూపనార్,చవానుల్లాగా పార్టీ బయట నిలబడి కాల్ లెటర్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్న
నిరుద్యోగులందరికీ ఆహ్వానం రాగానే తట్టాబుట్టా సర్దుకొని సంసిద్ధమయ్యారు.సిగ్గుపడితే
ఎలా?
అరిచే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండవన్నారు రాజకీయ పెద్దలు.పాదయాత్రల ప్రభావం చూశాక తిరిగి రైతు – తిరక్క రాజకీయ బైరాగి చెడతాన్నారు.పనిదొరకని
రాజకీయ బైరాగులు పూటకొక పార్టీ చొప్పున తిరిగీ తిరిగీ మళ్ళీపాత పార్టీ లోనే చేరి పోయారు. ఎవరికీ
వెరవటంలేదు.ఏనుగునెక్కి రంకుకు పోయినట్లుగా పోతున్నారు. శక్తిచాలనివాడు సాధుత్వము
వహించినట్లు గోడమీద పిల్లులు కొంత కాలం గమ్మున ఉన్నా మనసంతా సంపాదన గల పార్టీ పైనే
పెట్టుకున్నారు.వైసీపీ
ఎమ్మెల్యేలు 24 మంది
టీడీపీ లోకి దూకారని నలుగురు మంత్రి పదవులనుకూడా పొందారని,పార్టీ
ఫిరాయింపుల్ని వెంకయ్యనాయుడు ప్రోత్సహించటం తప్పనీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన చెందారు.జూపూడి,సుజనా చౌదరి,వెంకటేశ్,సియంరమేష్...
ఇలా వీళ్ళవరస పెరుగుతూనే పోతోంది.భార్యా భర్తలు చెరో పార్టీలో
ఉండకూడదని,పాతపార్టీకి పదవికి రాజీనామా చేశాకే కొత్తపార్టీలో
చేరాలని కొత్త నిబంధనలు పెట్టినా జరిగేవి
జరుగుతూనే ఉన్నాయి.సిగ్గులేని సింగయ్యలు లంచగొండి అధికారులకు ధీటుగా దేశంలో
చాలామంది ఉన్నారు,ఈ నాయకులు కూడా అధికారాన్ని, డబ్బును ఆశించే పార్టీలు మారుతున్నారు.పూర్వం కొంత సిద్ధాంత బలం
ఉండేది.నేను చచ్చిందాకా ఒకటే పార్టీ అనే భీష్ములు అంపశయ్యల పాలయ్యారు.ఇప్పుడు మంచి
తరుణంలో పార్టీలు మారేవాడే సరైన,తెలివైన రాజకీయనాయకుడు అంటున్నారు.ఇప్పుడున్న పార్టీలోనే
ఉంటావా మరో పార్టీలోకి దూకుతావా అంటే కార్యకర్తల
కోరికమేరకు నడుచుకుంటానని అంటాడు.ఓటర్లు ఏమనుకుంటే మాకేమని కొందరు ఏకంగా తాము స్థాపించిన
పార్టీలనే వదిలేసి మరోపార్టీలో చేరలేదా ? ఆహారం (సంపాదన) దగ్గరా అధికారం(పదవి) దగ్గరా
సిగ్గుపడకూడదనే సామెత గుర్తు చేస్తాడు. పదవికోసం సిగ్గులేని గాడిద లాగా పరుగెత్తావెందుకురా
అంటే నా కడుపు కక్కుర్తి నీకేమి తెలుసు అంటాడు.పూర్వం రాజకీయ వ్యబిచారమనే పేరు ఇప్పుడు
ఆకర్ష్ గా మారింది.రాజకీయ విటులను రకరకాల ప్రలోభాలతో ఆకర్షిస్తున్నారు.పార్టీ మారటమే
ప్రజాస్వామ్య రక్షణకు ఉత్తమ విధానమని
వ్యాఖ్యానాలూ చేస్తున్నారు. గోడదూకటం తప్పనే వాళ్ళూ అక్కడక్కడా ఉన్నారు. జయపాల్ రెడ్డి పాడెమోసిన కర్ణాటక స్పీకర్ రమేష్ ముగ్గురు
రెబెల్ ఎమ్మేల్యేలు 2023 వరకు పోటీ చేయటానికి అనర్హులని ప్రకటించి రాజీనామా చేశారు.
ప్రమాణ స్వీకారానికి ముందు ఎమ్మెల్యేలు గోడలు దూకినా ఫిరాయింపుల నిషేధ చట్టం
వర్తించబోదన్న ప్రమాదకర వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చబట్టి సరిపోయింది.బలనిరూపణ
ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని ఆదేశించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించింది.ఈ
ఊసరవెల్లుల భరతం పట్టే మార్గదర్శకాల క్రోడీకరణ జరగాలి.లేకపోతే పదవులకోసం
పార్టీలు మారే ఫిరాయింపుదారులు ఆగరు.ప్రజాతీర్పుపై
దుర్రాజకీయాల దండయాత్ర చేస్తూనే ఉంటారు.